భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:14 PM
భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి చేరింది. దేశంలో హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి చేరింది. దేశంలో హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హరియాణాలోని జింద్-సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది. ఉత్తర రైల్వేలో ప్రయోగాత్మక ప్రాజెక్టుగా దీనిని ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతను రైల్వేలో వినియోగిస్తున్నారు. హైడ్రోజన్ ద్వారా విద్యుదుత్పత్తి చేసి రైలును నడిపే ఈ సాంకేతికతను డీజిల్ ట్రైన్స్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్‌లో హైడ్రోజన్ నిల్వ, ఇంధనం నింపే ప్రత్యేక సదుపాయాలనూ ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'హైడ్రోజన్ రైలు సేవలను ప్రారంభించిన దేశాల జాబితాలో భారత్ చేరడం గర్వకారణం. స్వచ్ఛమైన, సుస్థిర సాంకేతికతను రైల్వే రంగంలో విస్తరించేందుకు ఇది కీలక అడుగుగా నిలుస్తుంది' అని పేర్కొన్నారు.
హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు:
10 బోగీలతో కూడిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు
1,200 కిలోవాట్ల సామర్థ్యమున్న హైడ్రోజన్ ప్రొపల్షన్ వ్యవస్థ
గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడిచే సామర్థ్యం
ఒకేసారి సుమారు 2,600 మంది వరకు ప్రయాణించే వెసులుబాటు
జింద్ జంక్షన్, గోహానా, సోనిపట్ సహా పలు స్టేషన్లలో స్టాప్స్
హైడ్రోజన్ రైలు సేవలను ప్రారంభించిన దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. రానున్న కాలంలో మరిన్ని మార్గాల్లో ఈ సేవల్ని విస్తరించే అవకాశాలున్నాయి. ఇది రైల్వే రంగంలో కాలుష్య నియంత్రణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, స్వచ్ఛ ఇంధన వినియోగానికి కొత్త దిశను చూపనుంది. జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలు హైడ్రోజన్ ఆధారిత రైలు సాంకేతికతను ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నాయి.

కాగా.. ప్రపంచంలోనే తొలి హైడ్రోజన్ ప్యాసింజర్ రైలును జర్మనీ ప్రవేశపెట్టింది. 2002లో అల్‌స్టోమ్ కొరాడియా ఐలింట్(Alstom Coradia iLint) రైలు ఎలాంటి ఇంధనం లేకుండా 1,175 కి.మీ. ప్రయాణించి రికార్డు సృష్టించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో 2024లో తొలి హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. అయితే.. 2027 నాటికి జపాన్.. తొలి హైడ్రోజన్ హైబ్రిడ్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇవీ చదవండి:
సీఎంతో వరుస భేటీలు.. 'మహా'లో ముదురుతున్న రాజకీయం!
ఇరాక్ సంచలన ప్రకటన.. ట్రంప్ హత్యకు 10 మిలియన్ డాలర్ల రివార్డ్!