Share News

సీఎంతో వరుస భేటీలు.. 'మహా'లో ముదురుతున్న రాజకీయం!

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:50 AM

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)లో ఉత్కంఠ నెలకొనడంతో మహారాష్ట్ర రాజకీయం మరింత ముదురుతోంది. సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో జరిగిన వరుస భేటీలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తెరతీస్తున్నాయి.

సీఎంతో వరుస భేటీలు.. 'మహా'లో ముదురుతున్న రాజకీయం!

ఇంటర్నెట్ డెస్క్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)లో ఉత్కంఠ నెలకొనడంతో మహారాష్ట్ర రాజకీయం మరింత ముదురుతోంది. అధికార కూటమికి చెందిన అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీలో, శరద్ పవార్(ఎస్పీ) నేతృత్వంలోని ఎన్‌సీపీ(ఎస్‌పీ)లో అంతర్గత పరిణామాలు వేగంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో జరిగిన వరుస భేటీలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తెరతీస్తున్నాయి.


ఎన్‌సీపీ సీనియర్ నేతలు ప్రజాఫుల్ పటేల్, సునీల్ తట్కరే ఇటీవల సీఎం ఫడణవీస్‌ను కలవడం కూడా చర్చనీయాంశమైంది. ఆ మరుసటి రోజే డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ కుమారుడు, ఎంపీ పార్థ్ పవార్ కూడా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ భేటీలపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందకపోయినా.. రాజకీయంగా మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక.. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రజాఫుల్ పటేల్, సునీల్ తట్కరేలు ప్రస్తుతం పార్టీ వ్యవహారాల్లో తమకు ప్రాధాన్యం తగ్గిందనే అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ మరణానంతరం.. ఆయన సతీమణి సునేత్ర పవార్ పార్టీ బాధ్యతలు చేపట్టగా, కుమారుడు పార్థ్ పవార్ కూడా పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా కల్పించుకుంటుండంతో కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


అయితే.. పార్టీని సరిదిద్దే చర్యలు తీసుకోవాలని ప్రజాఫుల్ పటేల్ ఇటీవల బహిరంగంగా అనడం ఈ వాఖ్యలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు పార్టీ జాతీయ కార్యదర్శి సచ్చిదానంద్ సింగ్.. సునేత్ర పవార్‌‌ను పార్టీ అధ్యక్షురాలిగా నియమించడాన్ని ప్రశ్నిస్తూ, ఆ ఎన్నిక చెల్లదని బహిరంగంగా వ్యాఖ్యానించడమూ పార్టీలో అసంతృప్తిని బయటపెట్టింది. మరోవైపు.. ఎస్పీ వర్గానికి చెందిన సీనియర్ నేత జయంత్ పాటిల్ కూడా ఇదే సమయంలో సీఎం ఫడణవీస్‌ను కలవడం రాజకీయ చర్చలకు మరింత ఊతమిచ్చింది. ప్రత్యర్థి వర్గాలకు చెందిన ముగ్గురు కీలక నేతలు ఏకకాలంలో ఇలా సీఎంను కలవడం వెనుక రాజకీయ ప్రాధాన్యం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


అయితే.. ఈ సమావేశాలు పూర్తిగా పాలనా అంశాలకే సంబంధించినవని సునీల్ తట్కరే స్పష్టం చేశారు. ఇందులో రాజకీయ కోణమేమీ లేదని, విలీనంపైనా ఎలాంటి చర్చ జరగలేదని ఆయన చెప్పారు. అజిత్ పవార్ జీవించి ఉన్న సమయంలోనే రెండు ఎన్‌సీపీ వర్గాల విలీనంపై చర్చలు జరిగాయని, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలేమీ లేవని పేర్కొన్నారు. మరోవైపు, ప్రజాఫుల్ పటేల్, సునీల్ తట్కరేలు శరద్ పవార్ వర్గానికి చెందిన కొందరు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే శరద్ పవార్ వర్గం ఈ వార్తలను ఖండించింది. తమ పార్టీ ఇప్పటికీ ఇండియా కూటమితోనే కొనసాగుతోందని ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే స్పష్టం చేశారు.

అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడకపోయినా, వరుస భేటీలు, పార్టీల్లో పెరుగుతున్న అసంతృప్తి, విలీనం లేదా రాజకీయ పునర్‌వ్యవస్థీకరణపై వినిపిస్తున్న ప్రచారం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎలాంటి మలుపు తిప్పుతాయనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


ఇవీ చదవండి:

ఆ పాత్రకు స్ఫూర్తి వాంగ్‌చుక్ కాదు.. పుకార్లకు చెక్ పెట్టిన ఆమిర్ ఖాన్

ఇరాక్ సంచలన ప్రకటన.. ట్రంప్ హత్యకు 10 మిలియన్ డాలర్ల రివార్డ్!

Updated Date - Jul 17 , 2026 | 12:29 PM