విజయ్‌కు మెజారిటీ తగ్గితే.. కలిసొచ్చే పార్టీలు ఇవేనా
ABN , Publish Date - May 04 , 2026 | 04:07 PM
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టిన విజయ్ సారథ్యంలోని టీవీకే విజయపథంలోకి దూసుకెళ్తోంది. అయితే మెజారిటీకి 118 సీట్లు అవసరమవుతాయి. మెజారిటీ తగ్గిన పక్షంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఏయే పార్టీలతో టీవీకే సంప్రదింపులు జరిపే అవకాశం ఉందనే దానిపై తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
చెన్నై: తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టిన విజయ్ (Vijay) సారథ్యంలోని టీవీకే (TVK) విజయపథంలోకి దూసుకెళ్తోంది. 108కి పైగా సీట్లలో గెలుపు దిశగా పయనిస్తోంది. అయితే మెజారిటీకి 118 సీట్లు అవసరమవుతాయి. మెజారిటీ తగ్గిన పక్షంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఏయే పార్టీలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందనే దానిపై తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునేది లేదని టీవీకే ఇంతకుముందే ప్రకటించింది. అయితే టీవీకే మెజారిటీకి అతి దగ్గరలో ఆగిపోయిన పక్షంలో ఆ పార్టీ మద్దతు తీసుకునే అవకాశాలను తోసిపుచ్చలేమని అంటున్నారు. కాగా, సెక్యులర్ ప్రొగ్రసివ్ అలెయెన్స్‌లో భాగంగా డీఎంకేతో కాంగ్రెస్, సీపీఎం పొత్తు పెట్టుకున్నాయి. ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ 5 స్థానాల్లో, సీపీఐ రెండు స్థానాల్లో, సీపీఎం ఒక స్థానంలో గెలుపునకు చేరువలో ఉన్నాయి. డీఎంకేతో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆ పార్టీలోని కొందరు టీవీకే పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌లోని ఒక వర్గం మొదట్నించీ పట్టుపడుతోంది. అయితే చివరి నిమిషంలో డీఎంకేతోనే కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా టీవీకే ఇటు కాంగ్రెస్‌తో పాటు ఐయూఎంఎల్, డీఎండీకే, లెఫ్ట్ పార్టీల సాయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. డాక్టర్ అన్బుమణి రామదాస్ సారథ్యంలోని పీఎంకే మద్దతును కూడా టీవీకే కూడగట్టవచ్చని చెబుతున్నారు. ఏదిఏమైనా పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాతే టీఎంకే వ్యూహరచన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఈ వీడియో దాచిపెట్టుకోండి.. విజయ్ గెలుపును ముందే చెప్పిన ప్రశాంత్ కిషోర్
విజయ్ గెలుస్తారని మేము అంటే అంతా నవ్వారు: యాక్సిస్ మై ఇండియా చీఫ్