Share News

ఈ వీడియో దాచిపెట్టుకోండి.. విజయ్ గెలుపును ముందే చెప్పిన ప్రశాంత్ కిషోర్

ABN , Publish Date - May 04 , 2026 | 03:02 PM

తమిళనాడులో విజయ్ టీవీకే 98 నుంచి 120 సీట్లు గెలుస్తుందని గత ఏడాది మార్చిలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ముందే జోస్యం చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ తాజాగా సునామీ సృష్టిస్తున్నారు.

ఈ వీడియో దాచిపెట్టుకోండి.. విజయ్ గెలుపును ముందే చెప్పిన ప్రశాంత్ కిషోర్
Prashant Kishore with Vijay

న్యూఢిల్లీ: తమిళనాడులో విజయ్ టీవీకే 98 నుంచి 120 సీట్లు గెలుస్తుందని గత ఏడాది మార్చిలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) ముందే జోస్యం చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ తాజాగా సునామీ సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గెలుపు ఖాయమని ఏడాది క్రితమే ప్రశాంత్ కిషోర్ చెప్పిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 'ఈ వీడియో దాచి పెట్టుకోండి. ఫలితాల తరువాత ప్లే చేయండి' అని ఆ వీడియోలో ప్రశాంత్ కిషోర్ సవాలు విసిరారు.


ప్రశాంత్ కిషోర్ గత ఏడాది మార్చిలో తంతి టీవీ (Thanthi TV)కి ఇంటర్వ్యూ ఇచ్చారు. టీవీకే ఆవిర్భావం జరిగి అప్పటికి ఏడాది అయింది. తమిళ సూపర్‌స్టార్, టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ విజయావకాశాలపై అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ సూటిగా సమాధానమిచ్చారు. విజయ్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి వెళ్లాలని పట్టుదలగా ఉన్నారని, అందులో మార్పు ఉంటుందని తాను అనుకోనని చెప్పారు. ఒంటిరిగా ఎన్నికల్లోకి వెళ్తే తమిళనాడులో ఆయన విజయం సాధిస్తారని అన్నారు. విజయానికి అవసరమైన 118 సీట్ల కంటే ఎక్కువే సాధిస్తారని పేర్కొన్నారు. 'ఈ వీడియాను దాచిపెట్టుకోండి... ఫలితాల తరువాత ప్లే చేయండి' అని కూడా ఆయన ఢంకా బజాయించారు.


ప్రశాంత్ కిషోర్ 'ఐ-ప్యాక్' పొలిటికల్ స్ట్రాటసీ సంస్థ తమిళనాడులో టీవీకేతో కలిసి పనిచేసిందనే వార్తలు కూడా వచ్చాయి. విజయ్‌తో ఉన్న అసోసియేషన్‌ను ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు, తాము రాజకీయ సహచరుల కంటే మంచి మిత్రులమని అన్నారు. ఐదేళ్ల క్రితం తొలిసారి తాము మాట్లాడుకున్నామని, ఆయనకు తాను రాజకీయ సలహాదారు కాదని, సిద్ధాంతాలు, విలువలపై అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటామని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

కౌంటింగ్ కేంద్రాలు వదలొద్దు.. తుది ఫలితాలు మనవైపే: మమతా బెనర్జీ

ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్‌ని చూసి గర్వపడుతున్నా: ఎస్.ఎ.చంద్రశేఖర్..

Updated Date - May 04 , 2026 | 04:14 PM