Share News

ఫిఫా ఫైనల్స్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు దూరం.. కారణం ఇదే!

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:36 PM

ఫిఫా వరల్డ్‌ కప్ 2026 ఫైనల్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ హాజరుకావడం లేదని ప్రకటించారు. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి.

ఫిఫా ఫైనల్స్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు దూరం.. కారణం ఇదే!
Javier Milei

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా వరల్డ్‌ కప్ 2026 ఫైనల్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ హాజరుకావడం లేదని ప్రకటించారు. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించకుండా.. తన అధికారిక నివాసంలోనే టీవీలో చూస్తానని వెల్లడించారు. దీనికి కారణం తాను నమ్మే ఓ సెంటిమెంట్ అని స్పష్టం చేశారు.


టోర్నీలో ఇప్పటివరకు అర్జెంటీనా ఆడిన ఏడు మ్యాచ్‌లను కూడా అధ్యక్ష భవనం ‘ఒలివోస్’లోనే వీక్షించానని, ఆ ఏడు మ్యాచ్‌ల్లోనూ జట్టు విజయం సాధించిందని మిలీ తెలిపారు. అదే సెంటిమెంట్‌ను ఫైనల్‌లోనూ కొనసాగిస్తానని చెప్పారు. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే.. ప్రతి మ్యాచ్ సమయంలో తాను ధరించే ప్రత్యేక జాకెట్‌ను కూడా మార్చబోనని మిలీ వెల్లడించారు. ‘స్విట్జర్లాండ్‌తో మ్యాచ్ రోజున చలి కారణంగా ఓ బరువైన జాకెట్ వేసుకున్నాను. వేడిగా అనిపించి మధ్యలో దాన్ని తీసేశాను. వెంటనే ప్రత్యర్థి గోల్ చేసింది. మళ్లీ జాకెట్ వేసుకున్నాక దాన్ని తీయలేదు. అప్పటి నుంచి అదే జాకెట్‌తోనే మ్యాచ్‌లు చూస్తున్నాను’ అని ఆయన చెప్పారు.


అర్జెంటీనాలో ఇలాంటి సెంటిమెంట్లను ‘కాబాలాస్’ అని పిలుస్తారు. జట్టు గెలవాలని అదే దుస్తులు ధరించడం, ఒకటే చోట కదలకుండా కూర్చొని మ్యాచ్ చూడడం, మ్యాచ్‌ల మధ్య జెర్సీ ఉతక్కపోవడం వంటి ఆచారాలను అభిమానులు కచ్చితంగా పాటిస్తుంటారు. అర్జెంటీనా అధ్యక్షులు వరల్డ్‌ కప్ మ్యాచ్‌లకు దూరంగా ఉండే సంప్రదాయానికి కూడా ఓ చరిత్ర ఉంది. 1990 ప్రపంచ ‌కప్ సందర్భంగా అప్పటి అధ్యక్షుడు కార్లోస్ మెనెమ్.. తమ జట్టు ఆడే మ్యాచ్‌కు హాజరయ్యారు. ఆ మ్యాచ్‌లో అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో కామెరూన్ చేతిలో సంచలన ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి ఆయనను అభిమానులు 'ముఫా' (దురదృష్టాన్ని తెచ్చేవాడు)గా అభివర్ణించారు. అప్పటి నుంచి అధికారంలో ఉన్న ఏ అర్జెంటీనా అధ్యక్షుడూ జాతీయ జట్టు వరల్డ్‌ కప్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం మానేశారు.


ఇవి కూడా చదవండి:

జపాన్ ఓపెన్ టోర్నీ: సెమీస్‌కు సింధు.. ఎలాంటి పోటీ లేకుండానే..

రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ వార్తలు.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ రియాక్షన్ ఇదే!

Updated Date - Jul 17 , 2026 | 12:37 PM