Share News

ఫిఫా ఫైనల్.. యమాల్‌తో పోటీపడతానని అనుకోలేదు: మెస్సి

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:42 AM

యమాల్ పసికందుగా ఉన్నప్పుడు దాదాపు 19 ఏళ్ల క్రితం ఓ ఈవెంట్‌లో భాగంగా మెస్సి అతడికి స్నానం చేయించిన ఫొటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై మెస్సి ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.

ఫిఫా ఫైనల్.. యమాల్‌తో పోటీపడతానని అనుకోలేదు: మెస్సి
Lionel Messi

ఇంటర్నెట్ డెస్క్: స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్‌పై అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి ప్రశంసల జల్లు కురిపించాడు. దాదాపు 19 ఏళ్ల క్రితం ఓ ఈవెంట్‌లో భాగంగా యమాల్ పసికందుగా ఉన్నప్పుడు మెస్సి అతడికి స్నానం చేయించిన ఫొటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మెస్సి ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ఫిఫా ప్రపంచ కప్ 2026లో స్పెయిన్-అర్జెంటీనా జట్లు టైటిల్ పోరులో ఆదివారం తలపడనున్నాయి. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి, స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ మధ్య జరిగే పోరు ప్రత్యేక ఆకర్షణగా మారింది. రెండు తరాల అత్యుత్తమ ప్లేయర్లుగా గుర్తింపు పొందిన ఈ ఇద్దరూ బార్సిలోనా ప్రతిష్ఠాత్మక ‘లా మాసియా అకాడమీ’లో ఎదిగారు.


‘యమాల్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నేను స్నానం చేయించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అవి నేను కూడా మళ్లీ చూశాను. ఆ ఫొటోషూట్ తర్వాత ఇప్పుడు అదే యమాల్‌తో ప్రపంచ కప్ ఫైనల్‌లో పోటీపడనుండటం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఇది అసాధారణ విషయం. యమాల్ అద్భుతమైన ఆటగాడు. అతడు చిన్నవయసులోనే చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో ఉన్నాడు. బార్సిలోనా ప్లేయర్‌గా అతడి ఎదుగుదలను నేను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నా. కానీ ఈసారి యమాల్‌ను అడ్డుకునేందుకు మేం మా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం. మేము మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నా. కానీ యమాల్, అతడి జట్టు మాత్రం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చకూడదని ఆశిస్తున్నా’ అని మెస్సి సరదాగా వ్యాఖ్యానించాడు.


ఈ ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మెస్సి, యమాల్ ఇద్దరికీ చారిత్రాత్మకమే. అర్జెంటీనా విజయం సాధిస్తే వరుసగా రెండు వరల్డ్‌ కప్ ట్రోఫీలను అందుకున్న తొలి కెప్టెన్‌గా మెస్సి నిలిచే అవకాశం ఉంది. మరోవైపు స్పెయిన్ గెలిస్తే అతి పిన్న వయసులో వరల్డ్‌ కప్ ఫైనల్ ఆడి విజేతగా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో యమాల్ రెండో స్థానాన్ని దక్కించుకోనున్నాడు. దీంతో ప్రపంచ కప్ ఫైనల్‌లో మెస్సి అనుభవమా.. యమాల్ అసాధారణ ప్రతిభనా.. ఏది నెగ్గుతుందో చూడాలన్న ఉత్కంఠ ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల్లో నెలకొంది.


ఇవి కూడా చదవండి:

ఫిఫా ఫైనల్స్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు దూరం.. కారణం ఇదే!

మెస్సిపై సింగర్ షకీరా ప్రశంసల జల్లు.. భార్య ఆంటోనెలా రియాక్షన్ వైరల్

Updated Date - Jul 18 , 2026 | 11:42 AM