Share News

ఇంగ్లండ్‌కు కాంస్యం.. ఫ్రాన్స్‌పై 6-4తో ఘన విజయం

ABN , Publish Date - Jul 19 , 2026 | 07:48 AM

ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీని ఇంగ్లండ్ విజయంతో ముగించింది. ఈ టోర్నీలో భాగంగా మూడో స్ధానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై 6-4 తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది.

ఇంగ్లండ్‌కు కాంస్యం.. ఫ్రాన్స్‌పై 6-4తో ఘన విజయం
England vs France 2026 World Cup

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026లో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలైన ఫుట్‌బాల్ మజాను పంచింది. హోరాహోరీగా సాగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6-4 గోల్స్ తేడాతో ఫ్రాన్స్‌పై ఘన విజయం సాధించి, కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 1966లో టైటిల్ గెలిచిన తర్వాత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.


ఇంగ్లండ్ స్టార్ ఫార్వర్డ్ బుకాయో సాకా అద్భుత హాట్రిక్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ 37వ నిమిషంలో ఆపై తొలి సగం అదనపు సమయంలో గోల్స్ చేసిన సాకా.. 87వ నిమిషంలో లభించిన పెనాల్టీని విజయవంతంగా గోల్‌గా మలిచి తన కెరీర్‌లో రెండో అంతర్జాతీయ హ్యాట్రిక్‌‌ను నమోదు చేశాడు. డెక్లాన్ రైస్, ఎజ్రి కొన్సా కూడా చెరో గోల్ చేయడంతో తొలి సగభాగం ముగిసేసరికి ఇంగ్లండ్ 4-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.


ఎంబాపె సరికొత్త రికార్డు:

రెండో అర్ధ భాగంలో ఫ్రాన్స్ పుంజుకుని ఇంగ్లండ్‌కు గట్టి పోటీ ఇచ్చింది. స్టార్ స్ట్రైకర్ క్లియాన్ ఎంబాపె చెలరేగి రెండు గోల్స్ చేయగా, బ్రాడ్లీ బార్కోలా మరో గోల్ అందించాడు. దీంతో ఇంగ్లాండ్ ఆధిక్యం 4-3కి తగ్గి ఉత్కంఠ రేపింది. అయితే సకా పెనాల్టీ గోల్‌తో ఇంగ్లండ్ మళ్లీ పుంజుకుంది. ఇంజ్యూరీ టైమ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు ఉస్మానే డెంబెలే గోల్ చేసినప్పటికీ, చివరి నిమిషంలో ఇంగ్లండ్ స్టార్ జూడ్ బెల్లింగ్‌హామ్ (టోర్నీలో 7వ గోల్) నెట్‌లోకి బంతిని పంపి 6-4తో విజయాన్ని ఖరారు చేశాడు.


ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన ఎంబాపె.. వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ (22) చేసిన ఆటగాడిగా లియోనెల్ మెస్సీ (21) రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుత టోర్నీలో 10 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులోనూ అతడు అగ్రస్థానంలో నిలిచాడు. 1982లో హంగేరి-ఎల్ సాల్వడార్ (10-1) మ్యాచ్ తర్వాత ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ కావడం విశేషం. అంతేకాకుండా, వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక మూడో స్థానపు మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి పది గోల్స్ చేయడం ఇదే తొలిసారి.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?

'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

Updated Date - Jul 19 , 2026 | 09:59 AM