Share News

ఐటీ దిగాలు..కొత్త ఉపాధి జిగేలు

ABN , Publish Date - May 04 , 2026 | 05:11 AM

తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఇంజినీరింగ్‌ పూర్తయిందంటే చాలు.. అమెరికా విమానం ఎక్కడమో లేదా బెంగళూరు, హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగంలో చేరడమో లక్ష్యంగా ఉండేది. కానీ ఏఐ యుగంలో ఐటీ రంగం ఒడిదుడుకులను....

ఐటీ దిగాలు..కొత్త ఉపాధి జిగేలు

  • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో ఇబ్బందులతో సరికొత్త బాటలో యువత

  • ఏఐ, డేటాసైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, బయోటెక్‌ స్కిల్స్‌ వైపు చూపు

  • సౌర విద్యుత్‌, డ్రోన్‌ టెక్నాలజీకీ డిమాండ్‌

  • విభిన్న స్వయం ఉపాధి మార్గాల్లోనూ అడుగులు

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఇంజినీరింగ్‌ పూర్తయిందంటే చాలు.. అమెరికా విమానం ఎక్కడమో లేదా బెంగళూరు, హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగంలో చేరడమో లక్ష్యంగా ఉండేది. కానీ ఏఐ యుగంలో ఐటీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఐటీ దిగ్గజాలు కూడా ఖర్చుల కోత పేరుతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుంటే.. ఆ నిరాశ మధ్య యువత ‘నైపుణ్యాల’ పెంపుతో సరికొత్త ఉపాధి మార్గాలను వెతుక్కుంటోంది. మార్కెట్‌ అవసరాలను గుర్తించి స్వయం ఉపాధి దిశగానూ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కంపెనీలు డిగ్రీ పట్టా కంటే ‘స్కిల్‌ (నైపుణ్యం)’కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. రాబోయే కాలంలో ఏ రంగంలోనైనా ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారికి స్థానం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొత్త సాంకేతికతలు, మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవడం ముఖ్యమని విద్యావేత్త మెండెం కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఐటీ ఉద్యోగాలు పోవడమంటే.. అవకాశాలు పోవడం కాదని, అవి రూపాంతరం చెందుతున్నాయని గుర్తించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సేవా రంగంలో (సర్వీస్‌ సెక్టార్‌) ఉన్న అవకాశాలు సామాన్యమైనవి కావని.. సమాజ అవసరాలను గుర్తించి దానికి తగ్గట్లు నైపుణాన్ని పెంచుకుంటే ప్రతి రంగం ఒక బంగారు గని వంటిదేనని పేర్కొన్నారు.

నాడు కోడింగ్‌.. నేడు నెక్ట్స్‌ జనరేషన్‌ కోర్సులు!

ఐటీ రంగంలో మనుగడ సాగించాలంటే ఇప్పుడు డిగ్రీ ఉంటే చాలదు. కేవలం జావా లేదా పైథాన్‌ నేర్చుకుంటే ఉద్యోగం వచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు మార్కెట్‌ కోరుకుంటున్న సరికొత్త కోర్సుల్లో నైపుణ్యాలు తప్పనిసరి అయ్యాయి. ఇది గ్రహించిన యువత సంబంధిత కోర్సుల్లో ఆసక్తి చూపుతున్నారు.

కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్‌

సాఫ్ట్‌వేర్‌ రంగం లో ఉన్నా సరే ఏఐ నైపుణ్యం లేకపోతే మనుగడ కష్టమని తేలిపోయింది. సాధారణ ప్రోగ్రామింగ్‌ స్థానంలో ఏఐ అప్లికేషన్ల తయారీకి డిమాండ్‌ పెరిగింది. 2026చివరికి దేశానికి 10 లక్షల మంది ఏఐ నిపుణులు అవసరమని అంచనా.

సెమీకండక్టర్‌ ఇంజినీరింగ్‌

భారత్‌ ఇప్పుడు గ్లోబల్‌ చిప్‌హబ్‌గా మారుతోంది. చిప్‌ తయారీ యూనిట్లు భారీగా వస్తుండటంతో ఈ రంగంలో నిపుణుల కొరత నెలకొంది. ఇందులో నైపుణ్యం ఉన్నవారికి లక్షల్లో జీతాలు లభిస్తున్నాయి.


సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్‌

డిజిటల్‌ లావాదేవీలు, నేరాలు పెరుగుతుండటంతో బ్యాంకింగ్‌, రక్షణ కవచంలా నిలిచే సైబర్‌ నిపుణులకు భారీ ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తున్నాయి.

పునరుత్పాదక ఇంధన కోర్సులు

పెట్రోల్‌ ఇంజన్ల కాలం పోతోంది. గ్రీన్‌ ఎనర్జీ, సోలార్‌, విండ్‌ పవర్‌ రంగాల్లో ఇంజనీర్లకు డిమాండ్‌ పెరిగింది. పర్యావరణ పరిరక్షణ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈవీ బ్యాటరీ మేనేజ్‌మెంట్‌, ఎలక్ట్రిక్‌ పవర్‌ ట్రెయిన్‌ ఇంజనీరింగ్‌కు డిమాండ్‌ పెరిగింది. సోలార్‌, విండ్‌ పవర్‌, ఎలక్ట్ర్టిక్‌ వెహికిల్‌ (ఈవీ) టెక్నాలజీ భవిష్యత్తును శాసించనున్నాయి.

బయో- టెక్నాలజీ అండ్‌ హెల్త్‌కేర్‌ డేటా

కోవిడ్‌ తర్వాత హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌, బయో ఇన్మర్మేటిక్స్‌ కోర్సుల్లో చేరేవారి సంఖ్య 25శాతం పెరిగింది.

మార్కెట్‌లో ఉపాధికి కొత్త మార్గాలెన్నో..

ప్రస్తుతం సమాజంలో ప్రజలు విలాసానికి, ఆరోగ్యానికి, అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు నిరుద్యోగులకు కల్పవృక్షంగా మారింది. ఐటీ కొలువు పోయినవారు, ఉద్యోగం దొరకనివారు ఇప్పుడు సర్వీస్‌ సెక్టార్‌లో రాణిస్తున్నారు.

వెల్‌నెస్‌ అండ్‌ లైఫ్‌ స్టైల్‌

ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన స్పా, మసాజ్‌ సెంటర్లు ఇప్పుడు జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించాయి. పనిఒత్తిడి, జీవనశైలి మార్పుల కారణంగా స్పా, యోగా, వెల్‌నెస్‌ థెరపీలకు డిమాండ్‌ పెరిగింది. శిక్షణ పొందిన థెరపిస్టులు నెలకు లక్షన్నరకు పైగా సంపాదిస్తున్నారు. కేవలం తలదువ్వడం, మేకప్‌ వేయడం కాదు.. ఇప్పుడు హెయిర్‌ డిజైనింగ్స్‌, స్పెషల్‌ మేకప్‌ వంటి కోర్సులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. పెళ్లిళ్ల సీజన్‌లో ఒక్కో మేకప్‌ ఆర్టిస్ట్‌ రోజుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నారు.


ప్రభుత్వ చేయూత.. శిక్షణ వేదికలెన్నో

స్వయం ఉపాధి కోరుకునే వారి కోసం అనేక ప్రైవేటు, ప్రభుత్వ శిక్షణ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా అడ్వాన్స్‌డ్‌ కోర్సులను అందిస్తున్నారు. నేరుగా ఉపాధి కల్పించే 17 రకాల కోర్సులను ప్రభుత్వం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి సంస్థలతో కలిసి సర్టిఫికేషన్‌ కోర్సులు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ఉచితంగా బ్యూటీ, ప్లంబింగ్‌, ఎలక్ర్టికల్‌, ఐటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. కోర్సెరా, ఉడెమీ వంటి సంస్థల ద్వారా గూగుల్‌ డేటా అనలిటిక్స్‌ వంటి షార్ట్‌ టర్మ్‌ కోర్సులపై యువత ఆసక్తి చూపుతున్నారు. అలాగే గ్రామీణ యువతకు బ్యూటీషియన్‌, టేలరింగ్‌, హ్యాండీక్రా్‌ఫ్టలో శిక్షణ ఇస్తున్నారు.

ఐటీ సాఫ్ట్‌వేర్‌ నుంచి స్పా థెరఫీ వైపు..

హైదరాబాద్‌కు చెందిన ప్రణయ్‌ ఒక పెద్ద సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. లే- ఆఫ్‌లో ఉద్యోగం పోవడంతో కుంగిపోకుండా థాయ్‌లాండ్‌లో వెల్‌నెస్‌ థెరపీ కోర్సు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సొంతంగా స్పా నిర్వహిస్తూ నెలకు రూ.3లక్షలకుపైగా సంపాదిస్తున్నారు. ‘ఐటీలో రేపు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు.. కానీ ఇక్కడ నా నైపుణ్యం నా చేతుల్లోనే ఉంది. ఐటీలో ఉన్నప్పుడు లేని ప్రశాంతత, ఆదాయం ఇక్కడ ఉన్నాయని మరో పది మందికి ఉపాధి ఇస్తున్నా’ అని గర్వంగా చెబుతున్నారు ప్రణయ్‌.

కోడింగ్‌ వదిలి సైబర్‌ సెక్యూరిటీలోకి..

విశాఖపట్నానికి చెందిన మౌనిక సాధారణ సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ పనిచేసేవారు. ఐటీరంగం కుదేలవడంతో ‘ఎథికల్‌ హ్యాకింగ్‌’ కోర్స్‌ నేర్చుకున్నారు. ప్రస్తుతం ఒక ప్రముఖ బ్యాంక్‌లో సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌గా నెలకు రూ.1.50లక్షల వేతనంతో పనిచేస్తున్నారు.


2.jpg

మేకప్‌ ఆర్టిస్ట్‌గా..

వరంగల్‌కు చెందిన లాస్య ఎంటెక్‌ చదివారు. సాఫ్ట్‌వేర్‌ రంగం సంక్షోభంలో ఉండటంతో తన ఆసక్తిని వృత్తిగా మార్చుకుని ‘బైడల్‌ మేక్‌ప’లో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆమె పాపులర్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌. ఒక్కో పెళ్లి సీజన్‌లో ఆమె సంపాదన అక్షరాలా రూ.10లక్షలకు పైమాటేనట!

3.jpg

క్లౌడ్‌ కిచెన్స్‌..

తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే ఆహారాన్ని తయారు చేసి ఆన్‌లైన్‌లో విక్రయించే సరికొత్త ఉపాధి క్లౌడ్‌ కిచెన్లతో ఏర్పడింది. ఎల్‌బీ నగర్‌కు చెందిన ఉమారాణి తన కుటుంబంతో సహా క్లౌడ్‌ కిచెన్‌ నిర్వహిస్తూ.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కంటే కూడా మంచి ఆదాయం పొందుతున్నారు.

డ్రోన్‌ టెక్నాలజీతో పొలాల్లోకి..

సూర్యాపేట జిల్లాకు చెందిన యువ ఇంజినీర్‌ నితీశ్‌రెడ్డి.. ఉద్యోగ వేట వదిలి ‘అగ్రి డ్రోన్‌’ ఆపరేటింగ్‌లో సర్టిఫికేషన్‌ చేశారు. ఇప్పుడు తన సొంత డ్రోన్‌తో చుట్టుపక్కల గ్రామాల్లో పురుగుమందుల పిచికారీ చేస్తూ నెలకు రూ.90వేలకు పైగానే నికర ఆదాయం పొందుతున్నారు.

5.jpg

పెట్‌ గ్రూమింగ్‌.. సరికొత్త ట్రెండ్‌

జంతుప్రేమికులు పెరగడంతో శునకాలు, పిల్లులను సంరక్షించే ‘పెట్‌ కేర్‌ సెంటర్లు’, వాటికి అందం అద్దే ‘పెట్‌ గ్రూమర్స్‌’కు కొత్త మార్కెట్‌ ఏర్పడింది. విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ ‘పెట్‌ గ్రూమింగ్‌’ (పెంపుడు జంతువుల అలంకరణ)’ సెంటర్‌ తెరిచారు. ఈ వినూత్న వ్యాపారం ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

4.jpg

సోలార్‌ టెక్నీషియన్స్‌

ప్రభుత్వాలు సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్న క్రమంలో సోలార్‌ ప్యానెళ్లు, వ్యవస్థల ఏర్పాటు, సర్వీసింగ్‌ చేసే టెక్నీషియన్లకు డిమాండ్‌ పెరిగింది. ఖమ్మంకి చెందిన శ్రీనివాసరావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పోవడంతో ఈ రంగంలో స్కిల్స్‌ నేర్చుకున్నారు. ఇప్పుడు రూ.80 వేలకుపైగా సంపాదిస్తున్నారు.

6.jpg

ఈవెంట్స్‌లో కింగ్‌..

పుట్టినరోజు పార్టీల నుంచి కార్పొరేట్‌ ఈవెంట్ల వరకు ప్రతిదీ ఇప్పుడు ఈవెంట్‌ మేనేజర్ల చేతుల్లోనే ఉంది. సృజనాత్మకత ఉంటే చాలు.. పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. విజయవాడకు చెందిన కిరణ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి ‘ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌’ ప్రారంభించారు. ఇప్పుడు 20 మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నారు.

Updated Date - May 04 , 2026 | 05:11 AM