కౌంటింగ్ కేంద్రాలు వదలొద్దు.. తుది ఫలితాలు మనవైపే: మమతా బెనర్జీ
ABN , Publish Date - May 04 , 2026 | 02:18 PM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీఎంసీ అధినేత్ర మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విజయపథంలో దూసుకుపోతున్నట్టు ట్రెండ్స్ వెలువడుతున్న తరుణంలో టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉత్సాహపరుస్తూ... తుది ఫలితాలు మనవైపే ఉంటాయని వ్యాఖ్యానించారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విజయపథంలో దూసుకుపోతున్నట్టు ట్రెండ్స్ వెలువడుతున్న తరుణంలో టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉత్సాహపరుస్తూ... తుది ఫలితాలు మనవైపే ఉంటాయని వ్యాఖ్యానించారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి టీఎంసీ నేతలు వెళ్దొద్దని సూచించారు. చివరివరకూ వేచిచూడాలని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
'టీఎంసీ మద్దతుదారులు ఆశ వదులుకోవద్దు. 14 నుంచి 18 రౌండ్ల కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్ ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్స్ వద్దే ఉండాలి. కౌంటింగ్ సెంటర్లు వదిలి వెళ్లవద్దు. బీజేపీ ఓట్లు ముందుగా చూపిస్తారని నిన్నటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను. టీఎంసీ కార్యకర్తలు నిరుత్సాహం చెందవద్దు. సూర్యాస్తమయం సమయానికి అంతా గెలుస్తాం. వేచిచూడండి' అని ఆ పోస్టులో మమత పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్‌పై విమర్శలు
టీఎంసీ ఎక్కడ ఆధిక్యంలో ఉందో వాళ్లు (ఈసీ) చెప్పడం లేదని, కేంద్ర బలగాలతో కలిసి ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మమతా బెనర్జీ విమర్శించారు. అయినప్పటికీ కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని, తప్పనిసరిగా అంతా గెలుస్తామని, తాను వారికి అండగా ఉంటానని, పులిలా పోరాడతామని ధైర్యం చెప్పారు.
టీఎంసీ వెనుకంజ
కాగా, కౌంటింగ్ ప్రారంభమైనప్పటికీ బీజేపీ ఆధిక్యత దిశగా దూసుకువెళ్తోంది. బీజేపీ మెజారిటీ మార్క్‌ను దాటి 196 సీట్లలో ఆధిక్యత ప్రదర్శిస్తుండగా, టీఎంసీ 92 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 215 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 77 నియోజకవర్గాల్లో గెలిచింది.
ఇవి కూడా చదవండి..
ఐదు రాష్ట్రాల ఫలితాల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్.. నైపుణ్యం, కృషి, కరుణపై సందేశం
ఓట్ల లెక్కింపు వేళ.. మురుగు కాలువలో వీవీప్యాట్ స్లిప్పులు.. స్పందించిన ఈసీ