Share News

ఢిల్లీ ఐఆర్‌ఎస్ అధికారి కుమార్తె హత్య కేసు.. 973 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు

ABN , Publish Date - Jul 17 , 2026 | 01:46 PM

ఢిల్లీలో సంచలనం రేపిన ఐర్ఆస్ఎస్ ఆఫీసర్ కుమార్తె హత్యాచారం కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసులో మొత్తం 82 మంది సాక్షుల వాంగ్మూలాలతో 973 పేజీల ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.

ఢిల్లీ ఐఆర్‌ఎస్ అధికారి కుమార్తె హత్య కేసు.. 973 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు
Delhi Police have filed a 973 page chargesheet

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఐఆర్‌ఎస్ ఆఫీసర్ కుమార్తె హత్యాచారం కేసులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పనిమనిషి రాహుల్ మీనాపై ఢిల్లీ పోలీసులు.. 973 పేజీల ఛార్జ్‌షీట్‌‌ను స్థానిక కోర్టులో దాఖలు చేశారు.


దర్యాప్తులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో రాహుల్ మీనాను గత ఫిబ్రవరిలో తొలగించారు ఐఆర్ఎస్ ఆఫీసర్. ఆ ఇంటి సంబంధిత ఎక్స్‌ట్రా తాళం చెవి గురించిన సమాచారం ముందే తెలిసిన రాహుల్.. ఏప్రిల్ 22 తెల్లవారుజామున దాని సాయంతో ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న బాధితురాలిని డబ్బు డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, ఆ తర్వాత మొబైల్ ఛార్జర్ కేబుల్‌ను గొంతుకు బిగించి హతమార్చాడని పోలీసులు ఆరోపించారు. అనంతరం ఇంట్లో ఉన్న సుమారు రూ.2.5 లక్షల నగదు తీసుకుని, బాధితురాలి సోదరుడి దుస్తులు ధరించి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు.


కాగా.. ఐఐటీ పట్టభద్రురాలైన బాధితురాలు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతూ ఇంట్లోనే ఉంటున్నారు. ఆ రోజు ఉదయం జిమ్‌కు వెళ్లి తిరిగొచ్చిన తల్లిదండ్రులు.. తమ కూతురు అపస్మారక స్థితిలో పడిఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ‌వైద్యులు నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో లభించిన ఆధారాల సాయంతో రాహుల్‌ను నిందితుడిగా తేల్చారు. అలాగే బాధితురాలి నుంచి సేకరించిన నమూనాలతో నిందితుడి డీఎన్‌ఏ కూడా సరిపోలినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. కేసు విచారణలో సంఘటనల క్రమాన్ని నిరూపించేందుకు మొత్తం 82 మంది సాక్షులను జాబితాలో చేర్చారు ‌పోలీసులు.


నిందితుడికి ఆన్‌లైన్ గేమింగ్, జూదం వంటి అలవాట్లు ఉన్నాయని.. ఆ కారణంగా రూ.5 - 7 లక్షల వరకు అప్పులున్నట్టు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. తాను డబ్బులడిగేందుకే ఇంటికి వెళ్లానని, ఆ తర్వాత పరిస్థితులు అదుపుతప్పాయని నిందితుడు చెప్పినట్లు పోలీసులు వివరించారు. ఈ కేసులో సమర్పించిన శాస్త్రీయ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు, సీసీటీవీ దృశ్యాలు, సాక్షుల వాంగ్మూలాలు విచారణలో కీలకంగా మారనున్నాయి.


ఇవీ చదవండి:

సీఎంతో వరుస భేటీలు.. 'మహా'లో ముదురుతున్న రాజకీయం!

భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

Updated Date - Jul 17 , 2026 | 01:53 PM