Share News

మూడు రాష్ట్రాల్లో విజయం దిశగా బీజేపీ.. అంబరాన్ని అంటుతున్న సంబరాలు..

ABN , Publish Date - May 04 , 2026 | 04:32 PM

పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. దీంతో కమలం పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

మూడు రాష్ట్రాల్లో విజయం దిశగా బీజేపీ.. అంబరాన్ని అంటుతున్న సంబరాలు..
BJP Party Celebrations

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. అస్సాంలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీనే విజయ ఢంకా మోగించగా.. తాజాగా మూడోసారి విజయకేతనం ఎగరవేస్తోంది. మొత్తం 126 స్థానాలకు గాను బీజేపీ 99 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోనూ కమలం పార్టీ సత్తా చాటుతోంది. మొత్తం 294 స్థానాలకు గాను 197 సీట్లలో బీజేపీ ముందంజలో ఉంది.


మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కేవలం 93 స్థానాల్లోనే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. దీంతో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో, అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కాషాయ దుస్తుల్లో రోడ్లపైకి వచ్చిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ రంగులు పూసుకుంటున్నారు. స్వీట్లు తినిపించుకుంటూ, టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.


ముఖ్యంగా కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రాష్ట్రస్థాయి నేతలూ అక్కడే ఉన్నారు. కాషాయ వస్త్రాలు ధరించిన వారంతా సంప్రదాయ బెంగాలీ సంగీతానికి నృత్యాలు చేస్తున్నారు. హౌరా వంతెన వద్దకు భారీగా చేరుకున్న కమలం శ్రేణులు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

విజయ్‌కు మెజారిటీ తగ్గితే.. కలిసొచ్చే పార్టీలు ఇవేనా

వెస్ట్ బెంగాల్ సీఎం రేసులో బీజేపీ దిగ్గజాలు.. సువేందు అధికారి, దిలీప్ ఘోష్‌!

Updated Date - May 04 , 2026 | 04:36 PM