రెండేళ్లలో 52 కేసులు
ABN , Publish Date - May 04 , 2026 | 05:03 AM
రాష్ట్రంలో భూముల విలువలతోపాటే సబ్ రిజిస్ట్రార్ల అవినీతి కూడా పెరుగుతోంది. ఏసీబీ గణాంకాల ప్రకారం.. అవినీతి ఎక్కువగా జరిగే శాఖల్లో రిజిస్ట్రేషన్ల శాఖ మూడో స్థానంలో ఉంది.
అవినీతిలో టాపర్లు.. సబ్ రిజిస్ట్రార్లు!
ఏసీబీ, విజిలెన్స్ కేసులు.. 15 మందికి పైగా అరెస్టు
స్టాంపు డ్యూటీ, భూముల విలువలు తగ్గించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వైనం
హైదరాబాద్ చుట్టూనే 60 శాతం అవినీతి కేసులు!
హైదరాబాద్, మే 3 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో భూముల విలువలతోపాటే సబ్ రిజిస్ట్రార్ల అవినీతి కూడా పెరుగుతోంది. ఏసీబీ గణాంకాల ప్రకారం.. అవినీతి ఎక్కువగా జరిగే శాఖల్లో రిజిస్ట్రేషన్ల శాఖ మూడో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో రెవెన్యూ, పోలీసు శాఖలు ఉన్నాయి. 2024 నుంచి 2026 ఏప్రిల్ వరకు రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన సుమారు 15 మంది సబ్ రిజిస్ట్రార్లు అరెస్టవగా.. 52 కేసులు నమోదయ్యాయి. ఇటీవల వరంగల్‌లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఒకేసారి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఒక సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం దొరికితే.. మరొకరి ఇంట్లో రూ.50 లక్షల నగదు పట్టుబడింది. ఇక రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ల అక్రమాస్తుల విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. భూమి అసలు విలువను తక్కువ చేసి చూపడం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి, అందులో కొంత శాతాన్ని లంచంగా తీసుకునే ఘనులు ఎక్కువయ్యారని విజిలెన్స్ దాడుల్లో తేలింది. నిషేధిత జాబితాలో, కోర్టు వివాదాల్లో ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ చేస్తున్నారు. ఇలాంటి డాక్యుమెంట్లకు రూ.లక్షల్లో నగదు చేతులు మారుతోంది. మరికొందరు సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్లు నకిలీవని తెలిసినా.. భారీ మొత్తంలో ముడుపులు అందితే చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గచ్చిబౌలిలో ఇదే తరహాలో నకిలీ ఆస్ట్రేలియా పాస్‌పోర్టు, వీసా సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడిన ఘటనపై ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో వ్యవసాయ విభాగంలో ఉండే భూమిని రిజిస్ట్రేషన్ చేయకూడదని తెలిసినా.. ఒక సబ్ రిజిస్ట్రార్ భారీగా ముడుపులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడంపై శాఖా పరమైన విచారణ జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఓ అధికారి అడ్డగోలుగా వ్యాలిడేషన్ ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన మరో శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లారు.
రాజధాని చుట్టూనే అధికం..
హైదరాబాద్, రంగారెడ్డి జోన్ పరిసరాల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో భూముల విలువ ఎక్కువగా ఉండడంతో తరచూ ఏసీబీ, విజిలెన్స్ సోదాలు జరుగుతున్నాయి. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి పరిధిలో నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్లు జైలుకు వెళ్లారు. గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ల విషయంపై ఏసీబీ అధికారులు వరస దాడులు చేశారు. ఎల్బీనగర్, సరూర్‌నగర్‌లో లంచం తీసుకుంటూ సబ్‌రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్లు దొరికిపోయారు. వనస్థలిపురం పరిధిలో ఓ సబ్‌రిజిస్ట్రార్ పార్కు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి సస్పెండవగా, సరూర్‌నగర్‌లో డబ్బులు తీసుకున్నట్లు మరో సబ్ రిజిస్ట్రార్ కోర్టులోనే ఒప్పుకొని సస్పెండైన ఉదంతాలు ఇటీవల చోటుచేసుకున్నాయి. శంషాబాద్ పరిధిలో వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చే క్రమంలో జరిగిన అవినీతిపై శాఖాపరమైన విచారణ జరిగింది. కేసులు కూడా నమోదు చేశారు. కరీంనగర్‌లో స్టాంప్‌డ్యూటీ ఎగవేత, జీఎస్టీ వసూళ్లలో అక్రమాలపై విజిలెన్స్ దాడులు జరిగాయి. సంగారెడ్డి, పటాన్‌చెరువు పరిధిలో భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌పై కేసులు నమోదయ్యాయి. ఖమ్మంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువగా ఉన్నట్లు ఏసీబీ గుర్తించి కేసులు నమోదు చేసింది. నల్లగొండలో ధరణి సమస్యలను సాకుగా చూపి లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులపై ఏసీబీ దాడులు చేసి కేసులు పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 40కిపైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇటీవల కాలంలో విజిలెన్స్, ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్‌కు 50 కి.మీ. పరిధిలోనే సుమారు 60 శాతం కేసులు నమోదయ్యాయి.