Share News

ఇంద్రకీలాద్రికి ఘాట్‌ రోడ్‌ బంద్‌.. భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉచిత బస్సులు

ABN , Publish Date - Sep 21 , 2026 | 08:58 PM

దసరా మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఈ మేరకు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం సహా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఘాట్‌ రోడ్‌ మరమ్మతు పనులు చేపట్టనున్నారు అధికారులు.

ఇంద్రకీలాద్రికి ఘాట్‌ రోడ్‌ బంద్‌.. భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉచిత బస్సులు

ఇంటర్నెట్ డెస్క్: దసరా మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఈ మేరకు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం సహా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఘాట్‌ రోడ్‌ మరమ్మతు పనులు చేపట్టనున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి వారం రోజుల పాటు ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌ను పూర్తిగా మూసివేయనున్నారు. ఈ రోజుల్లో భక్తులు కనకదుర్గానగర్‌ మార్గం ద్వారా అమ్మవారి ఆలయానికి చేరుకోవాలని సూచించారు. వాహనాలతో వచ్చే భక్తులు ప్రత్యామ్నాయ పార్కింగ్‌ ప్రదేశాలను వినియోగించుకోవాలన్నారు.


హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను పున్నమి ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశంలో నిలిపి వేయాలని అధికారులు కోరారు. ఇక విశాఖపట్నం, చెన్నై ప్రాంతాల నుంచి వన్‌టౌన్‌ వైపు వచ్చే భక్తులు సీతమ్మ వారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన హోల్డింగ్‌ ఏరియాలో తమ వాహనాలను పార్కింగ్‌ చేసుకోవాలని సూచించారు. ఆయా పార్కింగ్ ఏరియాల నుంచి దేవస్థానం ఏర్పాటు చేసే ఉచిత బస్సుల ద్వారా ఇంద్రకీలాద్రికి చేరుకోవచ్చని తెలిపారు. ఘాట్‌ రోడ్‌ మూసివేసే వారం రోజుల పాటు భక్తుల సౌకర్యార్థం ప్రధాన పార్కింగ్‌ ప్రదేశాల నుంచి దేవస్థానం వరకు ఉచిత రవాణా సదుపాయాన్ని అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


గతంకంటే ఘనంగా..

ఇంద్రకీలాద్రిపై ఈ ఏడాది దసరా మహోత్సవాలను గతంకంటే ఘనంగా నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ కార్యదర్శి కె.క‌న్నబాబు తెలిపారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రసాదాల పంపిణీ వసతి కూడా కల్పించనున్నట్టు వెల్లడించారు. భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించడం సహా భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు ఏఐ సాంకేతికతను అనుసంధానించనున్నట్టు పేర్కొన్నారు. భక్తుల రాకపోకలు, రద్దీ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టం చేశారాయన.


ఇవీ చదవండి:

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి చుక్కెదురు

ఢిల్లీలో మూడో జాతీయ ఏఎన్‌టీఎఫ్ సదస్సు.. ప్రారంభించనున్న అమిత్‌ షా

Updated Date - Sep 21 , 2026 | 08:59 PM