న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ భేష్: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రశంసలు..
ABN , Publish Date - Jul 17 , 2026 | 06:50 PM
న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ప్రశంసించారు. న్యాయవాదుల సంక్షేమ నిధిని రూ.100 కోట్లతో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఢిల్లీ: న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ప్రశంసించారు. న్యాయవాదుల సంక్షేమ నిధిని రూ.100 కోట్లతో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న న్యాయవాదుల సంక్షేమ పథకాల వివరాలను సీజేఐ ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వివరించారు.
ఈ సందర్భంగా న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. కెనరా బ్యాంకులో రూ.100 కోట్ల శాశ్వత కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేశామని, దీనిపై వచ్చే వడ్డీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపింది. అలాగే 2022 నుంచి 2026 వరకు న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌కు అదనంగా రూ.7 కోట్ల నిధులను కేటాయించినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో సుమారు 50 వేల మంది న్యాయవాదుల కుటుంబాలకు ఉచిత ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించింది. ప్రతి న్యాయవాది కుటుంబానికి రూ.2లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం అందిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ప్రమాదవశాత్తు న్యాయవాది మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోందని, దేశంలో న్యాయవాదుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందని అఫిడవిట్‌లో పేర్కొంది.
కాగా, మహిళా న్యాయవాదులకు కోర్టుల్లో కనీస సదుపాయాలు కల్పించే అంశంపై సమీక్ష నిర్వహించి నివేదిక సమర్పించాలని అడ్వకేట్ జనరల్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. మహిళా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అవసరమైన మౌలిక వసతులపై వివరాలు సేకరించాలని సూచించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 770/2026 విచారణ సందర్భంగా తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శి బి.పాపిరెడ్డి ఈ అఫిడవిట్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల వైద్య అత్యవసరాలు, కుటుంబ భద్రత, ఆర్థిక సహాయానికి తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నిరంతరం పనిచేస్తోందని అఫిడవిట్‌లో ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయనీ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి
బీఆర్ఎస్ పార్టీకి గుడ్ న్యూస్.. యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతి..
ఫిఫా వరల్డ్ కప్ జోష్: హైదరాబాద్‌లో బార్ల వేళల పొడిగింపు!