Share News

ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అరుదైన రికార్డు.. టికెట్ ధర రూ. 27 లక్షలు!

ABN , Publish Date - Jul 18 , 2026 | 03:22 PM

ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీ తుది దశకు చేరుకుంది. రేపు(ఆదివారం)స్పెయిన్, అర్జెంటీనా మధ్య తుది పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఫుట్‌బాల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అరుదైన రికార్డు.. టికెట్ ధర రూ. 27 లక్షలు!
FIFA World Cup 2026 Final

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీ తుది దశకు చేరుకుంది. రేపు(ఆదివారం)స్పెయిన్, అర్జెంటీనా మధ్య తుది పోరు జరగనుంది. న్యూయార్క్‌లోని ప్రముఖ 'మెట్‌లైఫ్ స్టేడియం' వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఫుట్ బాల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో విజేత ఎవరో తేలనుంది. ఇది ఇలా ఉంటే.. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన ఫిఫా ప్రపంచ కప్ 2026 మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ ధర ఏకంగా రూ.27 లక్షలు పలికింది. ఇది ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక ధర కావడం విశేషం.


ఓ స్పోర్ట్స్ మీడియా నివేదిక ప్రకారం.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన అత్యున్నత శ్రేణి (హాస్పిటాలిటీ) టికెట్ ధర ఏకంగా రూ. 27 లక్షలు పలుకుతోంది. ఈ ప్రీమియం హాస్పిటాలిటీ ప్యాకేజీలు కేవలం మ్యాచ్ వీక్షణకే పరిమితం కావు. విదేశీ వీఐపీలు, కార్పొరేట్ దిగ్గజాలను ఆకర్షించేలా స్టేడియంలో ప్రత్యేక విలాసవంతమైన లాంజ్‌లు, ఫైన్ డైనింగ్, విభిన్న లగ్జరీ సేవలను ఫిఫా అందిస్తోంది. అయితే, ఇది కేవలం వీఐపీ ప్యాకేజీ ధర మాత్రమేనని, సామాన్య అభిమానుల కోసం అందుబాటులో ఉండే సాధారణ మ్యాచ్ టికెట్ల ధరలు దీనికంటే చాలా తక్కువగా ఉంటాయని నిర్వాహకులు స్పష్టం చేశారు.


అమెరికా క్రీడా చరిత్రలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఈవెంట్‌గా 2024 లో జరిగిన 'సూపర్ బౌల్' (శాన్ ఫ్రాన్సిస్కో 49ers వర్సెస్ కాన్సాస్ సిటీ చీఫ్స్) నిలిచింది. అప్పట్లో దీని సగటు టికెట్ ధర రూ. 9.6 లక్షలుగా నమోదైంది. ఇప్పుడు ఫిఫా ఫైనల్ టికెట్ ధర ఆ రికార్డును దాదాపు మూడు రెట్లు అధిగమించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో ఈ ఫైనల్ మ్యాచ్ లీస్ట్ టికెట్ ధర 6,943 డాలర్లు(సుమారు రూ.6 లక్షలు)గా ఉంది. ఈ భారీ ధరలపై క్రీడా అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


అత్యంత చౌకైన సాధారణ టికెట్ల ధరలు కూడా సాధారణ ప్రజల బడ్జెట్‌కు మించిపోతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా జరిగే క్రీడా ఈవెంట్లు సామాన్యుడికి అందని ద్రాక్షగా మారనున్నాయనే చర్చ మొదలైంది. కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరిగి, నిజమైన క్రీడాభిమానులు స్టేడియాలకు దూరం కావలసి వస్తోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

మెస్సి, రొనాల్డోలపై ప్రశంసలు.. ఇంగ్లండ్‌పై విమర్శలు చేసిన ట్రంప్

ఫిఫా.. థర్డ్ ప్లేస్ మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ఎవరికీ లేదు: ఫ్రాన్స్ కోచ్

Updated Date - Jul 18 , 2026 | 04:09 PM