ఈసారి రెండో హెచ్-1బీ లాటరీ లేదు: యూఎస్
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:49 PM
హెచ్-1బీ వీసా లాటరీకి సంబంధించి యూఎస్ పౌరసత్వ, వలస సేవల శాఖ (యూఎస్‌సీఐఎస్) తాజాగా కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి గాను రెండో లాటరీ ఉండదని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా లాటరీకి సంబంధించి యూఎస్ పౌరసత్వ, వలస సేవల శాఖ (యూఎస్‌సీఐఎస్) తాజాగా కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి గాను రెండో లాటరీ ఉండదని పేర్కొంది. ఈసారి కోటాకు సరిపడా హెచ్-1బీ పిటిషన్లు ఇప్పటికే అందాయని తెలిపింది. ప్రతి సంవత్సరం 65 వేల సాధారణ హెచ్ -1బీ వీసాలతో పాటు అడ్వాన్స్‌డ్ డిగ్రీ మినహాయింపు కింద మరో 20 వేల హెచ్-1బీ వీసాలు జారీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ కోటాకు సరిపడా పిటిషన్లు అందాయని యూఎస్‌సీఐఎస్ తాజాగా పేర్కొంది.
ఈ సంవత్సరం తొలిసారిగా వేతన ఆధారిత విధానంలో లాటరీ నిర్వహించారు. అంతేకాకుండా, గతంతో పోలిస్తే ఈసారి వీసా రిజిస్ట్రేషన్లు కూడా తగ్గాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో 343,981 హెచ్-1బీ రిజిస్ట్రేషన్లు రాగా 2027 ఆర్థిక సంవత్సరానికి 211,600 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. దీంతో, ఈసారి అదనపు లాటరీల అవసరం ఉండవచ్చన్న అంచనాలు వెలువడ్డాయి. అయితే, అంచనాలకు భిన్నంగా రెండో లాటరీ ఉండదని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది. ప్రతి సంవత్సరం హెచ్-1బీ కోసం అప్లై చేసుకున్న సంస్థల రిజిస్ట్రేషన్ల నుంచి కోటాకు సరిపడా కొన్నింటిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. లాటరీలో తమ రిజిస్ట్రేషన్లు ఎంపికయ్యాక ఆయా సంస్థలు ఫీజుతో కూడిన పిటిషన్లను సమర్పిస్తాయి. పిటిషన్లలో కొన్ని తిరస్కరణకు గురైతే కోటా భర్తీ కోసం మరోసారి లాటరీ నిర్వహిస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
నిద్ర రావటం లేదని గేమ్ ఆడింది.. రూ. 1.4 కోట్ల లాటరీ గెలిచింది..
హోర్ముజ్‌లో ఆయిల్ ట్యాంకర్ల పేలుడు.. ఇరాన్ వాదనను ఖండించిన అమెరికా..