టేకాఫ్‌కు ముందు ఆల్కహాల్ టెస్ట్.. ఎయిర్ఇండియా పైలట్ సస్పెన్షన్
ABN , Publish Date - Sep 25 , 2026 | 01:56 PM
విమానం టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు నిర్వహించిన ఆల్కహాల్ పరీక్షలో విఫలమైన ఓ పైలట్‌పై సస్పెన్షన్ వేటువేసింది ఎయిర్ఇండియా. తదుపరి దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: జ్యూరిచ్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ఇండియా విమానం టేకాఫ్‌నకు కొన్ని క్షణాల ముందు ఆగిపోయింది. అందులోని పైలట్‌కు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించగా.. అందులో ఫెయిల్ కావడమే ఇందుకు కారణం. దీంతో సదరు పైలట్‌పై సస్పెన్షన్ వేటువేసింది ఎయిర్ఇండియా యాజమాన్యం.
ఇదీ జరిగింది..
ఈ నెల 6 జ్యూరిచ్(స్విట్జర్లాండ్)లో విమానం నడిపేందుకు సిద్ధమైన పైలట్‌కు రూల్స్ ప్రకారం ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించగా.. అందులో పాజిటివ్ వచ్చింది. దీంతో విమానం బయల్దేరే ముందు ఆయన్ను విధుల నుంచి తప్పించారు. అనంతరం సాధారణ ప్రయాణికుడిగానే భారత్‌కు పంపారు. స్వదేశానికి చేరుకున్న అనంతరం సదరు పైలట్‌ను ఎయిర్‌ఇండియా సస్పెండ్ చేసింది. ఫైనల్ మెడికల్ రిపోర్ట్ రావడం సహా పూర్తిస్థాయి దర్యాప్తు ముగిసేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం.
ఈ విషయమై ఎయిర్ఇండియా స్పందిస్తూ.. భద్రత, నియంత్రణ సంస్థల నిబంధనలు లేదా విధి విధానాలను ఉల్లంఘించే ఏ చర్యనూ సహించబోదని స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే సదరు పైలట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. విమాన సిబ్బంది అత్యున్నత భద్రతా ప్రమాణాలు, వృత్తిపరమైన నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాల్సిన బాధ్యతను ఈ ఘటనతో మరోసారి గుర్తుచేశామని తెలిపింది. కాగా.. ఇదే తరహాలో మరో పైలట్ కూడా మాదకద్రవ్యాల పరీక్షలో పాజిటివ్‌గా తేలిన ఘటన ఇటీవల వెలుగుచూసింది. ఫుకెట్-ఢిల్లీ విమానం నడిపిన అనంతరం నిర్వహించిన పరీక్షలో ఆయన గంజాయి తీసుకున్నట్టు తేలిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో విమాన సిబ్బంది క్రమశిక్షణ, భద్రతా ప్రమాణాల అమలుపై మరోసారి చర్చ జోరందుకుంది.
ఇవీ చదవండి:
కేదార్‌నాథ్‌లో 5 నెలల్లోనే 50 టన్నుల చెత్త.. మూడేళ్ల కంటే ఇదే అధికం!
ఆసియా రికార్డు బద్దలు.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం