Share News

విజయ్ గెలుస్తారని మేము అంటే అంతా నవ్వారు: యాక్సిస్ మై ఇండియా చీఫ్

ABN , Publish Date - May 04 , 2026 | 03:08 PM

తమిళనాట ప్రస్తుతం 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ గెలుస్తారని తాము ముందే చెబితే అంతా నవ్వారని అన్నారు. అయితే, ఈ విజయం తమది కాదని డేటా సైన్స్‌ది అని అన్నారు.

విజయ్ గెలుస్తారని మేము అంటే అంతా నవ్వారు: యాక్సిస్ మై ఇండియా చీఫ్
Axis My India on TN Elections Results

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రస్తుతం 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అనుకున్న డీఎమ్‌కే మాత్రం వెనుకంజలో ఉంది. ఈ నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా సోమవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీకే పార్టీ 98కి పైగా స్థానాల్లో గెలుస్తుందని తాము ఎగ్జిట్‌ పోల్స్‌లో అంచనా వేస్తే అంతా నవ్వారని అన్నారు. కానీ చివరకు తమ అంచనాలే నిజమవుతున్నాయని చెప్పారు. అయితే, ఈ విజయం తమది కాదని, డేటా సైన్స్‌ది అని ఆయన వ్యాఖ్యానించారు.

‘టీవీకే విజయంపై మా అంచనాను దేశవ్యాప్తంగా ఎవ్వరూ నమ్మలేదు. అలా జరగదని అంటూ మా అంచనాను కొట్టిపారేశారు. రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు, ఇతర పోలింగ్ ఏజెన్సీలు అంతా మమ్మల్ని చూసి నవ్వారు’ అని అన్నారు.


డీఎమ్‌కే ప్రభావాన్ని యాక్సిస్ మై ఇండియా ఎక్కువగా అంచనా వేసిందా? అన్న ప్రశ్నకు గుప్తా స్పందిస్తూ డీఎమ్‌కేకు 35 శాతం ఓట్లు రావచ్చని తాము భావించినట్టు చెప్పారు. ప్రస్తుతం 32 శాతంగా ఉందని అన్నారు. ఇక తమ అంచనాకు అనుగుణంగా టీవీకే ఇప్పటివరకూ 35 శాతం ఓట్లు సాధించిందని చెప్పారు. అన్నాడీఎమ్‌కేకు 23 శాతం ఓట్లు వస్తాయని తాము అంచనా వస్తే ప్రస్తుతం వారి వాటా 27 శాతంగా ఉందని అన్నారు. రెండో స్థానంలో స్టాలిన్, మూడో స్థానంలో పళనిస్వామి ఉంటారని తాము నమ్ముతున్నామని అన్నారు. ఫలితాలు వెలువడ్డాక పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు.

యువతరం విజయ్‌కు మద్దతు పలకడంతో టీవీకే విజయబావుటా ఎగురవేసిందని చెప్పారు. 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న వారు విజయ్‌కు పట్టం కడతారని తాము అంచనా వేశామని అన్నారు. ఈ వయసుల్లోని వారి వాటా తమిళనాడులో 42 శాతంగా ఉందని అన్నారు. 40 ఏళ్లు పైబడిన వారు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే విజయ్‌కు జైకొట్టారని అన్నారు. అత్యధిక శాతం మహిళల ఓట్లు దక్కించుకున్న పార్టీగా డీఎమ్‌కే తరువాత టీవీకే నిలుస్తుందని కూడా చెప్పారు. అయితే, తమిళనాట మేజిక్ ఫిగర్ అయిన 118 స్థానాలను టీవీకే గెలుచుకోలేని పక్షంలో పార్టీ అధినేత విజయ్ ఏం చేస్తారన్న దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఈ వార్తలనూ చదవండి:

ఈ వీడియో దాచిపెట్టుకోండి.. విజయ్ గెలుపును ముందే చెప్పిన ప్రశాంత్ కిషోర్

ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్‌ని చూసి గర్వపడుతున్నా: ఎస్.ఎ.చంద్రశేఖర్..

Updated Date - May 04 , 2026 | 03:48 PM