Share News

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. నగదు రహిత వైద్య సేవల ప్రారంభం..

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:21 PM

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత వైద్య సేవల పథకాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లాంఛనంగా ప్రారంభించారు

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. నగదు రహిత వైద్య సేవల ప్రారంభం..
Cashless Health Scheme

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత వైద్య సేవల పథకాన్ని ప్రారంభించింది. దీనిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా NEHS పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులు, EHCT ట్రస్ట్ డీడ్‌ను మంత్రులు ఆవిష్కరించారు.


ఈ పథకం ద్వారా మొత్తం 17.88 లక్షల మందికి ఆరోగ్య భద్రత లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 886 ప్రైవేట్, 114 ప్రభుత్వ ఆస్పత్రుల్లో లబ్ధిదారులకి నగదు రహిత చికిత్స పొందే అవకాశం కల్పించారు. అపోలో, యశోద, కిమ్స్, మెడికవర్, కేర్, కామినేని, కాంటినెంటల్, స్టార్, బసవతారకం వంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ సేవలు పొందొచ్చు. మొత్తం 1,816 వైద్య, శస్త్రచికిత్స ప్యాకేజీలను ఈ పథకం ద్వారా అమలు చేయనున్నారు. ప్రీ-ఆథరైజేషన్ నుంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ వరకు ప్రక్రియ మొత్తం పూర్తిగా డిజిటల్ విధానంలో కొనసాగనుంది. ఉద్యోగులు, పెన్షనర్ల భాగస్వామ్యంతో EHCT ట్రస్ట్ ద్వారా దీన్ని అమలు చేయనున్నారు. ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌కు సమానంగా ప్రభుత్వం కూడా వాటా ఇవ్వనుంది.


దీని అమలు కోసం రాష్ట్రంలో ప్రస్తుతం 12 వెల్‌నెస్ సెంటర్లు ఉండగా.. త్వరలో మరో 24 వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇకపై ప్రతి వెల్‌నెస్ సెంటర్‌ను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా నాణ్యమైన, పారదర్శక, సుస్థిర వైద్య సేవలను ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసినట్లైంది.


ఈ వార్తలు కూడా చదవండి:

అనాథ విద్యార్థులకు స్వనాథ్ స్కాలర్‌షిప్‌

10 వేల కోట్లతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ!

Updated Date - Jul 17 , 2026 | 05:04 PM