Share News

రైల్వే ప్రయాణికులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 17 , 2026 | 07:03 PM

రైల్వే ప్రయాణికుల ఆత్మగౌరవం, భద్రత, ప్రమాద పరిహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇకపై ప్రయాణికులను 'రెండవ తరగతి ప్రయాణికులు' అని సంబోధించవద్దని రైల్వే శాఖను ఆక్షేపించింది.

రైల్వే ప్రయాణికులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Supreme Court railway ruling

న్యూఢిల్లీ, జులై 17: రైల్వే ప్రయాణికుల ఆత్మగౌరవం, భద్రత, ప్రమాద పరిహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇకపై ప్రయాణికులను 'రెండవ తరగతి ప్రయాణికులు' (Second Class Passengers) అని సంబోధించవద్దని రైల్వే శాఖను ఆక్షేపించింది. 'క్లాస్' అనే విభజన కేవలం రైలు కోచ్‌లకు మాత్రమే పరిమితం కావాలని, మనుషులకు కాదని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రయాణికులను అలా పిలవడం రాజ్యాంగం కల్పించిన సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని, ఇది గత చరిత్రలోని వర్గ విభజనలను గుర్తు చేస్తోందని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది.


టికెట్ లేదని నిరూపించాల్సిన బాధ్యత రైల్వేదే..

ఒక రైలు ప్రమాద బాధితురాలికి రూ. 8 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించిన కోర్టు.. ప్రమాద సమయంలో టికెట్ పోయినంత మాత్రాన పరిహారాన్ని నిరాకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. బాధిత కుటుంబాలు అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని, సదరు ప్రయాణికుడికి టికెట్ లేదని నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా రైల్వే శాఖదేనని స్పష్టం చేసింది. రైల్వే ప్రమాద పరిహార చట్టాలను మానవతా దృక్పథంతో, ఉదారంగా అమలు చేయాలని ధర్మాసనం హితవు పలికింది.


భద్రతా నిబంధనలు కాగితాల్లో బాగున్నా.. క్షేత్రస్థాయిలో అమలు లోపించిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రైల్వేల్లో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా, రైల్వే భద్రతను కూడా మెరుగుపరచవచ్చని కోర్టు సూచించింది. అదే సమయంలో ప్రయాణికులు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని, ప్రాణాలకు తెగించి ఫుట్‌బోర్డ్ ప్రయాణాలు చేయవద్దని ధర్మాసనం హెచ్చరించింది.


ఇవి కూడా చదవండి:

ఫిఫా వరల్డ్ కప్ జోష్: హైదరాబాద్‌లో బార్ల వేళల పొడిగింపు!

మీ పేరు ముందు డాక్టర్‌ను తొలగించండి: సుప్రీం కోర్టు

Updated Date - Jul 17 , 2026 | 07:29 PM