పెద్ద హీరోలు ఏపీలో షూటింగ్‌లు చేయాలి: అంబికా కృష్ణ..
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:15 PM
ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ప్రముఖ హీరోలు తమ సినిమాల షూటింగ్లను ఏపీలో నిర్వహించాలని సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ సూచించారు. పెద్ద హీరోలు సహా ప్రతి ఒక్క సినీ హీరో తమ సినిమాకు సంబంధించి కనీసం రెండు షెడ్యూళ్లు అయినా ఇక్కడ చేయాలన్నారు.
ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ప్రముఖ హీరోలు తమ సినిమాల షూటింగ్లను ఏపీలో నిర్వహించాలని సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ సూచించారు. పెద్ద హీరోలు సహా ప్రతి ఒక్క సినీ హీరో తమ సినిమాకు సంబంధించి కనీసం రెండు షెడ్యూళ్లు అయినా ఇక్కడ చేయాలన్నారు. దీని ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారని అంబికా కృష్ణ పేర్కొన్నారు.
ఏపీలో షూటింగ్‌లు ఎక్కువగా జరిగితే లైట్ బాయ్స్, జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, రవాణా, హోటల్, క్యాటరింగ్ సహా తదితర రంగాలకు ఉపాధి లభిస్తుందని అంబికా కృష్ణ వివరించారు. ఈ దిశగా నటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పటికే తొలి అడుగు వేశారని ఆయన చెప్పుకొచ్చారు. మిగిలిన స్టార్ హీరోలూ ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో సముద్ర తీరాలు, అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాలు వంటి సహజ వనరులకు ఎలాంటి కొరత లేదని, చిత్రీకరణకు అనువైన అనేక లొకేషన్లు ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా నంది అవార్డుల నిర్వహణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపాలని అంబికా కృష్ణ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సినిమాల్లో ఆంధ్ర ప్రాంత భాష, యాస క్రమంగా కనుమరుగవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్కృతి, భాష, యాసలకు సినీ దర్శకులు, రచయితలు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో షూటింగ్‌లు పెరిగితే స్థానిక భాష, సంస్కృతికి మరింత గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి..
సీదిరి అప్పలరాజు కుమారుడి కేసు.. కాశీబుగ్గ పోలీసులపై చర్యలు
భారత్ మరిన్ని విజయాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: సీఎం చంద్రబాబు