Share News

విండీస్‌ క్రికెట్‌ దిగ్గజం సోబర్స్‌ అస్తమయం

ABN , Publish Date - Jul 18 , 2026 | 05:35 AM

వెస్టిండీ్‌సకు చెందిన అలనాటి దిగ్గజ ఆల్‌రౌండర్‌ సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌ (89) కన్ను మూశారు. ఈ విషయాన్ని సోబర్స్‌ కుమారుడు డానియల్‌ శుక్రవారం...

విండీస్‌ క్రికెట్‌ దిగ్గజం సోబర్స్‌ అస్తమయం

బ్యాటర్‌, బౌలర్‌, ఫీల్డర్‌గా తనదైన ముద్ర

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడు

బ్రిడ్జ్‌టౌన్‌ (బార్బడోస్‌): వెస్టిండీ్‌సకు చెందిన అలనాటి దిగ్గజ ఆల్‌రౌండర్‌ సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌ (89) కన్ను మూశారు. ఈ విషయాన్ని సోబర్స్‌ కుమారుడు డానియల్‌ శుక్రవారం వెల్లడించాడు. క్రికెట్‌ అందించిన గొప్ప ఆటగాళ్లలో సోబర్స్‌ ఒకరు. ఎడమచేతి వాటం బ్యాటింగ్‌లో దిట్ట అయిన ఆయన పేస్‌ బౌలింగ్‌లోనూ అంతే మేటి. అంతేకాదు స్పిన్‌ బౌలింగ్‌ చేయడంలో సోబర్స్‌ సిద్ధహస్తులు. అంతేనా.. నాటి తరంలో గొప్ప ఫీల్డర్లలో ఒకరు. ఆటలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సోబర్స్‌ క్రికెట్‌ మేధావిగా గుర్తింపు పొందారు.

17 ఏళ్లకే అరంగేట్రం..

పదిహేడు సంవత్సరాల వయస్సులో వెస్టిండీస్‌ తరపున టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన సోబర్స్‌ 1954-74 మధ్య మొత్తం 93 టెస్టులు ఆడారు. 57.78 సగటుతో 26 శతకాలు, 30 అర్ధ శతకాలతో 8,032 పరుగులు సాధించారు. 235 వికెట్లు పడగొట్టిన ఆయన 109 క్యాచ్‌లు అందుకున్నారు. 1958లో పాకిస్థాన్‌పై 365 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ సోబర్స్‌ కెరీర్‌లో చిరస్మరణీయ ఘట్టం. అప్పట్లో టెస్ట్‌ల్లో ఆయనదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. 1968లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదడం సోబర్స్‌ అద్భుత బ్యాటింగ్‌కు అద్దం పట్టింది. వెస్టిండీస్‌ జట్టు సారథిగా కొన్ని తరాలకు సోబర్స్‌ స్ఫూర్తిగా నిలిచారు. ఇక ఆయన గణాంకాలు లెక్కకు అందనివి. క్రికెట్‌ ప్రతి విభాగంలో సోబర్స్‌ చెలాయించిన ఆధిపత్యం భవిష్య ఆల్‌రౌండర్లకు ఒక ప్రమాణికంగా నిలిచింది. ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు సోబర్స్‌ను వరించాయి. ‘విజ్డెన్‌ క్రికెట్‌ ఆఫ్‌ ద సెంచరీ’, ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’తోపాటు, 1975లో క్వీన్‌ ఎలిజబెత్‌ 2తో ‘సర్‌’ బిరుదును సోబర్స్‌ అందుకున్నారు. సోబర్స్‌ మృతికి ఐసీసీ, బీసీసీఐతోపాటు వివిధ దేశాల క్రికెట్‌ సంఘాలు సంతాపం తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్ 2026: ఫైనల్ మ్యాచ్‌కు డొనాల్డ్ ట్రంప్

లార్డ్స్‌కు రోహిత్ శర్మ తల్లిదండ్రులు.. రిటైర్‌మెంట్ వార్తల వేళ కీలక పరిణామం!

Updated Date - Jul 18 , 2026 | 05:35 AM