తుంగభద్రకు కొత్త కవచం!
ABN , Publish Date - Apr 26 , 2026 | 06:12 AM
రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న తుంగభద్ర జలాశయం మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది.
డ్యామ్ 33 క్రస్ట్‌గేట్ల అమరిక పనులు పూర్తి
రికార్డు సమయంలో గేట్ల ఆధునికీకరణ
సాంకేతిక బృందం సాధించిన విజయం
బళ్లారి గాంధీనగర్, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న తుంగభద్ర జలాశయం మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. కీలకమైన ఈ డ్యాం భద్రతపై ఏడాదిగా నెలకొన్న ఆందోళనలకు తెరదించుతూ మొత్తం 33 క్రస్ట్‌గేట్ల ఆధునికీకరణ ప్రక్రియ శనివారంతో విజయవంతంగా ముగిసింది. దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ భారీ ఇంజనీరింగ్ అద్భుతాన్ని కాపాడుకునేందుకు 2026 ఫిబ్రవరి 16న ప్రారంభమైన ఈ యజ్ఞం యుద్ధ ప్రాతిపదికన సాగింది. రెండు నెలల వ్యవధిలోనే 33 గేట్లను బిగించి, ఎరక్షన్ పనులు పూర్తిచేశారని, ఇది సాంకేతిక బృందం సాధించిన గొప్ప విజయమని టీబీపీ బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే 25 గేట్ల ట్రయల్ రన్ పూర్తి అయిందని తెలిపారు. 15 గేట్లకు రబ్బర్ సీల్స్ కూడా వేశామని, మిగిలిన గేట్లకు సంబంధించి వెల్డింగ్, రబ్బర్ సీల్స్ ఏర్పాటు, పెయింటింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వివరించారు.
పండుగ వాతావరణం
గేట్ల అమరిక పనులు పూర్తికావడంతో తుంగభద్ర బోర్డు కార్యాలయంలో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అధికారులు తమ అనుభవాలను పంచుకున్నారు. గతంలో గేటు ప్రమాదం జరిగినపుడు ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకుండా జాగ్రత్త పడ్డామని తెలిపారు. ఇది కేవలం ఒక ఇంజనీరింగ్ పని మాత్రమే కాదని, మూడు రాష్ట్రాల రైతుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. రికార్డు సమయంలో పనులు చేయడం సంతోషంగా ఉందన్నారు. 33 క్రస్ట్ గేట్ల ఎరక్షన్ పనులు పూర్తికావడంతో సాంతికేక నిపుణుల బృందంతో డ్యామ్ సెక్రటరీ ఓఆర్‌కే రెడ్డి ఉత్సాహంగా ఫొటోలు దిగారు. ఎస్‌ఈ నారాయణ నాయక్, ఈఈ చంద్రశేఖర్, ఎస్‌డీవో జ్ఞానేశ్వర, కృష్ణకుమార్, సెక్షన్ ఆఫీసర్ కిరణ్, పంపాపతి డీకే తదితరులు పాల్గొన్నారు.
సాగు, తాగునీటికి భరోసా
వర్షాకాలం ముంగిట తుంగభద్ర జలాశయం కొత్త గేట్లతో ముస్తాబవడంతో కోట్లాది మంది తాగునీటికి, లక్షలాది ఎకరాల సాగునీటికి భరోసా వచ్చింది. కర్ణాటకలోని విజయనగర జిల్లా హొసపేట వద్ద తుంగ, భద్ర నదుల కలయికతో ఏర్పడిన జలాశయంపై 100 టీఎంసీలకు పైగా నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు దక్షిణాదిన అతిపెద్ద డ్యామ్‌ల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. 2024 ఆగస్టులో 19వ క్రస్ట్‌గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకుపోవడంతో డ్యాం భద్రతపై సందేహాలు తలెత్తాయి. నాటి చేదు జ్ఞాపకాన్ని తుడిచివేస్తూ, అత్యాధునిక సాంకేతికతతో కూడిన చైన్‌లను బిగించడంతో డ్యామ్ ఆయుష్షు పెరిగినట్లయింది.