Share News

తాటి ముంజలతో మజా!

ABN , Publish Date - Apr 26 , 2026 | 08:50 AM

వేసవిలో తాటి ముంజల పేరు వింటేనే నోరూరుతుంది. ఇక వాటి పొట్టుతీసి, నోట్లో వేసుకుంటే ఐస్‌లా కరిగిపోవాల్సిందే. అందుకే వీటిని ‘ఐస్‌ ఆపిల్‌’ అంటారు.

తాటి ముంజలతో మజా!

వేసవిలో తాటి ముంజల పేరు వింటేనే నోరూరుతుంది. ఇక వాటి పొట్టుతీసి, నోట్లో వేసుకుంటే ఐస్‌లా కరిగిపోవాల్సిందే. అందుకే వీటిని ‘ఐస్‌ ఆపిల్‌’ అంటారు. లేత కొబ్బరిని తలపించే, తాటి ముంజల్లోని నీళ్లు అమృతాన్ని తలపిస్తాయి. ఏడాదిలో ఒక్కసారే.. అదీ మండే ఎండలకు చెక్‌ పెడుతూ వచ్చే తాటి ముంజలు కాలానికి తగ్గట్టుగా వివిధ రుచుల్లో లభిస్తున్నాయి. ఆ విశేషాలే ఇవి...

ఇటు పసుపు పచ్చని మామిడి పండ్లు.. అటు ఎర్రెర్రని పుచ్చకాయలు... మధ్యలో మంచును తలపించే తెల్లని తాటి ముంజలు... వేసవిలో రోడ్డుకిరువైపులా సందడంతా వీటిదే. రంగు, రుచి, రూపం పరంగా వేటికవే భిన్నమైనవి. మామిడి.. పండ్లల్లో రారాజు. పుచ్చకాయ కూడా యమ్మీనే. అయితే రుచి, గుణాలు తెలిసిన వారు మాత్రం తాటి ముంజల్నే ఎంచుకుంటారు. డజనుకు వంద, నూట యాభై రూపాయలన్నా కొనేస్తారు. ఎందుకంటే.. వేసవిలో దాహార్తిని తీర్చడమేగాక, పోషకాల గనిగా వీటికి పేరుంది. అచ్చం కొబ్బరిబోండంలా కనిపించే తాటికాయను ప్రత్యేకమైన కత్తితో కట్‌చేస్తూ, దానిలోని ముంజల్ని జాగ్రత్తగా బయటికి తీస్తారు. పైన బంగారు రంగు పొట్టుతీస్తే తెల్లని తెలుపు, పట్టులాంటి మృదుత్వం, తీయని నీళ్లు ఉన్న తాటి ముంజలు నోరూరిస్తాయి. వయసుతో నిమిత్తం లేకుండా ఇంటిల్లిపాది వీటిని ఇష్టపడతారు.


ఎన్నెన్నో పేర్లు..

వేసవిలో దాహార్తిని తీర్చే తాటి ముంజలను ఆయా ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. నుంగు(తమిళం), తడ్గోలా(హిందీ, మరాఠీ), తార్గులా(కొంకణి), తాల్ఫడీ(గుజరాతీ), నొంకు(మలయాళం), తల్లె హన్ను(కన్నడం)... ఇలా తాటి ముంజల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తున్నా.. మన దేశంలో తాటిచెట్లకు కొదవలేదు. చాలాచోట్ల ‘పామ్‌ ఐస్‌ ఆపిల్‌’ అనే తాటి ముంజలు తెల్లగా, మృదువుగా ఉంటాయి. ఏప్రిల్‌ నుంచి జులై వరకూ వీటి సీజన్‌. తాటి ముంజలతో పాటు తాటి తాండ్ర, బెల్లం, కల్లు కూడా ప్రసిద్ధి చెందాయి. ఆధునిక తరంలో వేసవి మొదలయ్యిందంటే చాలు.. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా తాటి ముంజల జ్యూస్‌, ఐస్‌క్రీమ్‌, సలాడ్‌, స్మూతీ, డెజర్ట్‌ల తయారీకి సంబంధించిన రీల్స్‌తో సందడి చేస్తున్నారు.


book3.2.jpgపోషకాల్లో మేటి

ఎక్కువ నీటి శాతం ఉన్నందున తాటి ముంజలు శరీరం నిర్జలీకరణం కాకుండా నివారిస్తాయి. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ. విటమిన్‌ సి, కె, ఈ లతో పాటు ప్రొటీన్‌, ఐరన్‌, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. అయితే.. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందుకే కొన్నవెంటనే ఫ్రెష్‌గా తినడం మంచిది. ఒకవేళ ఫ్రిజ్‌లో పెట్టినా రెండు మూడు రోజుల్లోపే తినేయాలి. ఈ కారణం వల్లే తాటి ముంజలు సూపర్‌ మార్కెట్లలో కన్నా ఎక్కువగా రోడ్లమీద బండ్లలో, బుట్టల్లో అమ్మడం చూస్తాం. ఎండాకాలాన్ని సునాయాసంగా గట్టెక్కించే ఐస్‌ ఆపిల్‌ ఇది. తాటి ముంజల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


అవేమిటంటే..

  • తాజాదనం: వేసవిలో వడదెబ్బ తగులుతుందని భయపడి ఇళ్లల్లోంచి బయటికి రావడానికి సాహసించరు. అయితే.. తాటి ముంజలు ఆరగిస్తే కొంతమేరకు డీహైడ్రేషన్‌ బారినపడకుండా కాపాడుకోవచ్చు. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్‌ చేసి వడదెబ్బకు గురికాకుండా కాపాడతాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తాయి. అందుకే వీటిని తిన్నవెంటనే శరీరం రీఫ్రెష్‌ అవుతుంది. అలసట, జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిలో తక్కువ మొత్తంలో సహజ చక్కెరలు ఉండటంతో సత్వర శక్తి కూడా వస్తుంది.

  • రోగనిరోధకత: తాటి ముంజల్లో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జలుబు, దగ్గు, ఇన్‌ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తి లభిస్తుంది.


book3.3.jpg

  • ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ: మలబద్ధకంతో బాధపడుతున్నవారు రెండు తాటి ముంజల్ని తింటే, ఉపశమనం లభిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. తాటి ముంజలలో పీచు పదార్థాలు ఎక్కువ. కాబట్టి ఇవి గట్‌ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

  • బరువు తగ్గేందుకు: తాటి ముంజల్లో తక్కువ క్యాలరీలే కాదు.. నీటి శాతం అధికం. అలాగే కొవ్వు పదార్థాలు, చక్కెర స్థాయిలు అతి సాధారణంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఛాయిస్‌. భోజన విరామ సమయాల్లో స్నాక్‌గా ఆరగించొచ్చు.

  • వాపు నివారణ: తాటి ముంజలకు శరీరాన్ని చల్లబరిచే స్వభావం ఉంది. కడుపులో అల్సర్లు, వాపు, అసిడిటీ ఉన్నవాళ్లు వీటిని తినడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఆయుర్వేదపరంగానూ శరీరంలో ఉష్ణాన్ని లేదా పిత్తను తగ్గించేదిగా పేర్కొంటున్నారు. వేసవిలో చాలామందికి వచ్చే తలపోటు వీటిని ఆరగించడం ద్వారా తగ్గుతుంది.


  • చర్మ సంరక్షణ: వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల చర్మాన్ని సంరక్షిస్తాయి. తొందరగా ముడతలు పడవు. చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. మొటిమలు, దద్దుర్లు, చెమట గుల్లలూ, పొక్కులు తగ్గుతాయి. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీటిని ఆరగించొచ్చు.

  • కాలేయ ఆరోగ్యం: పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల కాలేయ ఆరోగ్యానికి తాటి ముంజలు ఉపయోగపడతాయి. కాలేయ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్లు ఈ సీజన్‌లో వీటిని తీసుకోవడం వల్ల త్వరితగతిన ఉపశమనాన్ని పొందవచ్చు.


book3.4.jpgఇలా అనేక పోషకాలు ఉండటం వల్ల వేసవిలో అందరూ తాటి ముంజల్ని ఎంచక్కా తీసుకోవచ్చు. అయితే.. చల్లపదార్థాలు పడనివాళ్లు, అలర్జీలు ఉన్నవాళ్లు తాటి ముంజలకు దూరంగా ఉండడమే మంచిది. అలాగే ఐస్‌లా కరిగిపోతున్నాయని అధికంగా తినడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. వీటిలో లేతగా ఉండేవి, ముదురుగా ఉండేవి ఉంటాయి. పిల్లలకు ఎప్పుడైనా కాస్త లేతగా ఉన్నవే మంచివి. లేతగా ఉంటే ఎక్కువ నీటితో ఉన్నట్టు లెక్క. అదే గట్టిగా, ముదురుగా ఉన్న వాటిలో నీళ్లు తక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఈ ఏడాది ఠారెత్తిస్తున్న ఎండల్ని ఐస్‌ యాపిల్‌.. అదే తాటి ముంజలతో ఎదుర్కొనేందుకు సంసిద్ధం అవుదాం. దాహార్తిని తీర్చుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.


మనమే నంబర్‌ వన్‌

తాటి ముంజల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. ఏటా యుఎస్‌ఏ, అజర్‌బైజాన్‌లతో పాటు పంతొమ్మిది దేశాలకు తాటి ముంజల్ని ఎగుమతి చేస్తోంది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌లలో తాటిచెట్లు విరివిగా పెరుగుతున్నాయి. తమిళనాడు రాష్ట్ర అధికారిక వృక్షం తాటి. ఆఫ్రికాలోనూ తాటిచెట్లు ఎక్కువే. ఇంకా శ్రీలంక, మయన్మార్‌, ఇండోనేషియా తీరప్రాంతాలతో పాటు ఆగ్నేయాసియాలను తాటిచెట్ల విస్తృత ఆవాసాలుగా చెప్పొచ్చు.


ఇలా కూడా..

తాటి ముంజల్ని నేరుగా తినడం ఒకెత్తయితే.. వివిధ రకాలుగా కూడా వీటిని ఉపయోగించొచ్చు.

  • ముక్కలుగా కోసి వెనిగర్‌లో నిల్వ చేయొచ్చు.

  • జ్యూస్‌, షర్బత్‌, టాఫీ, బర్ఫీ, క్యాండీ, పేడా, పాయసం చేసుకోవచ్చు. మార్కెట్లో పలురకాలుగా లభిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూరగా కూడా వండుతున్నారు.

  • కొన్నిచోట్ల వీటిని ఎండలో ఆరబెట్టి వరుగులు పెట్టుకుంటారు. తాటి ముంజల పైపొట్టును నీళ్లలో ఉడికించి కూడా తింటారు.


తాటి ముంజల్లోని పోషక విలువలివే..

  • క్యాలరీలు: 43 కిలో క్యాలరీలు

  • నీళ్లు: 87 శాతం

  • కార్బోహైడ్రేట్లు: 10 గ్రా.

  • ప్రొటీన్లు: 0.8 గ్రా.

  • పీచుపదార్థాలు: 1 గ్రా.

  • విటమిన్‌ సి: 5మి.గ్రా.

  • కాల్షియం: 27 మి.గ్రా.

  • ఐరన్‌: 0.5 మి.గ్రా.

  • పొటాషియం: 128 మి.గ్రా.

  • మెగ్నీషియం: 22 మి.గ్రా.


ఈ వార్తలు కూడా చదవండి:

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అది త్యాగం కాదు.. ఎంపిక

Read Latest Telangana News and National News

Updated Date - Apr 26 , 2026 | 09:16 AM