బీఆర్ఎస్ పార్టీకి గుడ్ న్యూస్.. యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతి..
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:02 PM
బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 'బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ'కు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. శనివారం నాడు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో సభ నిర్వహించుకోవచ్చని తెలిపింది.
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 'బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ'కు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. శనివారం నాడు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో సభ నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చింది. సభ రోజు హైవేను బ్లాక్ చేయొద్దని విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించొద్దని పేర్కొంది. పోలీసుల సూచనలు పాటించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్ర యువతకు అనేక హామీలు ఇచ్చారని బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు చెబుతున్నారు. ఆ సమయంలో సరూర్‌నగర్ స్టేడియం నుంచే వారు యూత్ డిక్లరేషన్ ప్రకటించారని వెల్లడిస్తున్నారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో వాగ్దానాలను యువతకు ఇచ్చారని అంటున్నారు. నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వారిని మోసం చేస్తోందని ఆరోపిస్తున్నారు. యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఇప్పటివరకు అమలు చేయలేదని బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు పేర్కొంటున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గులాబీ నేతలు నిర్ణయించారు.
అయితే, ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో తెలంగాణ హైకోర్టును బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించగా.. తాజాగా వారి సభకు న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు శనివారం నిర్వహించే సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు, యువత పెద్దఎత్తున తరలిరావాలని గులాబీ నేతలు పిలుపునిచ్చారు. కాగా, ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
దారుణం.. బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం.. ఇద్దరిపై పోక్సో కేసు..
ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. నగదు రహిత వైద్య సేవల ప్రారంభం..