మెస్సి, రొనాల్డోలపై ప్రశంసలు.. ఇంగ్లండ్‌పై విమర్శలు చేసిన ట్రంప్
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:58 PM
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి, పోర్చుగల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. వారిలో ఏదో ప్రత్యేకమైన ప్రతిభ సహజంగానే ఉంటుందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి, పోర్చుగల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. వారిలో ఏదో ప్రత్యేకమైన ప్రతిభ సహజంగానే ఉంటుందని అన్నారు. అదే సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోయారని ఇంగ్లండ్ కోచ్ థామస్ టచెల్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఆదివారం జరగనున్న అర్జెంటీనా–స్పెయిన్ వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో నిర్వహించిన ఫిఫా కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో పాటు పలువురు ఫుట్‌బాల్ ప్రముఖులు పాల్గొన్నారు.
ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1తో విజయం సాధించడంలో మెస్సి కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ చివరి నిమిషాల్లో మెస్సి అందించిన అద్భుతమైన పాస్‌తో లౌటారో మార్టినెజ్ గోల్ చేసి అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చాడు. ఆ క్షణాన్ని గుర్తుచేసుకున్న ట్రంప్.. మెస్సి ప్రత్యర్థుల కళ్లుగప్పి సరైన స్థానానికి చేరుకోవడం, కచ్చితమైన పాస్ ఇవ్వడం తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ‘మెస్సిని గమనించాను. అతడిపై గట్టి నిఘా ఉంది. కానీ ఒక్కసారిగా అతను కుడి వైపునకు వెళ్లిపోయాడు. ఎవరూ దానిపై మాట్లాడలేదు.. నేను మాత్రం గమనించాను. మెస్సి ఇచ్చిన ఆ పాస్ అద్భుతమైనది. ఒక్క అంగుళంలో పావు వంతు తేడా కూడా లేకుండా కచ్చితంగా వెళ్లింది. అదే మ్యాచ్ ఫలితాన్ని మార్చింది. మెస్సి, క్రిస్టియానో రొనాల్డో వంటి ఆటగాళ్లు కీలక సమయాల్లో అద్భుతాలు చేయగలరు. ఇలాంటి గొప్ప ఆటగాళ్లు పదే పదే అలాంటి క్షణాలను సృష్టిస్తారు. వాళ్లు ఏదో అదనపు ప్రతిభతో పుడతారు. రొనాల్డో కూడా అలాంటి ఆటగాడే. అతడు కూడా గొప్ప వ్యక్తి’ అని ట్రంప్ ప్రశంసించారు.
ఇంగ్లండ్ వ్యూహాలపై ట్రంప్ అసంతృప్తి
సెమీఫైనల్లో అర్జెంటీనాపై ఇంగ్లండ్ ఆధిక్యంలోకి వచ్చిన తర్వాత జట్టు వ్యూహంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్టార్ స్ట్రైకర్ హ్యారీ కేన్‌ను డిఫెన్స్ బాధ్యతల్లోకి పంపడాన్ని తప్పుబట్టారు. ‘ఇంగ్లండ్ వద్ద హ్యారీ కేన్ లాంటి గొప్ప ఆటగాడు ఉన్నాడు. అతను అద్భుతంగా ఆడి జట్టును విజయపథంలోకి తీసుకెళ్లగలడు. కానీ ఆధిక్యంలోకి వచ్చిన తర్వాత అతడినే డిఫెన్స్‌లో ఆడించడం తప్పిదం కావచ్చు. ఇంగ్లండ్ జట్టు మరింత దూకుడుగా ఆడాల్సింది. కోచ్ ఎలాంటి వ్యూహాలు చేశాడో అర్థం కాలేదు. తమ అత్యుత్తమ ఆటగాడిని డిఫెన్స్‌లోకి పంపడం పూర్తిగా అర్థం లేని విషయం అని నాకనిపించింది. సెమీ ఫైనల్ లాంటి కీలక పోరులో కొంత అటాక్ చేసే ఆలోచన కూడా ఉండాలి. నేనేమీ ఫుట్‌బాల్ కోచ్‌ను కాదు.. కానీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
టచెల్ వివరణ
సెమీ ఫైనల్ పోరులో హ్యారీ కేన్‌ను డిఫెన్స్ వైపు పంపడంపై ఇంగ్లండ్ కోచ్ థామస్ టచెల్ వివరణ ఇచ్చారు. మొత్తం జట్టు రక్షణాత్మకంగా ఆడాల్సిన పరిస్థితి రావడంతోనే కేన్‌ను కూడా అటువైపు పంపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే చివరి 30 నిమిషాల్లో తమ జట్టు ఎక్కువగా డిఫెన్స్‌కే పరిమితమైందని, బంతిపై పట్టు కోల్పోయామని అంగీకరించారు. ఇక ఇంగ్లండ్ మూడో స్థానం కోసం ఫ్రాన్స్‌తో తలపడనుండగా.. వరల్డ్ కప్ ట్రోఫీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో మెస్సి నేతృత్వంలోని అర్జెంటీనా ఫైనల్లో స్పెయిన్‌ను ఎదుర్కోనుంది.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ఫైనల్.. యమాల్‌తో పోటీపడతానని అనుకోలేదు: మెస్సి
జపాన్ ఓపెన్ టోర్నీ: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు