మీ పేరు ముందు డాక్టర్‌ను తొలగించండి: సుప్రీం కోర్టు
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:17 PM
అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారానికి గురైన ఆ చిన్నారికి సరైన వైద్యం అందక మృతి చెందడంతో సదరు వైద్యులపై సుప్రీంకోర్టు మండిపడింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారానికి గురైన ఆ చిన్నారికి సరైన వైద్యం అందిచకపోవడంతో మృతి చెందడంతో సదరు వైద్యులపై సుప్రీంకోర్టు మండిపడింది. సరిగ్గా విధులు నిర్వహించనప్పుడు పేరుకు ముందు డాక్టర్ అనే పదాన్ని రాసుకునే హక్కు ఆ వైద్యులకు లేదని వ్యాఖ్యానించింది.
ఆ పసిపాప విషయంలో మానవత్వం చూపించి ఉంటే.. సరైన వైద్య సదుపాయాలు లేనప్పుడు ఆ బిడ్డను మరో ఆస్పత్రికి పంపేవారని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధితురాలి కుటుంబం పేదది కావడం, వైద్య ఖర్చులు భరించలేకపోవడం వల్లే ఆ చిన్నారి ప్రాణాలను నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలు ఏం జరిగిందంటే?
మార్చి 16న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి చాక్లెట్లు కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడి.. అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను కుటుంబ సభ్యులు గుర్తించారు. తొలుత రెండు ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లగా... బాలికను చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు. చివరకు ఘజియాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన సిట్.. వైద్యులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయకపోవడంతో పోలీసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలానే సకాలంలో చిన్నారికి చికిత్స అందించని రెండు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులను తీవ్రంగా మందలించింది. మృతురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి