ఆహా... అనంత ఆపిల్
ABN , Publish Date - Apr 26 , 2026 | 10:35 AM
‘ఆపిల్’ అంటే హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కశ్మీర్ వంటి చల్లని కొండ ప్రాంతాల్లో పండే పంట అనుకుంటారెవరైనా.
‘ఆపిల్’ అంటే హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కశ్మీర్ వంటి చల్లని కొండ ప్రాంతాల్లో పండే పంట అనుకుంటారెవరైనా. ఈ అభిప్రాయాన్ని బ్రేక్ చేశాడో రైతు. కరువు నేల అనంతపురంలో ఆపిల్ చెట్టు పెరుగుతుందని ఎవరైనా చెబితే అస్సలు నమ్మం. కానీ ఆ కలను నిజం చేశాడు ఒక సాధారణ రైతు. ఇజ్రాయెల్ దేశం నుంచి ఆపిల్ మొక్కలు తెచ్చి... అనంతపురం ఎండల మధ్య పెంచి చూపించాడు. ఆయన కష్టానికి, ఆలోచనకు, ధైర్యానికి కలిసొచ్చిన విజయగాథ ఇది...
దేశంలోనే అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో అనంతపురం జిల్లా ఒకటి. ఇది కరవు ప్రాంతం కూడా. అలాంటి ప్రాంతంలో గార్లదిన్నె మండలం, మార్తాడ గ్రామానికి చెందిన కె.వి. రమణారెడ్డి ఆపిల్ సాగుతో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. రమణారెడ్డి గతంలో పట్టుచీరల నేత కార్మికుడు. హైదరాబాద్ మార్కెట్‌లో చీరలు అమ్ముతూ జీవనం సాగించేవారు. కరోనా సమయంలో ఆ వ్యాపారం కుదేలైంది.
సమస్యల నుంచి నేర్చుకున్న పాఠం
వ్యాపార నష్టాల నుంచి బయటపడాలని వ్యవసాయం వైపు మళ్లాడు రమణారెడ్డి. మొదట వేరుశనగ, వరి, దానిమ్మ, బత్తాయి పంటలు సాగు చేశారు. కానీ అధికంగా క్రిమిసంహారక మందులు వాడాల్సి రావడంతో పెట్టుబడులు పెరిగి, లాభాలు తగ్గిపోయాయి. ‘ఇలా కాదని... రసాయనాల అవసరం తక్కు వగా ఉండే పంటలు పండిద్దాం’ అనుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్, లిచ్చీ, కర్జూరం వంటి పంట లతో పాటు ఆపిల్‌పై కూడా దృష్టి పెట్టారు.
హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి ‘అన్నా వెరైటీ ఆపిల్’ మొక్కలు తెచ్చి సాగు ప్రారంభించాడు. కానీ అనంతపురం అధిక ఉష్ణోగ్రతలకు అవి తట్టుకోలేకపోయాయి. మూడేళ్ల కష్టానికి నిమ్మకాయ సైజ్ కాయలు మాత్రమే వచ్చాయి. దాదాపు రూ.6 లక్షల నష్టం వచ్చింది. ఇక్కడే చాలామంది ఆగిపోతారు. కానీ రమణారెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. యూట్యాబ్‌లో సెర్చ్ చేసి మరింత సమాచారం తెలుసుకున్నాడు
ఇజ్రాయెల్ టెక్నాలజీతో...
‘‘ప్రపంచంలో ఎడారిని పచ్చగా మార్చిన దేశం ఇజ్రాయెల్. ఇప్పుడు యాపిల్ పంటలో కూడా కొత్త దారిని చూపిస్తోంది. వేడి ప్రాంతాల్లో కూడా పండేలా రూపొందించిన కె.ఎల్.డి (K L D) వంటి లో చిల్లింగ్ (Low& chilling) ఆపిల్ రకాలు, నాకు ఒక కొత్త అవకాశంగా కనిపించాయి. ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న నా మిత్రుడి ద్వారా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే ఆపిల్ రకాల గురించి తెలుసుకొని అక్కడి నుంచి మొక్కలను తెప్పించి, నర్సరీలో పెంచి, తరువాత పొలంలో నాటాను. మొత్తం 1500 మొక్కలు. ట్రాన్స్‌పోర్ట్‌తో కలుపుకొని ఒక్కో మొక్క రూ. 650 పడింది. మొక్కలకే రూ.10 లక్షలు పెట్టుబడి అయ్యింది. రెండున్నర ఎకరాల్లో సాగు మొదలు పెట్టాను. ఎకరాకు 600 మొక్కలు నాటాను. డ్రిప్ ఇరిగేషన్‌తో సరైన కటింగ్, సంరక్షణతో చెట్లు పెంచాను’’ అని వివరించారు రమణారెడ్డి.
నాటిన ఏడాదిన్నరకే కాత మొదలైంది. మొదటి పంటలోనే ఒక్క చెట్టుకు 200 నుంచి 300 కాయలు వచ్చాయి. ఇప్పటిదాక మొత్తం రెండు టన్నుల దిగుబడి వచ్చింది. టన్నుకు రూ.1.7 లక్షల ధర వచ్చింది. బెంగళూరు వ్యాపారులు స్వయంగా వచ్చి కొనుగోలు చేశారు. స్థానికంగా కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.
సేంద్రియ సాగుతో అదనపు లాభం
ఈ సాగులో ముఖ్యమైన విషయం, రసాయనాలు అవసరం లేదు సేంద్రియ ఎరువులు సరిపోతాయి. చీడపీడల సమస్యలు తక్కువ. పండ్లు కోసిన తర్వాత 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఒక్క కాయ బరువు 150 నుంచి 200 గ్రాముల వరకు ఉంటుంది. రుచి, రంగు కూడా సిమ్లా ఆపిల్స్‌కు ఏమాత్రం తీసిపోవు. ‘‘చల్లని వాతావరణం అవసరం లేకుండా ఈ పంటను ఎక్కడైనా రైతులు ధైర్యంగా పండించ వచ్చు. అయితే మొక్కలు నాటే ముందు భూసార పరీక్షలు చేయించి స్ధానిక వ్యవసాయ అధికారుల సలహా కచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే లక్షల్లో పెట్టుబడి పెట్టే ముందు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకేసారి పెద్ద స్థాయిలో సాగు చేయకుండా ముందుగా అర ఎకరాలో ప్రయోగం చేయాలి. దిగుబడి బాగుంటే ఎక్కువ విస్తీర్ణంలో వేయాలి’’ అని రైతులకు సూచిస్తున్నారు రమణారెడ్డి.
ఇటీవల అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆపిల్ తోటను పరిశీలించి కొన్ని పండ్లు రుచి చూసి రైతును అభినందించారు. కొన్నేళ్ల క్రితం ఎపీ మన్యం లంబసింగిలో, తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో ఆపిల్ సాగు చేశారు కానీ, కాయలు సరిగా పండక అంతగా సక్సెస్ కాలేదు. అనంతపురంలో అత్యధికంగా నమోదయ్యే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని ఈ మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, సిమ్లా ఆపిల్స్ కన్నా ధీటుగా రంగు రుచి ఉన్న పండ్లు కాయడం విశేషం.
ఈ రైతు విజయాన్ని చూసి కర్నాటక, తెలంగాణ రైతులు కూడా ఈ ఆపిల్ సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఎండలతో పోరాడే అనంతపురం నేల... ఇప్పుడు ఇజ్రాయెల్ ఆపిల్ పండ్లతో ఎర్రగా మెరిసిపో తోంది. కరవు నేలలో కూడా కలలు పండుతాయి... ధైర్యం ఉంటే పంటలు మారుతాయి... ఒక రైతు ఆలోచన మారితే... ఒక ప్రాంత భవిష్యత్తే మారుతుంది. ఇది అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రైతు కథ!
- శ్యాంమోహన్, 94405 95858
ఈ వార్తలు కూడా చదవండి:
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News