జపాన్ ఓపెన్ టోర్నీ: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
ABN , Publish Date - Jul 18 , 2026 | 10:55 AM
జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి చైనాకు చెందిన చెన్ యూఫీపై 21-19, 15-10 తేడాతో విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి చైనాకు చెందిన చెన్ యూఫీపై 21-19, 15-10 తేడాతో విజయం సాధించింది. రెండో గేమ్‌లో యూఫీ కండరాల గాయంతో మ్యాచ్ నుంచి అనూహ్యంగా వైదొలగడంతో సింధు విజయం లాంఛనమైంది. దీంతో వరల్డ్ టూర్‌లో సింధు రెండేళ్లలో ఓ టోర్నీ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. చివరిసారిగా ఆమె 2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో ఫైనల్‌లో ఆడి గెలిచి టైటిల్ అందుకుంది.
మ్యాచ్ ప్రారంభంలో యూఫీ దూకుడు ప్రదర్శించినా.. సింధు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 10-5తో ఆధిక్యం సాధించింది. విరామం తర్వాత సింధు మరింత దూకుడుగా ఆడి.. యూపీని ఒత్తిడిలోకి నెట్టింది. తొలి గేమ్ చివరిలో ఇద్దరూ 19-19తో సమంగా నిలవడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. ఈ కీలక సమయంలో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి 21-19తో గేమ్‌ను సొంతం చేసుకుంది. 51 షాట్ల సుదీర్ఘ ర్యాలీలోనూ ఆమె ఆధిపత్యం ప్రదర్శించడం మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. రెండో గేమ్‌లోనూ సింధు 11-7తో విరామానికి ముందంజలో నిలిచింది. అయితే యూఫీ హ్యామ్‌స్ట్రింగ్ గాయం తీవ్రతరం కావడంతో ఆడలేకపోయింది. చివరికి 15-10 వద్ద యూఫీ మ్యాచ్‌ను కొనసాగించలేక రిటైర్ కావడంతో సింధు ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.
ఐదు పరాజయాలకు చెక్
ఈ విజయంతో యూఫీ చేతిలో వరుసగా ఎదురైన ఐదు ఓటములకు సింధు తెరదించింది. అంతేకాకుండా జపాన్ ఓపెన్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరి మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా సింధు రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య దేశం జపాన్‌కు చెందిన అకానే యమగూచితో సింధు టైటిల్ కోసం తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ఫైనల్స్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు దూరం.. కారణం ఇదే!
మెస్సిపై సింగర్ షకీరా ప్రశంసల జల్లు.. భార్య ఆంటోనెలా రియాక్షన్ వైరల్