ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:55 PM
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో, చివరి వన్డేకు క్రికెట్ మక్కాగా పేరొందిన లండన్‌లోని చారిత్రాత్మక 'లార్డ్స్' మైదానం వేదికగా నిలవనుంది.
స్పోర్ట్స్ డెస్క్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో, చివరి వన్డేకు క్రికెట్ మక్కాగా పేరొందిన లండన్‌లోని చారిత్రాత్మక 'లార్డ్స్' మైదానం వేదికగా నిలవనుంది. ఇప్పటికే బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించగా, కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ పుంజుకుని విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమం కావడంతో, రేపు లార్డ్స్ వేదికగా జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.
లార్డ్స్ మైదానంలో టీమిండియా వన్డే ట్రాక్ రికార్డు పరిశీలిస్తే మిశ్రమంగా ఉంది. ఇక్కడ భారత్ ఇప్పటివరకు ఆడిన 9 వన్డే మ్యాచ్‌ల్లో కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగా 5 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ చరిత్రాత్మక వేదికపై ప్రతికూల రికార్డు ఉన్నప్పటికీ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా గిల్ సేన సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
1983 ప్రపంచకప్ చారిత్రాత్మక విజయం, 2002 నాట్‌వెస్ట్ సిరీస్ వంటి చిరస్మరణీయ విజయాలను భారత్.. ఈ లార్డ్స్ గడ్డపైనే సాధించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు అదే ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. మరి ఈ ప్రతిష్ఠాత్మక పోరులో 'మెన్ ఇన్ బ్లూ' పాత రికార్డులను తిరగరాసి సిరీస్ ట్రోఫీని ముద్దాడుతుందో లేదో తెలియాలంటే రేపటి(జులై 19) వరకు ఎదురు చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌పై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు
ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అరుదైన రికార్డు.. టికెట్ ధర రూ. 27 లక్షలు!