రోడ్డు మధ్యలో భూగర్భ నీటి ట్యాంకులు
ABN , Publish Date - Apr 26 , 2026 | 09:47 AM
అగ్నిప్రమాదం జరిగితే ఫైరింజను రావాలి... మంటలు ఆర్పాలి. చాలాసార్లు ఒక ఫైరింజనులో నీళ్లు సరిపోక రెండు, మూడు ఫైరింజన్లు రప్పిస్తారు.
అగ్నిప్రమాదం జరిగితే ఫైరింజను రావాలి... మంటలు ఆర్పాలి. చాలాసార్లు ఒక ఫైరింజనులో నీళ్లు సరిపోక రెండు, మూడు ఫైరింజన్లు రప్పిస్తారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అంతా కాలి బూడిదైపోతుంది. ఈ తతంగం అంతా లేకుండా ఎక్కడికక్కడ రహదారి మధ్యలోనే భూగర్భంలో వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసిన వ్యవస్థ శాన్‌ఫ్రాన్సిస్కోలో కనిపిస్తుంది. దశాబ్దాల క్రితమే ఏర్పాటుచేసిన ఈ నీటి ట్యాంకులు... ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ప్రపంచంలోనే మరెక్కడా కనిపించని వాటర్ సిస్టమ్ ఇది...
అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందిస్తే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తక్కువగా ఉంటుంది. అగ్ని కీలలను ఆర్పేందుకు తగిన నీరు అందుబాటులో ఉంటే ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకే శాన్‌ఫ్రాన్సిస్కోలో భూగర్భ నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు అధికారులు. అదికూడా రోడ్డు మధ్యలో... భూగర్భంలో నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, పట్టణంలో నీటి సరఫరా విఫలం అయితే, ఈ నీటి తొట్టెలు ఆదుకుంటాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇలాంటి నీటి తొట్టెలు సుమారు 177దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా రోడ్డు మధ్యలో భూగర్భంలో ఏర్పాటు చేసినవే.
అగ్నిప్రమాదాల నివారణకు ...
1850లో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఘోర అగ్నిప్రమాదం జరిగి విలువైన భవనాలు బూడిదయ్యాయి. ఆ ప్రమాదం అనేక గుణపాఠాలు నేర్పింది. అందుకే అక్కడి ‘పోర్ట్స్ మౌత్ స్క్వేర్’లో మొదటిసారి నీటి తొట్టెను నిర్మించారు. అగ్నిప్రమాదాలను నివారించడం కోసం ఇంటి యజమానులందరూ ఆరు నీటి బకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీచేశారు. అయినా 1851లో మరో అగ్ని ప్రమాదం జరిగి చాలా ఆస్తి నష్టం జరిగింది. ఆ తరువాత స్థానికులు కలపతో ఇంటి నిర్మాణాలకు బదులుగా ఇటుకలతో నిర్మాణాలు చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే 1906లో శాన్‌ఫ్రాన్సిస్కో పట్టణంలో భూకంపం సంభవించింది. ఆ తరువాత మూడు రోజులకు అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 25 వేల భవనాలు కాలి బూడిదయ్యాయి.
ఇందులో చాలా ప్రమాదాలు గ్యాస్ పైపు లైను పగలడం వల్ల జరిగాయి. ప్రజలు కావాలని చేశారనే కథనాలున్నాయి. భూకంపం వల్ల జరిగిన నష్టానికి ఇన్స్యూరెన్స్ రాదు కాబట్టి కావాలని అగ్నిప్రమాదాలు సృష్టించారని అంటారు. ఆ తరువాత కూడా ప్రతీ రెండు మూడు నెలలకోసారి నాలుగైదు అగ్ని ప్రమాదాలు జరిగేవి. 1906లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు అధికారులు ఉపయోగించిన సాధారణ పైపు లైన్లు చాలా చోట్ల లీకయ్యాయి. ఆ సమయంలో అందుబాటులో ఉన్న కొన్ని నీటి తొట్టెలలో నీరే ఉపయోగపడింది. దాంతో అధికారులకు నీటి తొట్టెల విలువ అర్థమై... పట్టణంలో కొత్తగా 150 నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. దాంతో భూగర్భ ట్యాంకుల సంఖ్య 177కి చేరింది. రెగ్యులర్ వాటర్ సప్లయ్ లైన్లతో సంబంధం లేకుండా ఈ వ్యవస్థ ప్రత్యేకంగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా అగ్నిప్రమాదాల నివారణ కోసమే ఈ నీటిని ఉపయోగిస్తారు.
శతాబ్దం గడిచినా...
ఈ నీటితొట్టెలు రోడ్డు మధ్యలో ఎక్కడున్నాయో గుర్తించేందుకు వీలుగా ఇటుకలను వృత్తాకారంలో నిర్మించారు. ఈ తరహా నీటివ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. వాటర్ రిజర్వాయర్లతో పాటు పంప్ స్టేషన్లు, నీటి కనెక్షన్లు, సక్షన్లు, ఫైర్‌బోట్లు కూడా ఉన్నాయి. అత్యవసర సమయంలో ఫైర్‌ఫైటర్లకు సహాయపడేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతీ నీటి తొట్టెకు రెండు మ్యాన్‌హోల్స్ ఉంటాయి. వాటి కవర్లపై శాన్‌ఫ్రాన్సిస్కో ఫైర్ డిపార్టుమెంట్ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌డి) అని రాసి ఉంటుంది.
ఒక్కో నీటితొట్టెలో 75 వేల నుంచి 2 లక్షల గ్యాలన్ల వరకు నీరు పడుతుంది. సిటీలో ఉన్న అన్ని నీటితొట్టెలను కలిపితే సుమారు 11 మిలియన్ గ్యాలన్ల నీరు స్టోర్ చేయొచ్చు. విశేషమే మిటంటే... 1906లో భూకంపం వచ్చి శతాబ్దం గడిచినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ భూగర్భ నీటి తొట్టెలను ఉపయోగించాల్సిన అవసరం రాలేదు. అయినా కూడా పకడ్బందీగా వాటి నిర్వహణ చూస్తున్నారు. వందేళ్లు గడిచినా భూగర్భ ట్యాంకులు చెక్కు చెదరకుండా ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News