Share News

మేనల్లుడిని క్షమించిన మాయావతి.. మరోసారి బీఎస్పీ కన్వీనర్‌గా బాధ్యతలు

ABN , Publish Date - Oct 05 , 2026 | 08:03 PM

తనను క్షమించాలని ఆకాశ్ ఆనంద్ బహిరంగ క్షమాపణ చెప్పిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆకాశ్‌ను పార్టీలోకి మళ్లీ తీసుకోవాలని మాయావతి నిర్ణయించుకున్నారు

మేనల్లుడిని క్షమించిన మాయావతి.. మరోసారి బీఎస్పీ కన్వీనర్‌గా బాధ్యతలు
Mayawati and Akash Anand

ఇంటర్నెట్ డెస్క్: తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి క్షమించారు. మరోసారి మేనల్లుడికి ఆ పార్టీ నేషనల్ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. తనను క్షమించాలని ఆకాశ్ ఆనంద్ బహిరంగ క్షమాపణ చెప్పిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 3న పార్టీలోని కీలక బాధ్యతల నుంచి తన మేనల్లుడిని మాయావతి తప్పించారు. పార్టీ వ్యవహారాల కన్నా కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న కారణంతో ఆయనపై వేటు వేశారు. దీంతో అక్టోబర్ 2న ఎక్స్ వేదికగా ఆకాశ్ ఆనంద్ క్షమాపణలు చెప్పారు. మాయావతిని తన రాజకీయ గురువుగా, తల్లితో సమానమైన ఆదర్శమూర్తిగా పేర్కొన్నారు. తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుకున్నారు. దీంతో పార్టీలోకి ఆకాశ్‌ను మళ్లీ తీసుకోవాలని మాయావతి నిర్ణయించుకున్నారు. 2027లో ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.


వేటుకు దారి తీసిన ‘రీపోస్ట్’

ఇదివరకు ఆకాశ్‌పై వేటు పడడానికి ఓ పోస్ట్‌ను రీపోస్ట్ చేయకపోవడమే కారణం. గతంలో రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్‌ను మాయావతి బీఎస్పీ నుంచి బహిష్కరించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ను ఆకాశ్ ఆనంద్ రీపోస్ట్ చేయలేదు. ఆకాశ్‌కు అశోక్ సిద్ధార్ధ్ మావయ్య అవుతారు. కాబట్టి పోస్ట్‌ను రీపోస్ట్ చేయకపోవడాన్ని మాయావతి ఆక్షేపించారు. తన అన్ని పోస్ట్‌లను రీపోస్ట్ చేసే మేనల్లుడు.. ఆ పోస్ట్‌ను చేయకపోవడం ఆమెకు కోపం తెప్పించింది. దీంతో పార్టీ కన్నా కుటుంబానికే ఆకాశ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే కారణంతో ఆయనపై వేటు వేశారు. ఈ వ్యవహారం తరువాత ఆకాశ్ ఆనంద్ బహిరంగ క్షమాపణ చెప్పారు.


ఈ వార్తలూ చదవండి

యూపీలో బీజేపీ రాజ్యసభ ఎంపీలకు షాక్.. అభ్యర్థుల లిస్టులో లేని పేర్లు..

బీజేపీ వచ్చి నిషేధించాల్సిన అవసరం ఎందుకొచ్చింది.. జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు..

Updated Date - Oct 05 , 2026 | 08:07 PM