Share News

ఆ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీదే హవా!

ABN , Publish Date - May 04 , 2026 | 06:34 PM

దేశంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలూ వెలువడ్డాయి.

ఆ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీదే హవా!
Assembly bypoll results 2026

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలూ వెలువడ్డాయి. ఈ ఏడాది జనవరిలో విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో సహా ఆయా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మృతిచెందడం వల్ల ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మహారాష్ట్రలో రాహురి, బారామతి; కర్ణాటకలో బాగల్‌కోట్, దావణగెరె సౌత్; గుజరాత్‌లో ఉమ్రత్, నాగాలాండ్‌లో కోరిడాండ్, త్రిపురలో ధర్మనగర్‌లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. తాజాగా వీటి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఈ ఏడింట్లో నాలుగు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేయగా.. మరో మూడింట్లో కాంగ్రెస్ గెలుపొందింది.


మహారాష్ట్రలో ఉన్న బారామతి అసెంబ్లీ స్థానం.. రాజకీయ పలుబడి ఉన్న పవార్ కుటుంబానికి కంచుకోట. సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్ పవార్ జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో మరణించడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య, కాంగ్రెస్ అభ్యర్థి సునేత్ర అజిత్ పవార్ ఆ స్థానం నుంచి పోటీ చేశారు. 2,18,034 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. మరో స్థానం రాహురిలో కాంగ్రెస్ అభ్యర్థి గోవింద్ మొకాతెపై 1,12,587 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి అక్షయ్ శివాజీరావ్ ఘన విజయం సాధించారు.


ఇక.. కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో కాంగ్రెస్ నేత ఉమేశ్ హుళ్లప్ప మేటి 22,332 ఓట్ల తేడాతో బీజేపీపై గెలుపొందారు. బీజేపీ తరఫున చరన్‌మితత్ వీరభద్రయ్య(వీరన్న) పోటీ చేశారు. కర్ణాటకలోని దావణగెరె సౌత్‌లోనూ కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస టి.దాసకరియప్పపై 5,708 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సమర్థ్ మల్లికార్జున విజయం సాధించారు.


గుజరాత్‌లోని ఉమ్రత్‌లో బీజేపీ అభ్యర్థి హర్షత్‌భాయ్ గోవింద్‌భాయ్ పర్మార్ 30,743 ఓట్ల తేడాతో కాంగ్రెస్ నేత భృగురాజ్ సింగ్ చౌహాన్‌పై ఘన విజయం సాధించారు. హర్షద్ పర్మార్‌కు 85,500 ఓట్లు రాగా, భృగురాజ్‌కు 54,757 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గోవింద్ పర్మార్ మృతిచెందిన కారణంగా ఈ ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. అక్కడ గోవింద్ కుమారుడు, హర్షత్ భాయ్ విజయం సాధించడం విశేషం.


నాగాలాండ్‌లోని కోరిడాండ్‌లో బీజేపీ అభ్యర్థి దావోచియర్ ఐ.ఇమ్‌చన్, ఇండిపెండెంట్ అభ్యర్థి తోషికాబా మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇందులో ఇండిపెండెంట్ అభ్యర్థి తోషికాబాపై 3,123 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దావోచియర్ గెలుపొందారు.

త్రిపురలోని ధర్మనగర్‌లో సీపీఐ(మార్క్సిస్ట్) అభ్యర్థి అమితాబ్ దత్తపై 18,290 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి జహర్ చక్రబరోటి విజయం సాధించారు.


ఇవి కూడా చదవండి..

మూడు రాష్ట్రాల్లో విజయం దిశగా బీజేపీ.. అంబరాన్ని అంటుతున్న సంబరాలు..

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్ సహా ముగ్గురుn

Updated Date - May 04 , 2026 | 06:34 PM