ఓట్ల లెక్కింపు వేళ.. మురుగు కాలువలో వీవీప్యాట్ స్లిప్పులు.. స్పందించిన ఈసీ
ABN , Publish Date - May 04 , 2026 | 07:32 AM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మురుగు కాలువ వద్ద వీవీప్యాట్ స్లిప్పులు లభ్యమయ్యాయంటూ టీఎంపీ, సీపీఐ(ఎం) ఆరోపించాయి.
కోల్‌కతా, మే 04: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మురుగు కాలువ వద్ద వీవీప్యాట్ స్లిప్పులు లభ్యమయ్యాయంటూ టీఎంపీ, సీపీఐ(ఎం) ఆరోపించాయి. దీనిపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. అవి మాక్ పోల్ స్లిప్పులని స్పష్టం చేసింది. వీటికి అసలు పోలింగ్‌తో సంబంధమే లేదని పేర్కొంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాలను ప్రాథమికంగా పరిశీలించామని ఈ సందర్భంగా ఈసీ వివరించింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని ఆ రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి అనిరిందమ్ నియోగి వెల్లడించారు. ఈ అంశంపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఉత్తర 24 పరగణాల జిల్లా ఎన్నికల అధికారి ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు.
దీనిపై సమాగ్ర విచారణ జరపాలని తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం) పార్టీలు డిమాండ్ చేశాయి. జిల్లాలో నౌపారా అసెంబ్లీ నియోజకవర్గంలోని మధ్యామ్‌గ్రామ్ రహదారి పక్కన మురుగు కాలువ వద్ద వీవీప్యాట్ స్లిప్పులు లభ్యమయ్యాయని వెల్లడించాయి. వీటిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారని వివరించాయి. ఈ వ్యవహారంపై పశ్చిమబెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి.. దానికి సాక్ష్యంగా ఒక వీడియోను జత చేసినట్లు ఆయా పార్టీలు వెల్లడించాయి.
ఈ వ్యవహారంపై నౌపారా అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా బరిలో దిగిన గార్జీ ఛటర్జీ స్పందించారు. మురుగు కాలువ వద్ద లభ్యమైన స్లిప్లులు.. నౌపారా అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 29కి సంబంధించినవని ఆరోపించారు. ఎన్నికల సంఘం పరిస్థితి ఇలా ఉందంటూ వ్యంగ్యంగా అన్నారు. ఇది ఎన్నికల కమిషన్ కాదు.. ఇది అణచివేత కమిషన్ అని అభివర్ణించారు. మురుగు కాలువ పక్కన లభ్యమైన స్లిప్పులు గుర్తించిన తమ పార్టీ కార్యకర్తలు వెంటనే తనకు ఫోన్ చేసి తెలిపారన్నారు. ఆ వెంటనే దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై విచారణ జరుపుతామని ఈసీ చెప్పారని గార్గీ ఛటర్జీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐటీ దిగాలు..కొత్త ఉపాధి జిగేలు
For More National News And Telugu News