Share News

ఫిఫా.. థర్డ్ ప్లేస్ మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ఎవరికీ లేదు: ఫ్రాన్స్ కోచ్

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:15 PM

ఫిఫా ప్రపంచ కప్ 2026లో మూడో స్థానం కోసం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ఫ్రాన్స్ ప్రధాన కోచ్ డిడియర్ డెశాంప్స్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ మ్యాచ్ ఆడాలన్న ఆసక్తి ఇరు జట్లకు లేదని ఆయన స్పష్టం చేశారు.

ఫిఫా.. థర్డ్ ప్లేస్ మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ఎవరికీ లేదు: ఫ్రాన్స్ కోచ్
Didier Deschamps

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో మూడో స్థానం కోసం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ఫ్రాన్స్ ప్రధాన కోచ్ డిడియర్ డెశాంప్స్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ మ్యాచ్ ఆడాలన్న ఆసక్తి ఇరు జట్లకు లేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నందుకు కాంస్య పతకాన్ని సాధించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. స్పెయిన్ చేతిలో సెమీఫైనల్లో 2-0 తేడాతో ఓటమి పాలవడంతో వరుసగా మూడోసారి వరల్డ్‌ కప్ ఫైనల్ చేరాలన్న ఫ్రాన్స్ ఆశలు నీరుగారిపోయాయి. దీంతో శనివారం మయామిలో ఇంగ్లండ్‌తో మూడో స్థానం కోసం ఫ్రాన్స్ తలపడనుంది.


మ్యాచ్‌కు ముందు డెశాంప్స్ మీడియాతో మాట్లాడారు . ‘ఇది స్నేహపూర్వక మ్యాచ్ కాదు. మూడో స్థానం కోసం జరిగే అధికారిక పోరు. ఈ మ్యాచ్ ఆడాలని ఇంగ్లండ్ కోరుకోవడం లేదు.. మేమూ కోరుకోవడం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాధ్యతను నిర్వర్తించాల్సిందే. ఫైనల్‌తో పోలిస్తే దీని ప్రాధాన్యం తక్కువే. అయినప్పటికీ కాంస్య పతకం సాధించడమే ఇప్పుడు మా లక్ష్యం’ అని అన్నారు. ఫ్రాన్స్ జట్టుకు ఇదే తన చివరి మ్యాచ్ అని డెశాంప్స్ వెల్లడించారు. ఈ మ్యాచ్ తర్వాత కోచ్‌ బాధ్యతలకు వీడ్కోలు పలకనున్నట్లు తెలిపారు. ‘ఫ్రాన్స్ జెర్సీ ధరించిన ప్రతిసారీ గెలవాలనే బాధ్యత ఉంటుంది. మూడో స్థానాన్ని దక్కించుకోవడమే ఇప్పుడు మా లక్ష్యం. ఇది నా చివరి మ్యాచ్ అని నాకు తెలుసు. కానీ ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఆటతో ఒక అధ్యాయం ముగుస్తుంది.. జీవితం మాత్రం కొనసాగుతుంది’ అని డెశాంప్స్ వ్యాఖ్యానించారు.


విజయవంతమైన వీడ్కోలు ఇస్తాం: ఫ్రాన్స్ ప్లేయర్

ఫ్రాన్స్ డిఫెండర్ ఇబ్రహిమా కొనాటే కూడా డెశాంప్స్ వ్యాఖ్యలతో ఏకీభవించాడు. సెమీఫైనల్ ఓటమి తర్వాత మూడో స్థానం మ్యాచ్ ఆడాలని ఎవరూ కోరుకోలేదని, అయినప్పటికీ తమ కోచ్‌కు విజయంతో వీడ్కోలు పలకాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. ‘మూడో స్థానం కోసం ఆడాలని మా జట్టులో ఎవరికీ లేదు. కానీ మాకు మరో మార్గం లేదు. మా కోచ్ ఫ్రాన్స్ జట్టుకు ఎంతో సేవ చేశాడు. ఆయనకు కృతజ్ఞతగా ఈ మ్యాచ్ గెలిచి కాంస్య పతకాన్ని అందించాలని కోరుకుంటున్నాం’ అని కొనాటే పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

ఫిఫా ఫైనల్.. యమాల్‌తో పోటీపడతానని అనుకోలేదు: మెస్సి

జపాన్ ఓపెన్ టోర్నీ: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

Updated Date - Jul 18 , 2026 | 01:12 PM