కోట్లు కొల్లగొట్టిన ఆ దంపతులు అదుపులో?
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:23 AM
రుణాల పేరుతో తెలిసిన వారి నుంచి రూ.కోట్లలో వసూలు చేసి కనబడకుండాపోయిన పబ్బా చంద్రశేఖర్ (51), స్వప్న (42) దంపతులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
కుషాయిగూడ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రుణాల పేరుతో తెలిసిన వారి నుంచి రూ.కోట్లలో వసూలు చేసి కనబడకుండాపోయిన పబ్బా చంద్రశేఖర్ (51), స్వప్న (42) దంపతులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ భవనంలో ఉన్న ఉప్పల్ జోన్ ఎస్‌వోటీ కార్యాలయానికి వారిని తరలించినట్లు సమాచారం. భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్‌కు చెందిన ఈ దంపతులు చర్లపల్లి డివిజన్, భగవాన్ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లున్నారు. పబ్బా చంద్రశేఖర్ భారతి సిమెంట్ హోల్‌సేల్ డీలర్. ఆర్యవైశ్య సంఘం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగాడు. చంద్రశేఖర్ దంపతులు గతనెల 22 నుంచి కనిపించకుండాపోయారు. వీరు 20 రోజుల్లోనే పలువురి నుంచి రూ.40కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ దంపతుల బాధితులు వంద మంది దాకా ఉంటారని, వారి నుంచి దంపతులు రూ.50 కోట్ల దాకా వసూలు చేశారని భావిస్తున్నారు. బాధితులు జూన్ 30న మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతిని కలిసి తమ గోడు చెప్పుకొని వినతిపత్రం ఇచ్చారు. కాగా తమ తల్లిదండ్రులు స్విట్జర్లాండ్‌కు బయలుదేరి ఆచూకీ లేకుండా పోయారంటూ చంద్రశేఖర్-స్వప్న కూతురు శ్రేయ జూలై 8న చర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.