Share News

యమాల్ మాత్రమే కాదు.. ఈ ముగ్గురు ప్లేయర్లనూ మెస్సి ఆడించాడు!

ABN , Publish Date - Jul 18 , 2026 | 02:54 PM

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సికి సంబంధించిన మరో ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యమాల్ మాత్రమే కాదు.. మరో ముగ్గురు స్పెయిన్ ప్లేయర్లకు మెస్సితో చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది. తాజాగా వాటికి సంబంధించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.

యమాల్ మాత్రమే కాదు.. ఈ ముగ్గురు ప్లేయర్లనూ మెస్సి ఆడించాడు!
Lionel Messi

ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సికి సంబంధించిన మరో ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పెయిన్ యువ సంచలనం యమాల్ పసికందుగా ఉన్నప్పుడు మెస్సి స్నానం చేయించిన ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే యమాల్ మాత్రమే కాదు.. మరో ముగ్గురు స్పెయిన్ ప్లేయర్లకు మెస్సితో చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది. తాజాగా వాటికి సంబంధించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. గావి, డానీ ఓల్మో, జోవాన్ గ్రేసియా కూడా మెస్సితో చిన్నప్పుడే ఫొటోలు దిగారు. యమాల్ సహా ఈ ముగ్గురు ప్లేయర్లు కూడా ఫిఫా ఫైనల్ పోరులో మెస్సికి ప్రత్యర్థులు కావడం విశేషం.

Messi-2.jpg


అభిమానులుగా మొదలై ప్రత్యర్థులుగా..!

స్పెయిన్ యువ మిడ్‌ఫీల్డర్ గావి చిన్నప్పటి నుంచే మెస్సి ఆటకు అభిమాని. బార్సిలోనా ఫుట్‌బాల్ అకాడమీ లా మాసియాలో ఎదిగిన గావి.. మెస్సి అడుగుజాడల్లోనే ముందుకు సాగాడు. మెస్సితో కలిసి ఉన్న గావి చిన్ననాటి ఫొటోలు గతంలో పలుమార్లు బయటకు వచ్చాయి. అప్పట్లో తన ఆరాధ్య ఆటగాడిగా చూసిన మెస్సినే ఇప్పుడు వరల్డ్‌ కప్ ఫైనల్లో ప్రత్యర్థి. స్పెయిన్ అటాక్ విభాగంలో కీలక ఆటగాడిగా ఉన్న డానీ ఓల్మో కూడా మెస్సి ప్రభావంతో ఎదిగిన వారిలో ఒకడు. బార్సిలోనా స్వర్ణయుగంలో మెస్సి ఆటతీరును చూసి అతడిని ఆదర్శంగా తీసుకున్న ఓల్మో.. చిన్న వయసులోనే అతడిని కలిసే అవకాశం పొందాడు. ఏళ్ల తర్వాత ఇప్పుడు స్పెయిన్ జట్టులో అనుభవజ్ఞుడైన ఆటగాడిగా ఎదిగాడు. ఫైనల్లో తన ఆదర్శ ఆటగాడికే సవాల్ విసరనున్నాడు.


స్పెయిన్ గోల్‌ కీపర్ గ్రేసియా కూడా మెస్సితో చిన్నప్పుడు ఫొటో దిగాడు. అప్పట్లో సాధారణంగా కనిపించిన ఆ క్షణాలు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్ నేపథ్యంలో ప్రత్యేకమైన జ్ఞాపకాలుగా మారాయి. ఒకప్పుడు మెస్సిని చూసి ఫుట్‌బాల్ నేర్చుకున్న ఈ యువ ఆటగాళ్లు.. ఇప్పుడు అతడితోనే ప్రపంచ వేదికపై పోటీ పడనుండటం ఫుట్‌బాల్‌లోని అద్భుతమైన పరిణామాల్లో ఒకటిగా నిలుస్తోంది. మెస్సితో చిన్ననాటి అనుబంధం ఉన్న యమాల్, గావి, ఓల్మో, గ్రేసియా ముగ్గురూ మెస్సికి ప్రత్యర్థులే. ఫిఫా ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో అర్జెంటీనా-స్పెయిన్ జట్లు తలపడనున్నాయి. ఒకే లక్ష్యంతో బరిలోకి దిగనున్న ఆ నలుగురు స్పెయిన్ ప్లేయర్లు.. అర్జెంటీనాను ఓడించి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

మెస్సి, రొనాల్డోలపై ప్రశంసలు.. ఇంగ్లండ్‌పై విమర్శలు చేసిన ట్రంప్

ఫిఫా.. థర్డ్ ప్లేస్ మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ఎవరికీ లేదు: ఫ్రాన్స్ కోచ్

Updated Date - Jul 18 , 2026 | 02:55 PM