వాతావరణ మార్పులతో ముప్పు
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:53 AM
‘‘వాతావరణ మార్పుల వల్ల ఎప్పుడో ముప్పు వస్తుందనుకోవడం భ్రమ. ఇప్పటికే మనం ఆ మార్పుల వల్ల కలిగే నష్టాలను ఎదుర్కొంటున్నాం. వర్షాలు గతి తప్పాయి. నదుల్లో నీటి నిల్వలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేని స్థితి
గతంలో హైదరాబాద్‌లో 50 అడుగులు తవ్వితే నీళ్లొచ్చేవి
ఇప్పుడు 1000 అడుగులు తవ్వినా రావడం లేదు
నీటి నిర్వహణలో శాస్త్రీయ పద్ధతుల్ని అనుసరించాలి: ఉత్తమ్
హైదరాబాద్ సిటీ/హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ‘‘వాతావరణ మార్పుల వల్ల ఎప్పుడో ముప్పు వస్తుందనుకోవడం భ్రమ. ఇప్పటికే మనం ఆ మార్పుల వల్ల కలిగే నష్టాలను ఎదుర్కొంటున్నాం. వర్షాలు గతి తప్పాయి. నదుల్లో నీటి నిల్వలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేని స్థితి. పంటల విధానం మారుతుంది. నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఈ వాస్తవాలను అందరూ గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ‘భావి తరాలు మనల్ని క్షమిస్తాయా’? శీర్షికన ఓ చర్చా కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. విధాన నిర్ణేతలు, పరిశ్రమల ప్రముఖులు, శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎల్‌నినో కారణంగా తెలంగాణలో కరువు తరహా పరిస్థితులు ఎదురుకాబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసే వర్షాల మీదనే తెలంగాణ అధికంగా ఆధారపడి ఉందని చెప్పారు. భూగర్భ జలాలు వేగంగా పడిపోతుండటం రాబోతున్న భయానక స్థితిని కళ్లముందుంచుతుందని చెప్పారు. గతంలో హైదరాబాద్‌లో 50 అడుగులు తవ్వితే నీళ్లు పడేవని, ఇప్పుడు 1000 అడుగులు తవ్వినా నీళ్లు రావడం లేదనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు.. నీటి నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ అనిశ్చితి వేళ రైతులకు సాయమందించేందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దేశంలోనే చెరువులు, నీటి కుంటలు, డ్రైనేజీ వ్యవస్థలను కాపాడేందుకు ప్రారంభించిన అత్యుత్తమ కార్యక్రమం హైడ్రా అని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సింపోజియం వ్యవస్థాపకులు గిరీష్ మల్పానీ, ప్లా -స్టిక్ వ్యవస్థాపకులు అవ్యానామెహతా తదితరులు పాల్గొన్నారు.