Share News

సీట్ల పునర్విభజనపై డీఎంకే సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఒంటరిగా ముందుకు!

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:29 PM

దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై డీఎంకే పార్టీ కీలకమైన, స్వతంత్ర నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్‌తో ఎలాంటి ముందస్తు సంప్రదింపులు జరపకుండానే, సొంతంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది.

సీట్ల పునర్విభజనపై డీఎంకే సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఒంటరిగా ముందుకు!
DMK to Take Independent Stand on Delimitation Bill, Stresses Tamil Nadu's Interests

న్యూఢిల్లీ/చెన్నై, జులై 17: దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)కు సంబంధించిన బిల్లుపై తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే (DMK) అత్యంత కీలకమైన, స్వతంత్ర నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా (I.N.D.I.A) కూటమితో సంబంధం లేకుండా ... రాష్ట్ర ప్రయోజనాలు, దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ బిల్లుపై కాంగ్రెస్‌తో ఎలాంటి ముందస్తు సంప్రదింపులు జరపకుండానే, సొంతంగా నిర్ణయం తీసుకుని పార్లమెంట్‌లో గళమెత్తాలని డీఎంకే అధినాయకత్వం నిర్ణయించింది.


ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ఎంపీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో లోక్‌సభ స్థానాల పునర్విభజన వల్ల తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. 'తమిళనాడు ప్రజల గొంతుకగా పార్లమెంట్‌లో మన ఎంపీలు గళం విప్పాలి. రాష్ట్ర హక్కులను, ప్రజల ప్రయోజనాలను కాపాడటమే మన ఏకైక లక్ష్యం' అని ఎం.కె.స్టాలిన్ చెప్పారు.


డీఎంకే ఎంపీల సమావేశంలో చర్చకు వచ్చిన కీలక అంశాలు:

మెరిట్ ఆధారంగానే నిర్ణయం: పార్లమెంట్‌లో ప్రభుత్వం అధికారికంగా బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత... దానిలోని లోటుపాట్లు, నిబంధనలను (Merit) పరిశీలించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలని డీఎంకే వర్గాలు స్పష్టం చేశాయి.

50 శాతం సీట్లు పెరిగే అవకాశంపై చర్చ: భవిష్యత్తులో లోక్‌సభ సీట్ల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగే అవకాశం ఉందన్న అంచనాలపై ఈ సమావేశంలో డీఎంకే ఎంపీలు విస్తృతంగా చర్చించారు.

సీట్ల నిష్పత్తిపై 'తగ్గేదే ఉండదు': జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్‌లో తమ ప్రాతినిధ్యాన్ని (సీట్ల నిష్పత్తిని) కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే, దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటా ఏమాత్రం తగ్గకుండా పాత నిష్పత్తినే కొనసాగించాలనే ప్రతిపాదనపై కట్టుబడి ఉండాలని, ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని డీఎంకే నిర్ణయించింది.

జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం:

సాధారణంగా జాతీయ స్థాయి ముసాయిదాలు, బిల్లుల విషయంలో డీఎంకే.. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉమ్మడి వ్యూహాన్ని అనుసరిస్తూ వచ్చింది. అయితే, ఇటీవలి రాజకీయ పరిణామాలు, డీఎంకే ఒంటరిగా పోరాడడానికే మొగ్గు చూపేలా చేశాయి. కాంగ్రెస్‌తో సంప్రదించకుండా స్వతంత్ర నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించడం ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డీఎంకే తీసుకోబోయే ఈ నిర్ణయం, రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఆందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Updated Date - Jul 17 , 2026 | 05:01 PM