వెస్ట్ బెంగాల్ సీఎం రేసులో బీజేపీ దిగ్గజాలు.. సువేందు అధికారి, దిలీప్ ఘోష్!
ABN , Publish Date - May 04 , 2026 | 03:58 PM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతున్న తరుణంలో, రాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ దిగ్గజ నేతలు సువేందు అధికారి, దిలీప్ ఘోష్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
కోల్‌కతా, మే 4: 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతున్న తరుణంలో, తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీలో ప్రధానంగా ఇద్దరు నేతల పేర్లు వినిపిస్తున్నాయి ఒకరు.. సువేందు అధికారి మరొకరు దిలీప్ ఘోష్.
సువేందు అధికారి: బీజేపీ అమ్ములపొదిలో పదునైన అస్త్రం
ప్రస్తుత ప్రతిపక్ష నేత సువేందు అధికారి ముఖ్యమంత్రి పదవికి రేసులో మొదటి వరుసలో ఉన్నారు. మమతా బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో సవాలు చేసి, గట్టి పోటీని ఇచ్చారు. నందిగ్రామ్‌లో గతంలో మమతను ఓడించడం, రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలపై పట్టు, దూకుడుగా ఉండే రాజకీయ శైలి ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఎన్నికల ప్రచారంలో హిందూ ఓట్ల ఏకీకరణలో ఆయన కీలక పాత్ర పోషించారు.
దిలీప్ ఘోష్: అట్టడుగు స్థాయి నేత
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత దిలీప్ ఘోష్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి బలమైన పోటీదారుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఖరగ్‌పూర్ సదర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ (RSS) మూలాలు ఉండటం, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసిన అనుభవం ఆయనకు అండగా ఉన్నాయి. 'సన్ ఆఫ్ ది సాయిల్' (స్థానిక నేత)గా ప్రజల్లో ఆయనకున్న గుర్తింపు బీజేపీ అధిష్ఠానాన్ని ఆలోచింపజేస్తోంది.
మరికొందరు అభ్యర్థులు
ఈ ఇద్దరితో పాటు మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా, అధిష్ఠానం ఎవరైనా ఊహించని పేరును తెరపైకి తెచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
ఇవి కూడా చదవండి..
ఐదు రాష్ట్రాల ఫలితాల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్.. నైపుణ్యం, కృషి, కరుణపై సందేశం
ఓట్ల లెక్కింపు వేళ.. మురుగు కాలువలో వీవీప్యాట్ స్లిప్పులు.. స్పందించిన ఈసీ