ఫిఫా ప్రపంచ కప్ 2026: ఫైనల్ మ్యాచ్‌కు డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Jul 17 , 2026 | 08:00 PM
ఫిఫా ప్రపంచ కప్ 2026 తుదిపోరు స్పెయిన్, అర్జెంటీనా మధ్య న్యూజెర్సీలోని యార్క్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 తుదిపోరు కోసం కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్పెయిన్, అర్జెంటీనా మధ్య న్యూజెర్సీలోని యార్క్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జులై 19న జరిగే ఈ అంతిమ పోరును వీక్షించేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్నవారు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు.
ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ధ్రువీకరించారు. 'ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం మేము ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మా(యూఎస్)అధ్యక్షుడు కూడా ఈ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు రెడీ అయ్యారు' అని లీవిట్ మీడియా సమావేశంలో తెలిపారు. ' ఫైనల్‌లో ట్రంప్ కు ఇష్టమైన జట్టు ఏదో నాకు తెలియదు. మీకు తెలుసుకోవాలని ఉంటే.. స్వయంగా అధ్యక్షుడు ట్రంప్‌నే అడగండి. ఆయన మీకు ఒక సరదా సమాధానం ఇస్తారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను' ఆమె అన్నారు. అలానే శుక్రవారం న్యూయార్క్ నగరంలోని ట్రంప్ టవర్‌లో జరిగే ఫిఫా విందుకు కూడా యూఎస్ ప్రెసిడెంట్ హాజరుకానున్నారు.
అలానే ట్రంప్ తో కలిసి విజేతలకు ప్రపంచ కప్ ను అందజేసే అవకాశం ఉందని ఫిపా అధ్యక్షుడు గియానీ ఇన్ ఫాంటునూ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫైనల్ జరిగే దేశాధ్యక్షుడు, ఫిఫా అధ్యక్షుడితో కలిసి ట్రోఫీని అందజేయడం సంప్రదాయంగా వస్తుంది. ఖతార్‌లో జరిగిన 2022 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ, ఇన్ఫాంటినోతో కలిసి అర్జెంటీనాకు ట్రోఫీని అందజేశారు. 2018లో రష్యాలో జరిగిన ఫైనల్ అనంతరం ఆదేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్‌కు ట్రోఫీని అందజేశారు.
ఇవి కూడా చదవండి:
రైల్వే ప్రయాణికులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ