Share News

సమ్మర్‌ టూర్‌కు సిద్ధమవుతున్నారా?

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:46 AM

వేసవి సెలవుల్లో విహారయాత్రలకు ప్లాన్‌ చేస్తున్నారా? వెకేషన్‌ సాఫీగా సాగాలంటే... ఈరోజుల్లో కొన్ని పనికొచ్చే గ్యాడ్జెట్లను వెంట తీసుకెళ్లాల్సిందే.

సమ్మర్‌ టూర్‌కు సిద్ధమవుతున్నారా?
Summer Tour

వేసవి సెలవుల్లో విహారయాత్రలకు ప్లాన్‌ చేస్తున్నారా? వెకేషన్‌ సాఫీగా సాగాలంటే... ఈరోజుల్లో కొన్ని పనికొచ్చే గ్యాడ్జెట్లను వెంట తీసుకెళ్లాల్సిందే. ఎంజాయ్‌ చేయడానికి వెళుతూ... ఈ గ్యాడ్జెట్ల గోల దేనికీ అంటారా? వీటితో మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. జర్నీలో హాయిగా నిద్రపోయేలా, లగేజీ ఎక్కడా మిస్‌ కాకుండా... ప్రయాణానికి పనికొచ్చే ఇలాంటి కొన్ని ‘బెస్ట్‌ ట్రావెల్‌ గ్యాడ్జెట్లు’ ఇవి...

కునుకు తీయాలంటే...

book6.3.jpgప్రయాణాల్లో నిద్రను ఆపుకోవడం జరగని పని. రైల్వేస్టేషన్‌లోనో, విమానాశ్రయంలోనో సమయం చిక్కితే... ఎంతటివారైనా సరే కాసేపు కునుకు తీస్తారు. జర్నీలో కొంతమంది ఇతరులను డిస్టర్బ్‌ చేయకుండా హాయిగా నిద్రపోతే, మరికొందరు మాత్రం పక్కవారిపై పడిపోతుంటారు. ఎన్నిసార్లు తట్టి లేపినా, తల ఒక పక్కకు వాలుస్తారు. దీనివల్ల పక్కనున్నవారు డిస్టర్బ్‌ అవుతుంటారు. విమానం, రైలు, బస్సు.... ప్రయాణం ఎందులోనైనా కామన్‌గా కనిపించే సీన్‌ ఇది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా? అంటే... ‘టర్టిల్‌ పిల్లో’ అంటున్నారు ట్రావెల్‌ నిపుణులు. ఇది సాధారణ తలదిండులాంటిది కాదు. నిద్రలో తల ఒకవైపు పడిపోకుండా రక్షించే గ్యాడ్జెట్‌. దీన్ని ‘ట్రావెల్‌ పిల్లో గైడ్‌’ అని కూడా అంటారు. మెడకు బ్రేస్‌లా ఉంటుంది. మెడ చుట్టూ కంఫర్ట్‌బుల్‌గా పెట్టుకోవచ్చు. చాలామంది ‘యూ’ షేప్‌ పిల్లో వాడుతుంటారు. కానీ దానితో పోల్చితే... ‘టర్టిల్‌ పిల్లో’తో నిద్ర సుఖంగా ఉంటుంది. వేసవి టూర్‌లో వెంట ఉంచుకోదగిన గ్యాడ్జెట్‌ ఇది.


స్టోరేజ్‌ ఆర్గనైజర్‌

book6.2.jpgఛార్జింగ్‌ కేబుల్‌ ఎక్కడో బ్యాగ్‌లో పెట్టేస్తారు. ఫోన్‌ ఛార్జింగ్‌ పెడదామని చూస్తే సమయానికి దొరకదు. ఇయర్‌ఫోన్స్‌ కూడా అంతే. బ్యాగులో వస్తువులన్నీ తీస్తే కానీ దొరకవు. అందరికీ ఇది ఏదో ఒక సమయంలో ఎదురయ్యే సమస్యనే. ‘పోర్టబుల్‌ స్టోరేజ్‌ ఆర్గనైజర్‌’ ఉంటే ఈ ఇబ్బంది ఉండదు. ఫోన్‌ ఛార్జింగ్‌ కేబుల్స్‌, ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకునేందుకు ఇది సరైన గ్యాడ్జెట్‌. ఒక్కో అరలో ఒక్కో కేబుల్‌ పెట్టుకోవచ్చు. పౌచ్‌కు జిప్‌ ఉంటుంది. ఎలాస్టిక్‌ లూప్స్‌ ఉంటాయి. వెదర్‌ప్రూఫ్‌ ఫ్యాబ్రిక్‌తో తయారుచేసింది కాబట్టి మన్నికగా ఉంటుంది. ఎయిర్‌పాడ్స్‌, పోర్టబుల్‌ ఎస్‌ఎస్‌డీలు పెట్టుకోవచ్చు.


‘స్మార్ట్‌’ సూట్‌కేస్‌

book6.4.jpgవిమానాశ్రయంలో తాపీగా నడుచుకుంటూ వెళుతుంటే... సూట్‌కేస్‌ మీ వెనకాలే మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చేస్తుంటే ఎలా ఉంటుంది? అందరి కళ్లు మీపైనే ఉంటాయి. ఇది సాధ్యమేనా? అంటే మీరు వాడేది ‘స్మార్ట్‌ ట్రావెల్‌ సూట్‌కేస్‌’ అయితే సాధ్యమే. ‘ఆటో ఫాలో’ ఆప్షన్‌ ఉన్న ఈ స్మార్ట్‌ సూట్‌కేస్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రతీ ట్రావెలర్‌ దగ్గర కనిపించొచ్చు. ఈ స్మార్ట్‌ ట్రావెల్‌ సూట్‌కేస్‌లో అనేక ప్రత్యేకతలున్నాయి. సాధారణ బ్యాగులను లగేజ్‌ స్కేల్‌ పెట్టి బరువు తూచినట్టుగా దీన్ని తూచనవసరం లేదు. లగేజ్‌ను ట్రాక్‌ చేయడం కోసం వాటిలో ప్రత్యేకంగా ట్రాకర్‌ పెట్టాల్సిన పనిలేదు. స్మార్ట్‌ ట్రావెల్‌ సూట్‌కేస్‌లో లగేజ్‌ ఎంత బరువుందో దానికి ఉండే స్ర్కీన్‌లో చూపిస్తుంది. ఇన్‌బిల్ట్‌గా ట్రాకర్‌ ఉండటంతో లగేజ్‌ ఎక్కడుందో సులువుగా ట్రాక్‌ చేయొచ్చు. అంతేకాదు, లాక్‌ చేశామా? లేదా? అన్న భయం కూడా లేదు. మొబైల్‌ ఫోన్‌లో యాప్‌ సహాయంతో స్మార్ట్‌ ట్రావెల్‌ బ్యాగ్‌ను లాక్‌ చేయొచ్చు. మరో ప్రత్యేకత ఏమిటంటే సూట్‌కేస్‌ పైభాగంలో ఉన్న యూఎస్‌బీ పోర్టుతో ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు.


బీచ్‌కు వెళుతుంటే...

book6.5.jpgవేసవి సెలవుల్లో చాలామంది బీచ్‌లను చుట్టివచ్చేలా ప్లాన్‌ చేసుకుంటారు. ఫ్యామిలీతో బీచ్‌లకు వెళ్తున్నట్లయితే కనుక ‘యునీక్‌ ట్రావెల్‌ గ్యాడ్జెట్‌’గా పిలిచే ‘శాండ్‌ ప్రూఫ్‌ బీచ్‌ మ్యాట్‌’ను వెంట తీసుకెళ్లాల్సిందే. ఈ మ్యాట్‌తో బీచ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్‌ చేయడానికి బాగుంటుంది. ఇసుకలో సాధారణ మ్యాట్‌, దుప్పట్లు పరిస్తే ఇసుక అంటుకోవడం, దులపడం ఇబ్బంది. శాండ్‌ ప్రూఫ్‌ మ్యాట్‌ ఉంటే... ఇసుక గోల ఉండదు. కంఫర్ట్‌గా బీచ్‌లో ఎంజాయ్‌ చేసే అవకాశం లభిస్తుంది. నైలాన్‌, పాలిస్టర్‌, మైక్రోఫైబర్‌తో ఈ మ్యాట్స్‌ తయారుచేస్తారు. ఇది తేలికగా ఉంటుంది. నీటిలో తడిసినా క్షణాల్లో ఆరుతుంది. బీచ్‌ ట్రిప్‌, పిక్నిక్‌, క్యాంపింగ్‌ వంటి ఔట్‌డోర్‌ యాక్టివిటీస్‌కు బాగా నప్పే మ్యాట్‌ ఇది.


స్లీప్‌ మాస్క్‌

book6.6.jpgదూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు వెలుతురు వల్ల నిద్రకు ఆటంకం కలుగుతూ ఉంటుంది. కొందరు అలసట వల్ల గాఢనిద్రపోయినా, కొందరు మాత్రం లైట్ల వెలుతురు వల్ల, శబ్దాల వల్ల నిద్రపోలేరు. అటువంటి వారు ‘స్లీప్‌ మాస్క్‌’ పెట్టుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. స్లీప్‌మాస్క్‌తో పాటు ఇయర్‌ ప్లగ్స్‌ పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా నిద్రలోకి జారుకోవచ్చు. మెమొరీ ఫోమ్‌తో తయారైన ‘అలస్కా బేర్‌ స్లీప్‌ మాస్క్‌’ బాగా నప్పుతుంది. దీంతో పాటు ఇయర్‌ ప్లగ్స్‌ కూడా లభిస్తాయి. ఇలాంటి ట్రావెల్‌ గ్యాడ్జెట్‌లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయనడంలో సందేహం లేదు.


ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం...

book6.jpgవిహారంలో సరదాగా గడిపిన క్షణాలను ఫొటోల రూపంలో భద్రపరచుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఫొటోగ్రఫీ ప్రేమికులుప్రకృతి అందాలను తమ కెమెరాలో బంధిస్తారు. అలా కెమెరాల్లో బంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో పంచుకోవడం మామూలే. ఫొటోలు, వీడియోలు బాగా రావాలని కోరుకునేవారు వెంట ఉంచుకోదగిన ట్రావెల్‌ గ్యాడ్జెట్‌ ‘పోర్టబుల్‌ ట్రైపాడ్‌’. వెకేషన్‌లో ప్రతీ క్షణాన్ని సులభంగా రికార్డు చేసుకోవడానికి ఈ గ్యాడ్జెట్‌ ఉపయోగపడుతుంది. దీన్ని మడతపెట్టొచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. విశేషమేమిటంటే దీన్ని ఎక్కడైనా సింపుల్‌గా అమర్చు కోవచ్చు. చివరకు చెట్లకు చుట్టూ చుట్టి కూడా. మీ దగ్గర డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా ఉంటే ఈ గ్యాడ్జెట్‌ బాగా పనికొస్తుంది.


ట్రాక్‌ చేయండిలా...

book6.7.jpgతాళంచెవి ఎక్కడో మరిచిపోవడం, మళ్లీ దాన్ని వెతుక్కుంటూ... చుట్టి వచ్చిన ప్రదేశాలకు వెళ్లడం... విలువైన సమయాన్ని వృథా చేయడమే. దానికితోడు మెంటల్‌ టెన్షన్‌. జర్నీలో, హోటళ్లలో బస చేసినప్పుడు, డిన్నర్‌ కోసం రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు... తాళం చెవి మరిచిపోవడం సాధారణంగా జరిగేదే. కొన్నిసార్లు ఐప్యాడ్‌, మొబైల్‌ఫోన్‌ వంటి విలువైన వస్తువులను కూడా మర్చిపోతుంటారు. నిజానికి ట్రాకర్లను ఉపయోగిస్తే విలువైన గ్యాడ్జెట్లను మరిచిపోయే ప్రమాదం ఉండదు. అలాంటి ట్రాకరే ‘ట్రాకిమో జీపీఎస్‌’. ఈ గ్యాడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌తో అనుసంధాన మవుతుంది. జీపీఎస్‌ సాయంతో వస్తువులు ఎక్కడ మరిచిపోయినా గుర్తించే అవకాశం ఉంటుంది. ఇందులో ఎస్‌ఓఎస్‌ ఫీచర్‌ ఉంది. అవసరమైనప్పుడు సహాయం కోసం పిల్లలను లేక స్నేహితులను సంప్రదించడానికి ఇది ఉపకరిస్తుంది. ఇతర గ్యాడ్జెట్లయితే సిమ్‌కార్డు అవసరం ఉంటుంది. కానీ దీనికి ఆ అవసరం లేదు. ట్రాకిమో గ్యాడ్జెట్‌లో ఇంటర్నల్‌గా సిస్టమ్‌ ఉంటుంది. విలువైన వస్తువులు చేజారిపోకుండా ఉండాలంటే ఇలాంటి ట్రాకర్‌ ఉండాల్సిందే మరి.


క్రిమికీటకాలు కుట్టకుండా...

book6.8.jpgకొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు రాత్రుళ్లు దోమలు బెడద వేధిస్తుంది. అటవీ ప్రాంతాల్లోకి క్యాంపింగ్‌కు వెళ్లినట్టయితే ఇతర కీటకాల బాధ కూడా ఉంటుంది. అయితే ‘ఇన్‌సెక్ట్‌ రీపెల్లెంట్‌’ దుస్తులను ధరిస్తే చాలా వరకు వాటి బాధ నుంచి తప్పించుకోవచ్చు. గ్యాడ్జెట్‌ కాకపోయినా... ట్రావెల్‌ గ్యాడ్జెట్స్‌తో పాటు తప్పక ఉండాల్సిన దుస్తులివి. తేలికగా ఉండి ఔట్‌డోర్స్‌లో ధరించేందుకు అనువుగా ఉంటాయి. ఈపీఏ సర్టిఫైడ్‌, యూవీ ప్రొటెక్షన్‌ ప్రాపర్టీస్‌ ఉంటాయి. ఇన్‌సెక్ట్‌ రీపెల్లెంట్‌లో టీషర్టు, ట్రౌజర్‌, సాక్స్‌... ఇలా రకరకాల దుస్తులు లభిస్తాయి. వీటి తయారీలో ‘ఇన్‌సెక్ట్‌ షీల్డ్‌ టెక్నాలజీ’ని ఉపయోగిస్తారు. హంటింగ్‌, ఫిషింగ్‌, హైకింగ్‌, గార్డెనింగ్‌ వంటి ఔట్‌డోర్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనేవారు తప్పక ధరించాల్సిన దుస్తులివి. చామంతి పూల నుంచి తీసే పైరిత్రమ్‌ను ఇన్‌సెక్ట్‌ కంట్రోల్‌గా వాడుతున్నారు. దీన్ని దుస్తుల తయారీలో వాడినప్పుడు మస్కిటో రీపెల్లెంట్‌గా, ఇన్‌సెక్ట్‌ రీపెల్లెంట్‌గా పనిచేస్తుంది.


ఛార్జింగ్‌ సమస్య లేకుండా...

book6.9.jpgప్రయాణాల్లో ఎక్కువగా ఉపయోగించేది మొబైల్‌నే. సోషల్‌ మీడియా, సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు... వీటికి తోడు కాల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు... కనువిందు చేసే ప్రకృతి అందాలు కనిపిస్తే చాలు వీడియో తీయడం... వెరసి ప్రతీ నిమిషానికి ఫోన్‌ బ్యాటరీ తగ్గిపోతూనే ఉంటుంది. వీటికి తోడు సెల్ఫీలు ఎలాగూ ఉంటాయి. అందుకే ప్రయాణంలో పవర్‌ బ్యాంక్‌ తప్పనిసరిగా ఉండాలంటారు. పవర్‌బ్యాంకుల్లో ‘ఎనర్జీ క్యూసీ’ ఫాస్ట్‌ చార్జింగ్‌ను అందిస్తుంది. సులువుగా ప్యాకెట్‌లో పెట్టుకుని వెళ్లిపోవచ్చు. అందుకే దీన్ని ప్యాకెట్‌ఫ్రెండ్లీ ఛార్జర్‌ అంటారు. 5000 ఎంఏహెచ్‌తో వస్తుంది. చిన్నగా, సింపుల్‌ డివైజ్‌... కానీ పనిమాత్రం సూపర్బ్‌గా ఉంటుంది. పర్సులో లేదంటే జేబులో పెట్టుకుని తీసుకెళ్లగలిగే పవర్‌ ఫుల్‌ పవర్‌ బ్యాంక్‌ ఇది.


లగేజ్‌ లిమిట్‌ దాటకుండా...

విమాన ప్రయాణాల్లో లగేజ్‌కు లిమిట్‌ ఉంటుందన్న విషయం తెలిసిందే. వెకేషన్‌కు వెళ్లినప్పుడు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. దేవాలయాల సందర్శన చేసినట్టయితే లడ్డూ ప్రసాదాలు తీసుకోవడం అందరూ చేసేదే. వీటివల్ల లగేజ్‌ బరువు అంచనాకు మించిపోతుంది. విమాన ప్రయాణాల్లో లగేజ్‌ బరువు పెరిగితే అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. చివరి నిమిషంలో ఈ గందరగోళానికి గురికాకుండా ఉండాలంటే ‘డిజిటల్‌ లగేజ్‌ స్కేల్‌’ గ్యాడ్జెట్‌ను దగ్గర ఉంచుకోవాలి. ఈ గ్యాడ్జెట్‌ సహాయంతో సెకన్లలో కచ్చితమైన బరువును తెలుసుకోవచ్చు. తేలికగా, ప్యాకెట్‌ సైజులో లభించే ఈ గ్యాడ్జెట్‌ అనవసర ఖర్చును తగ్గిస్తుంది. సూట్‌కేస్‌ హ్యాండిల్‌కు తగిలించి బరువు చెక్‌ చేయొచ్చు.


స్టీమ్‌ ఐరన్‌

book6.10.jpgటూర్‌కు వెళుతున్నామంటే రెండు జతల బట్టలు ఎక్కువే సర్దుకుంటాం. నీట్‌గా ఇస్ర్తీ చేసిన బట్టలను పెట్టుకుంటాం. కానీ తీరా వేసుకునే సమయంలో చూస్తే... దుస్తులన్నీ ముడతలు పడి ఉంటాయి. డ్రెస్‌ ఇస్త్రీ చేయనట్టుగానే ఉంటుంది. ఇది వెకేషన్‌కు వెళ్లిన ప్రతీ ఒక్కరికి ఎదురయ్యే సమస్యే. మరికొందరు లగేజ్‌ ఎక్కువవుతోంది అని దుస్తులు తక్కువగా తీసుకెళతారు. విడిది చేసిన చోట డ్రెస్‌ ఉతుక్కుంటారు. కానీ వాటికి ఇస్త్రీ పెద్ద సమస్యే. తెలియని ఊర్లో ఇస్త్రీ షాపు వెతుక్కుంటూ వెళ్లలేరు. అందుకే ‘మినీ స్టీమ్‌ ఐరన్‌ బాక్స్‌’ను వెంట తీసుకెళితే రెండు నిమిషాల్లో డ్రెస్‌ను ఇస్త్రీ చేసుకుని నీట్‌గా మార్చుకోవచ్చు. ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఎక్కడైనా పెట్టుకుని వెళ్లిపోవచ్చు.

  • 3 ఇన్‌ 1 ఛార్జింగ్‌ స్టేషన్‌ ఉంటే సింగిల్‌ ఔట్‌లెట్‌లో ఒకేసారి ఫోన్‌, వాచ్‌, ఇయర్‌బడ్స్‌ ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు.

  • నాలుగైదు కేబుల్స్‌ తీసుకెళ్లే బదులు నాణ్యమైన 3 ఇన్‌ 1 కేబుల్‌ ఒక్కటి తీసుకెళితే సరిపోతుంది.

  • అవసరమైన వాటికే లగేజ్‌లో చోటివ్వాలి. అనవసరమైన గ్యాడ్జెట్‌లను ఇంట్లోనే వదిలేయాలి.


విండో సోలార్‌ ఛార్జర్‌

జర్నీలో ఉన్నప్పుడు ఫోన్‌ బ్యాటరీ డెడ్‌ అయితే మూడాఫ్‌ అయిపోతుంది. పవర్‌బ్యాంక్‌ ఉంటే పర్వాలేదు. లేకపోతే హోటల్‌ గదికి చేరుకునేదాకా వేచి చూడాల్సి వస్తుంది. అలాంటి సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే ‘సోలార్‌ ఛార్జర్‌’ను వెంట ఉంచుకోవాలి. గ్యాడ్జెట్ల ఛార్జింగ్‌ సమస్యలకు సోలార్‌ ఛార్జర్‌ పరిష్కారం చూపిస్తుంది. విమానంలో ఉన్నా, రైలు లేదా బస్సులో ప్రయాణం చేస్తున్నా, కారులో వెళుతున్నా సోలార్‌ ఛార్జర్‌తో ఫోన్‌ ఛార్జ్‌ చేసుకోవచ్చు. సూర్యరశ్మి నుంచి శక్తిని గ్రహించి మీ డివైజ్‌ను ఛార్జ్‌ చేస్తుంది. ప్రయాణం చేస్తున్న వాహనం అద్దానికి దీన్ని అతికిస్తే చాలు. ఈ ‘పవర్‌’ఫుల్‌ గ్యాడ్జెట్‌ ప్రతీ ఒక్కరి లగేజ్‌లో ఉండి తీరాల్సిందే.


సోప్‌ డ్రై బ్యాగ్‌

సమ్మర్‌ టూర్‌ అంటే కనీసం వారం రోజుల పాటు గడిపి వచ్చేలా ప్లాన్‌ చేసుకుంటారు. నాలుగైదు ప్రదేశాలను కవర్‌ చేస్తారు. ఈ వారంరోజుల పాటు సబ్బులు, షాంపూలు, కండిషనర్లు, బ్రష్‌లు... ఇలా అవసరమైనవన్నీ తెచ్చుకుంటారు. కానీ హోటల్‌ ఖాళీ చేసే సమయంలో సబ్బులు, షాంపూలను పేపర్లలో చుట్టి పెట్టుకోవడం, కవర్లలో పెట్టి బ్యాగు సైడులో పెట్టడం చేస్తుంటారు. ఇది కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంది. అలాంటప్పుడు ‘సోప్‌ డ్రై బ్యాగ్‌’ ఉంటే ఏ ఇబ్బందీ ఉండదు. ఈ బ్యాగులో తడిగా ఉన్న సబ్బులు, షాంపూలు, బ్రష్‌లు... ఇలా అన్నీ సౌందర్య సాధనాలను పెట్టుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అది త్యాగం కాదు.. ఎంపిక

Read Latest Telangana News and National News

Updated Date - Apr 26 , 2026 | 11:50 AM