Share News

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్ సహా ముగ్గురు

ABN , Publish Date - May 04 , 2026 | 05:15 PM

కేరళం ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్, పార్టీ కేరళం విభాగం మాజీ అధ్యక్షుడు రమేష్ చెన్నితాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్ సహా ముగ్గురు
KC Venugopal

తిరువనంతపురం: పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కేరళం (Keralam)లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టనుండటం ఖాయమైంది. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రభుత్వం కేరళంలోని 140 స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్‌ను దాటడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


కాగా, ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్, పార్టీ కేరళం విభాగం మాజీ అధ్యక్షుడు రమేష్ చెన్నితాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రమేష్ చెన్నితాల సీనియర్ మాత్రమే కాకుండా కేసీ వేణుగోపాల్, సతీశన్ కంటే కూడా ఎక్కువ రాజకీయ అనుభవం కలిగి ఉన్నారు.


వేణుగోపాల్ వయస్సు 63 ఏళ్లు కాగా, సతీషన్ 62లోకి అడుగుపెట్టారు. చెన్నితాల ఈనెలలో 70వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ ముగ్గురూ నాయర్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. కేరళ జనాభాలో సుమారు 12 శాతం మంది నాయర్ సామాజిక వర్గం వారున్నారు.


కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి విశ్వసనీయ నేతగా కేసీ వేణుగోపాల్‌కు పేరుంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో అసంతృప్తి నేతలను కలుపుకొని వెళ్లి పార్టీని ఏకతాటిపైకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా గత ఏడేళ్లలో ఆయన పలు విమర్శలు ఎదుర్కొన్నారు. విద్యార్థి నేతగా కేరళలో తన రాజకీయ జర్నీని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో, కేంద్రంలో గతంలో మంత్రి పదవులు చేపట్టారు. ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.


వీడీ సతీశన్

కేరళంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే సీఎం పదవికి సతీశన్ కీలక పోటీదారు. విపక్ష నేతగానే కాకుండా ఎన్నికల్లోనూ ఆయన గత ఐదేళ్లుగా కీలంగా వ్యవరించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను గట్టి సవాళ్లు విసిరి ఆయనను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అయితే నాయర్ కమ్యూనిటీలో ఆయన కంటే రమేష్ చెన్నితాలకే ఎక్కువ ఆదరణ ఉంది.


రమేష్ చెన్నితాల

కేరళ కాంగ్రెస్ నేతల్లో సీనియర్ నేత రమేష్ చెన్నితాల. ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా ఇదే ఆయనకు చివరి అవకాశం. పాలనాపరమైన అనుభవంతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో సమర్థుడనే పేరుంది. యూడీఎఫ్ కూటమిలోని పార్టీలు కూడా ఆయనను బలంగా విశ్వసిస్తుంటాయి. తాజా ఎన్నికల్లో ఆయన క్యాంపెయిన్ కమిటీకి సారథ్యం వహించారు. కాంగ్రెస్ సాంప్రదాయం ప్రకారం తొలుత కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో పార్టీ అధిష్టానం నియమించిన కాంగ్రెస్ పరిశీలకులు సమావేశమవుతారు. వారి అభిప్రాయలను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తారు. అనంతరమే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఎవరికైతే ఉంటుందో వారికే సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉంటాయి.


ఇవి కూడా చదవండి..

విజయ్‌కు మెజారిటీ తగ్గితే.. కలిసొచ్చే పార్టీలు ఇవేనా

వెస్ట్ బెంగాల్ సీఎం రేసులో బీజేపీ దిగ్గజాలు.. సువేందు అధికారి, దిలీప్ ఘోష్‌!

Updated Date - May 04 , 2026 | 06:10 PM