నఖ ‘సిత్రాలు’
ABN , Publish Date - Jul 19 , 2026 | 09:02 AM
వింబుల్డన్... ఆటకే కాదు, ఫ్యాషన్ స్టేట్‌మెంట్లకు కూడా తిరుగులేని వేదిక. జపాన్ సంప్రదాయ దుస్తుల్లో కోర్టులోకి అడుగుపెట్టి నవోమి ఒసాకా ఎంత సంచలనం సృష్టించిందో... అంతే సంచలనం సెరీనా విలియమ్స్ వజ్రాలు పొదిగిన చేతిగోళ్లు కూడా సృష్టించాయి.
వింబుల్డన్... ఆటకే కాదు, ఫ్యాషన్ స్టేట్‌మెంట్లకు కూడా తిరుగులేని వేదిక. జపాన్ సంప్రదాయ దుస్తుల్లో కోర్టులోకి అడుగుపెట్టి నవోమి ఒసాకా ఎంత సంచలనం సృష్టించిందో... అంతే సంచలనం సెరీనా విలియమ్స్ వజ్రాలు పొదిగిన చేతిగోళ్లు కూడా సృష్టించాయి. నఖ సౌందర్యంలో సెలబ్రిటీలే కాదు... యువతరం చేస్తున్న ‘సిత్రాలు’ అన్నీ ఇన్నీ కావు మరి...
నెయిల్స్‌ను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. శుభ్రపరచుకోవాలి. మంచి నెయిల్ పాలిష్ వేసుకోవాలి. నిన్నటిదాకా సాదాసీదాగా సింపుల్‌గా కనిపించేవి. కానీ ఇప్పుడు వేసుకున్న డ్రెస్‌కు తగ్గట్టు గోళ్లూ ఉండాల్సిందే. వాటికి కూడా డిజైన్ ఉండాలి. కొన్నిసార్లు ఎక్స్‌టెన్షన్‌లతో అదరగొట్టాలి. అందుకే గోళ్ల సంరక్షణకు ప్రత్యేకంగా మెనిక్యూర్ స్టూడియోలు, వాటి అలంకరణకు నెయిల్ ఆర్ట్ సెంటర్లు, స్పాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అటువైపు వెళ్లని యువతులు అరుదు. కొత్త డిజైన్లతో తమ నెయిల్స్‌ను తీర్చిదిద్దుకుంటూ అప్‌టూ డేట్‌గా ఉంటున్నారు ఈకాలం అమ్మాయిలు. గోరుతో పోయేది అంటూ వాటిని అంత తేలికగా తీసేయడానికి వీల్లేదు. క్లాసిక్ ఫ్రెంచ్ టిప్స్, ఓంబర్ డిజైన్స్, పేస్టల్, పోల్కా డాట్స్‌తో పాటు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న నెయిల్ ఆర్ట్ డిజైన్లేమిటో ఓసారి చూద్దాం.
పాలపుంతను దించేద్దాం...
విశ్వాన్ని అరచేతులతో పట్టుకోలేం కానీ, పాలపుంతను చేతి గోళ్ల మీద ఆవిష్కరించవచ్చని అంటున్నారు నెయిల్ ఆర్ట్ నిపుణులు. గోళ్ల మీద కనిపించే ప్రకాశవంతమైన కాంతి సుడులు, అర్ధరాత్రి మెరుపులు ఇచ్చే ‘అలా్ట్ర గ్లామ్ లుక్’ పార్టీలకే కాదు... పండగలప్పుడు కూడా చక్కగా సరిపోతుంది. అయితే ఈ మెరుపులకు తగిన దుస్తులు వేసుకుంటే ఆ అందం రెట్టింపవుతుంది. ముఖ్యంగా తెలుపు, నలుపు లేదా గాఢమైన ఊదారంగు దుస్తులు వేసుకుంటే నిజంగా ఆ పాలపుంత వేళ్లపై వాలినట్టుగా అనిపిస్తుంది.
పసిడి కాంతులు...
పసిడి ధరలు ఆకాశాన్ని చేరుకున్నాయని బాధపడుతున్నారా? బంగారు గాజులు, హారాలు, చెవి పోగులు, ఉంగరాలు... కాసేపు మర్చిపోండి. కాస్త ‘అవుటాఫ్ ది బాక్స్’ ఆలోచించండి. బంగారం ఇప్పుడు నెయిల్ ఆర్ట్‌లోకి కూడా ప్రవేశించింది. పసిడి ద్రావకాన్ని గోళ్ల డిజైనింగ్‌లో విరివిగా వాడుతున్నారు. నెయిల్ ఆర్ట్‌లో వచ్చిన సరికొత్త పోకడ ఇది. గోళ్లకు ఏ రంగులో పెయింట్ వేసినా, దాని మీద బంగారు వర్ణంలో నక్షత్రాలు, పువ్వులు, అక్షరాలు, గీతలు వేస్తున్నారు. గోటిపై అవి హైలైట్‌గా మారి లుక్ అదిరిపోతోంది. డెనిమ్ ఔట్‌ఫిట్స్, లేడీ సూట్స్, పండగ దుస్తుల మీద కూడా ఈ తరహా నెయిల్ ఆర్ట్ బాగా సూట్ అవుతోంది. పెళ్లికూతుళ్లకి ఈ బంగారు గోళ్ల డిజైన్స్ బాగా నప్పుతాయని వేరే చెప్పక్కర్లేదు.
కొనగోటి మీద పూలు పూస్తున్నాయి...
ప్రస్తుతం ప్రపంచమంతా ఫ్లోరల్ ఆర్ట్ హవా నడుస్తోంది. నెయిల్ ఆర్ట్‌లోకి కూడా పూల కాంతులు వచ్చేశాయి. ముఖ్యంగా త్రీడీ ఫ్లోరల్ నెయిల్స్ డిజైన్స్‌ను గోళ్ల మీద ఎక్కువగా వేస్తున్నారు నెయిల్ ఆర్టిస్టులు. అప్పుడే విచ్చుకున్న తాజా మొగ్గలు, లతలు, తీగల్లాంటి నెయిల్ డిజైన్స్ కళ్లను కట్టిపడేస్తున్నాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా...ఈ పూల డిజైన్లు అందరికీ నప్పుతాయి. సెలవులు, పిక్నిక్‌లు, బ్రంచ్‌లకు వెళ్లే సమయాల్లో ఇలాంటి డిజైన్లు బాగుంటాయి. గాఢమైన రంగుల దుస్తులకు ఇలాంటి నెయిల్ ఆర్ట్ చక్కగా సరిపోతుంది.
‘చిత్ర’మైన అభిమానం...
ప్రపంచకప్ ఫుట్‌బాట్ సందడిలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు చాలా మంది తమ అభిమాన హీరోలైన మెస్సీ, రొనాల్డోల పెయింటింగ్‌లను గోళ్ల మీద వేయించుకున్నారట. అలా క్రీడాకారులే కాదు, నచ్చిన కళాకారులు, నటులు, సంగీతకారులు... ఇలా ఎవరివైనా సరే నెయిల్ ఎక్స్‌టెన్షన్ల మీద పెయింటింగ్ వేయించుకోవచ్చు. అంటే ప్రతీ గోరూ ఓ కథ చెబుతుందన్నమాట. దీన్నే ‘హైపర్ రియలిస్టిక్ పోట్రెయిట్ నెయిల్ ఆర్’్టగా పిలుస్తున్నారు. నచ్చిన వ్యక్తులపై అభిమానాన్ని చూపించడానికి ఇదో మార్గంగా యువతులు భావిస్తున్నారు. మొత్తానికి చేతి గోళ్ల మీదనే ఓ చిన్న గ్యాలరీని ఆవిష్కరిస్తున్నారు. కాకపోతే దీన్ని తమకి తాముగా వేసుకోలేరు కాబట్టి, తప్పనిసరిగా నెయిల్ స్టూడియోకి వెళ్లాల్సిందే. కొన్ని గంటల పాటు ఓపికగా ఈ పనిలో నిమగ్నమైతేనే... అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. నెయిల్ ఎక్స్‌టెన్షన్‌లో ఇలాంటివి రెడీమేడ్‌గా కూడా లభించడం విశేషం.
రత్నాలు పొదిగి...
రత్నాలు, వైఢూర్యాలు, ముత్యాల్లాంటివి కేవలం నగల డిజైనింగ్‌లోనే కాదు... గోళ్ల అలంకరణలో కూడా భాగమవుతున్నాయి. కేక్ మీద, ఐస్‌క్రీమ్ మీద చెర్రీ పెట్టినట్టుగా గోళ్లమీద ఇవి కిరీటాల్లా మారిపోయి, వెలుగులు విరజిమ్ముతున్నాయి. అంతేనా... ఇటీవల ష్యాషన్ షోలలో కొందరు మోడల్స్ గోళ్లకు చిన్న సైజు హారాలను ధరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ ‘నెయిల్ చెయిన్స్’ను ప్రత్యేక సందర్భాల్లో తప్పితే నిరంతరం ధరించడానికి అంత సౌకర్యంగా ఉండవు. అయితే వజ్రవైఢూర్యాలను మాత్రం గోళ్లపై బాగానే ధరిస్తున్నారు. ఈమధ్య సెరీనా విలియమ్స్ వజ్రాలను పొదిగిన గోళ్లతో వింబుల్డన్ క్రీడల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఎంచుకున్న నెయిల్ ఆర్ట్ ఫ్యాషన్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
‘క్యాట్ ఐ’ కళే వేరు...
ఇంతకాలం ‘క్యాట్ ఐ’ కళ్లద్దాలను చూశాం. ఇప్పుడు సరికొత్తగా ‘క్యాట్ ఐ’ గోళ్లు కూడా వచ్చేశాయి. వీటిల్లో కొట్టొచ్చినట్టుగా కనిపించేది గోళ్ల చివరన కనిపించే ఫినిషింగ్. దీనివల్ల చేతుల్ని అటూ ఇటూ కదిపినప్పుడల్లా గోళ్లు హైలైట్ అవుతాయి. ఇలాంటి నెయిల్ ఆర్ట్ ప్రతీ సందర్భానికి సూట్ అవుతుంది. పండగ, కచేరీ, సినిమా, కాలేజీ, గుడి... ఇలా ఎక్కడికైనా పర్‌ఫెక్ట్ స్టయిల్ స్టేట్‌మెంట్ అనడంలో సందేహం లేదు. అలాగే లేత గులాబీ, నీలం, గోధుమ, ఎరుపు, మెటాలిక్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్... ఇలా రకరకాల రంగులతో ఈ క్యాట్ ఐ నెయిల్స్ ఎంతమందిలో ఉన్నా సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారుస్తాయి.
గోళ్లకీ స్పాలున్నాయండోయ్...
‘కాలి గోటికి కూడా సరిపోవు’ అని అంటుంటారు కదా... ఇప్పుడైతే ఆ పోలిక సరైనదేమో అనిపిస్తుంది. ప్రస్తుతం చేతులకన్నా వాటి గోళ్లకే ఎక్కువ అలంకరణలు వచ్చేశాయి. నఖ సౌందర్యం పట్ల నవతరంలో మోజు పెరుగుతోంది. అందుకే నగరాల్లో ప్రత్యేకంగా నెయిల్ స్పాలు వెలుస్తున్నాయి. గోళ్ల పోషణ కోసం, వాటి అలంకరణ కోసం చాలానే ఖర్చు చేస్తున్నారు. ఇంతకుముందు బ్యూటీ సెంటర్లలోనే సౌందర్యంలో భాగంగా పెడిక్యూర్, మెనిక్యూర్ లాంటి సేవల్ని బ్యూటీషియన్లు అందించేవారు. అయితే సీన్ మారుతోంది. కేవలం గోళ్ల కోసమే నెయిల్ స్పాలున్నాయి. ఇక్కడ గోళ్లను అందంగా, ఆరోగ్యంగా తయారయ్యేలా చేస్తారు. నెయిల్ పాలిష్ వేయడం, యాక్రలిక్ లేదా జెల్ ఎక్స్‌టెన్షన్‌లు అతికిస్తారు. ఫ్రెంచ్, కొరియన్, క్రోమ్, త్రీడీ మొదలైన కళలతో గోళ్లపై రకరకాల పెయింటింగ్‌లు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఈ స్పాలలో సర్వీసును బట్టి వందల నుంచి వేల రూపాయల దాకా చార్జ్ చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నవతరం నఖ సిత్రాలు అన్నీ ఇన్నీ కావు.
ఈ వార్తలు కూడా చదవండి:
నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను తొలగించాలి
కోట్లు కొల్లగొట్టిన ఆ దంపతులు అదుపులో?
Read Latest AP News And Telangana News And International News And Telugu News