పెదవి విరుపు మొదలైందా?
ABN , Publish Date - Apr 26 , 2026 | 02:58 AM
‘కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి రానిచ్చేదిలే! ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే నా పేరు మార్చుకుంటా!’ ఇది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన తాజా ప్రతిజ్ఞ. ‘ఎంత మంది కోరుకున్నా నేను చచ్చేదే లేదు. కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చి గోసపడుతున్నామని ప్రజలు తెలుసుకున్నారు. నేను బరాబర్ మళ్లీ అధికారంలోకి వస్తా!’ ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన ప్రతి సవాల్.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే మళ్లీ తనను అధికారంలోకి తెస్తాయని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. అది ఆయన ఇష్టం. అయితే, సొంత బిడ్డ కవిత ఇప్పుడు ఆయనకు పంటి కింద రాయిలా మారారు. సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్న కవిత కేసీఆర్‌ను ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ రెడ్డితో విభేదించిన ఆయన సోదరి షర్మిల 2024 ఎన్నికల్లో ఆయనకు ఎంతో కొంత నష్టం చేశారు. రాజకీయంగా షర్మిల నిలదొక్కుకోలేక పోతున్నా సోదరుడు జగన్ రెడ్డి నైజాన్ని ప్రజలకు వివరించడంలో మాత్రం ఆమె సక్సెస్ అయ్యారు.
పెన్షనర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడదు. 2004కు పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో, చంద్రబాబు ప్రభుత్వంలో తమకు రావాల్సిన పెన్షన్‌లో కోత విధించారన్న కసితో పెన్షనర్లు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేశారు. కేసీఆర్ హయాంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికీ పదవీ విరమణ చేసిన ఉద్యోగులు శాపనార్థాలు పెడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వమే కాదు- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆర్థిక సంక్షోభంలోనే ఉంది. మిగతా రాష్ర్టాలు కూడా ఈ జాబితాలో చేరబోతున్నాయి. ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి రాజకీయ పార్టీలే కారణం కానీ ఉద్యోగులు కాదు కదా? సమస్యలు వికటించే వరకు పట్టించుకోకపోతే ఎలా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. తన మనసులో ఏముందో, ఎటు ప్రయాణించాలని అనుకుంటున్నారో ముందుగా ఇతరులతో పంచుకోవడం లేదు. సమస్య ముదిరినప్పుడు మాత్రమే తాను ఏమనుకుంటున్నదీ మంత్రులు, అధికారులతో పంచుకుంటున్నారు. సమయ పాలన విషయంలో కూడా ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఎన్నికల హామీల కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. మంత్రులు, ప్రజా ప్రతినిధుల జీతాల్లో కోత విధించుకోవాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించుకుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం అదే బాటలో పయనించాలని అనుకుంటోంది.
‘కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి రానిచ్చేదిలే! ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే నా పేరు మార్చుకుంటా!’ ఇది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన తాజా ప్రతిజ్ఞ.
‘ఎంత మంది కోరుకున్నా నేను చచ్చేదే లేదు. కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చి గోసపడుతున్నామని ప్రజలు తెలుసుకున్నారు. నేను బరాబర్ మళ్లీ అధికారంలోకి వస్తా!’ ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన ప్రతి సవాల్.
నిజానికి ఈ ఇరువురు నాయకులు ఇటువంటి సవాళ్లకు బదులు కొంచెం ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుండేది. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి ప్రతిజ్ఞలు ఉపశమనం కలిగించవు. అధికారం కోల్పోయి రెండున్నర సంవత్సరాలైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇష్టపడటంలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫాల్తు హామీలను నమ్మి ప్రజలు మోసపోయి గోసపడుతున్నారని భావిస్తున్న కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన తప్పులను గుర్తించి సరిచేసుకోవడానికి సిద్ధపడటం లేదు. ప్రజలే తప్పుచేశారని భావిస్తున్న ఆయనను ఎవరు మార్చాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కేసీఆర్ మొదటి టర్మ్‌లో మంచిగానే పరిపాలించారు. పార్టీలో, ప్రభుత్వంలో క్రమశిక్షణ కట్టు తప్పకుండా జాగ్రత్తపడ్డారు. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో దొర పోకడలు పొడసూపాయి. వ్యవస్థలు బలహీనపడ్డాయి. అవినీతి పెచ్చరిల్లింది. తనను ప్రశ్నించిన వారందరిపైనా అలిగారు. చివరకు అన్ని వర్గాల వారినీ దూరం చేసుకున్నారు. వాస్తవాలు అంగీకరించడానికి కేసీఆర్ ఇప్పటికీ సిద్ధంగా లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలో ఎవరు ఎంత చెప్పినా ఆయన చెవికి ఎక్కడం లేదు. ప్రజలే తప్పు చేశారని ఇప్పటికీ చెబుతున్న ఆయనకు మళ్లీ చెప్పి కూడా ప్రయోజనం లేదు.
సిస్టర్స్ ఎఫెక్ట్...
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే మళ్లీ తనను అధికారంలోకి తెస్తాయని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. అది ఆయన ఇష్టం. అయితే, సొంత బిడ్డ కవిత ఇప్పుడు ఆయనకు పంటి కింద రాయిలా మారారు. సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్న కవిత... కేసీఆర్‌ను ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా పెట్టుకున్న కవిత... పార్టీ ఆవిర్భావం రోజునే తండ్రి కేసీఆర్‌ను మారిన మనిషిగా, మర మనిషిగా అభివర్ణించారు. అంటే ఇకపై ఆమె వైపు నుంచి బీఆర్‌ఎస్ అగ్రనాయకులపై దాడి పెరిగే అవకాశం ఉంది. ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు. రామాయణంలో విభీషణుడు పోషించిన పాత్రను ఇప్పుడు తెలంగాణలో కవిత పోషిస్తారా? అంటే ఇప్పుడే చెప్పలేం. కవిత వల్ల కేసీఆర్‌కు ఏ మేరకు చికాకులు ఎదురవుతాయో వేచిచూడాలి. తండ్రి, ముఖ్యంగా సోదరుడు కేటీఆర్ లక్ష్యంగా కవిత రాజకీయ పోరాటం సాగనుందని అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చినట్టేనని నమ్ముతున్న భారత రాష్ట్ర సమితి నాయకుల ఆశలపై కవిత ఎత్తుగడలు నీళ్లు చల్లుతాయో లేదో అన్నది వేచిచూడాలి. మళ్లీ అధికారంలోకి వస్తానన్న కేసీఆర్ ప్రతిజ్ఞకు కవిత ప్రతిబంధకంగా మారతారా? లేక టీ కప్పులో తుపానులా తేలిపోతారా? అంటే ఇప్పుడే చెప్పలేం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సోదరుడు జగన్‌రెడ్డితో విభేదించిన ఆయన సోదరి షర్మిల 2024 ఎన్నికల్లో ఆయనకు ఎంతో కొంత నష్టం చేశారు. రాజకీయంగా షర్మిల నిలదొక్కుకోలేకపోతున్నా సోదరుడు జగన్‌రెడ్డి నైజాన్ని ప్రజలకు వివరించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికీ షర్మిల రాజకీయంగా పెద్దగా బలపడలేకపోయారు. కవిత అలా కాకుండా సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. తండ్రిని, సోదరుడిని ఢీకొట్టబోతున్నారు. నిజానికి తెలంగాణ సమాజంలో కేసీఆర్ కుటుంబంపై ఇంకా సానుకూలత ఏర్పడలేదు. కేసీఆర్ విషయంలో అంతో ఇంతో సానుకూలత ఉన్నప్పటికీ, ఆ కుటుంబంలోని ఇతరులపై ఇప్పటికీ సదభిప్రాయం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత నిర్ణయం సాహసోపేతమైనదా? దుస్సాహసంగా మిగిలిపోతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి.
పేరు... తీరు...
కేసీఆర్ కుటుంబ పంచాయితీని కాసేపు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విషయానికి వద్దాం! కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే పేరు మార్చుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు రేవంత్‌రెడ్డి అటువంటి ప్రతిజ్ఞ చేసి ఉంటారుగానీ, ఆయన పేరు మార్చుకోవడంపై ప్రజలకు ఏమి ఆసక్తి ఉంటుంది! ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం అప్పట్లో ప్రకటించారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటించిన విధంగానే ఆయన తన పేరును పద్మనాభరెడ్డిగా అధికారికంగా మార్చుకున్నారు. అయినా పద్మనాభంగానే ఆయన చలామణి అవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా మాట వరుసకు అలా అని ఉంటారు కనుక దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారనేది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరికి వారే యమునా తీరే అన్న భావన ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పనితీరును గమనిస్తే అదే భావన కలుగుతున్నది. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరిలోనూ ఏదో తెలియని వెలితి, అసంతృప్తి ఇప్పుడు అదనంగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీలో పరిస్థితే ఇలా ఉంటే ప్రజల్లో అసంతృప్తి ఏర్పడకుండా ఉంటుందా? అదే జరుగుతోంది! అందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో పెదవి విరుపు మొదలైంది. నిజానికి కేసీఆర్ పాలన నుంచి వారసత్వంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చతికిలపడటం–పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం లోపించడం ఇందులో ప్రధానమైనవి. మంత్రులలో జవాబుదారీతనం లోపించడం ఇప్పుడు అదనం. కేసీఆర్ పాలనలో మంత్రులు డమ్మీలుగా ఉండేవారు. పాలనంతా కేసీఆర్ చుట్టూ కేంద్రీకృతమై ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధం. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పూర్తి పట్టు చిక్కలేదు. దీంతో మంత్రులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా పట్టించుకుంటే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వంలో డైరెక్షన్ లోపిస్తోంది. సమస్య ఏదైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చూసుకుంటారులే అన్న ధోరణి మంత్రుల్లో ఏర్పడింది.
అధికారులు కూడా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు. సమస్యలు ముదిరినప్పుడు హడావిడి చేయడం మినహా వాటి పరిష్కారానికి సంబంధించినవాళ్లు ఎవరికి వారు బాధ్యత తీసుకోవడం లేదు. ఉదాహరణకు, ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయమే తీసుకుందాం. సమ్మెకు పిలుపు ఇచ్చిన జేఏసీ నాయకులకు ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పటికీ వారిని పట్టించుకున్నవారే లేకపోవడంతో సమ్మెకు పిలుపు ఇవ్వాల్సిన పరిస్థితి. కేసీఆర్ పాలనలో సమ్మెకు దిగిన కార్మికులను కనీసం చర్చలకు కూడా పిలవలేదు. పైగా సమ్మెకు నాయకత్వం వహించిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించారు. సమ్మె చేస్తే సెల్ఫ్ డిస్మిస్ అన్నట్టుగా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై కార్మికుల్లో వ్యతిరేకత లేదు. అయితే ఎంతో కాలంగా తాము ప్రస్తావిస్తున్న సమస్యలపై సంబంధిత మంత్రి కానీ, అధికారులు కానీ దృష్టి పెట్టలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. సమ్మె ప్రారంభమైన రోజే శంకర్‌గౌడ్ అనే డ్రైవర్ పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గోటితో పోయేది గొడ్డలి దాకా వచ్చింది. జేఏసీ నాయకులతో సీరియస్‌గా చర్చలు జరిపి ఉంటే సమ్మె కూడా జరిగేది కాదు. శంకర్‌గౌడ్ ప్రాణాలు పోయేవీ కావు. శంకర్‌గౌడ్ ఆత్మహత్యతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చొరవతో ఈ అంశంపై చర్చ జరిగింది. చివరకు ముఖ్యమంత్రి మళ్లీ చొరవ తీసుకొని కార్మిక నాయకులతో చర్చలకు మంత్రుల బృందాన్ని నియమించారు. ఈ బృందం శుక్రవారం నాడు జేఏసీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించి సమస్యను పరిష్కరించింది. సమ్మె విరమణ జరిగింది. ఇదేదో ముందే చేసి ఉంటే ఒక ప్రాణం పోయేది కాదు కదా? ముఖ్యమంత్రి పట్టించుకుంటేనే అన్నట్టుగా పరిస్థితులు ఉండటం వల్ల ప్రస్తుత సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. చర్చలు, సంప్రదింపులతో పరిష్కారం అయ్యేవి కూడా జటిలంగా మారుతున్నాయి. ఉద్యోగులు, కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగితే ఎలా?
ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ...
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల విషయంలో కూడా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ధోరణి ఇలాగే ఉంది. ఆర్థికంగా భారం పడని సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పేరుకుపోతోంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ ఉంటాయి. జిల్లాల్లో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కౌన్సిళ్లు సమావేశమై ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. అయితే ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం లోపించడంవల్ల ఈ సమావేశాలు చాలా ఏళ్లుగా జరగడం లేదు. అధికార యంత్రాంగంలో బాధ్యతారాహిత్యం వారసత్వంగా వచ్చింది. అఖిల భారత సర్వీసు అధికారుల్లో చొరవ లోపించి జడత్వం ప్రవేశించింది. ఫలితంగా సమస్యలు పేరుకుపోవడమే కాకుండా జటిలం అవుతున్నాయి. దీనికితోడు మంత్రుల్లో కూడా ఇది మా ప్రభుత్వం అన్న ఉమ్మడి భావన లోపించడం వల్ల పరిస్థితి మరింత అయోమయంగా మారింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయి. బకాయిలు అందక పలువురు పెన్షనర్లు న్యాయస్థానం తలుపు తట్టడం, ప్రభుత్వానికి కోర్టు అక్షింతలు వేయడం చూస్తున్నాం. పెన్షనర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడదు. 2004కు పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో, చంద్రబాబు ప్రభుత్వంలో తమకు రావాల్సిన పెన్షన్‌లో కోత విధించారన్న కసితో పెన్షనర్లు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేశారు. కేసీఆర్ హయాంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికీ పదవీ విరమణ చేసిన ఉద్యోగులు శాపనార్థాలు పెడుతున్నారు. బకాయిల చెల్లింపు అనేది ప్రభుత్వంపై చట్టపరంగా ఉన్న బాధ్యత. నిధుల కొరత అని ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. తెలంగాణ ప్రభుత్వమే కాదు– ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆర్థిక సంక్షోభంలోనే ఉంది. మిగతా రాష్ర్టాలు కూడా ఈ జాబితాలో చేరబోతున్నాయి.
ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి రాజకీయ పార్టీలే కారణం కానీ ఉద్యోగులు కాదు కదా? సమస్యలు వికటించే వరకు పట్టించుకోకపోతే ఎలా? రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైంది. ఎన్జీవోలు, గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం నాయకులు ఈ ఉప సంఘం సభ్యులను కలసి తమ సమస్యలను ఏకరువు పెట్టే ప్రయత్నం చేయబోగా, ‘నేను ఉప సంఘంలో ఉన్నానా?’ అని ఇద్దరు ముగ్గురు మంత్రులు ప్రశ్నించారట! ఇది మంత్రుల పోకడలకు అద్దంపడుతోంది. రేవంత్‌రెడ్డి సర్కార్ పలు మంత్రివర్గ ఉప సంఘాలను ఏర్పాటు చేసింది. సమస్య ఎదురైనప్పుడు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేసి చేతులు దులుపుకొంటున్నారు. ఆ తర్వాత సదరు ఉప సంఘాలు ఆయా సమస్యలపై చర్చిస్తున్నాయా? లేదా? అని ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా గుర్తు చేయడంలేదు. కార్యనిర్వాహక వ్యవస్థలో పలు పెడధోరణులు ప్రవేశించాయి. ఫలితంగా వివిధ స్థాయిలలో నిర్లక్ష్యం ప్రవేశించి జవాబుదారీతనం లోపించింది. ఇందుకు రేవంత్‌రెడ్డిని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ బాధ్యులను చేయలేం. వ్యవస్థల పతనంలో భాగంగా ఇదంతా జరుగుతోంది. కాకపోతే ప్రస్తుత ప్రభుత్వంలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. సమస్య ఏదైనా దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైన మాత్రమే ఉందన్న భావన వివిధ స్థాయిల్లో ఏర్పడింది. ప్రభుత్వం అంటే ఉమ్మడి బాధ్యత అన్నభావన కొరవడింది. దీంతో భారమంతా రేవంత్‌రెడ్డిపై పడుతోంది. అలా అని స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొనే వెసులుబాటును కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఇవ్వడం లేదు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి.
రేవంత్ వైపూ లోపాలు...
అదే సమయంలో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. తన మనసులో ఏముందో, ఎటు ప్రయాణించాలని అనుకుంటున్నారో ముందుగా ఇతరులతో పంచుకోవడం లేదు. సమస్య ముదిరినప్పుడు మాత్రమే తాను ఏమనుకుంటున్నదీ మంత్రులు, అధికారులతో పంచుకుంటున్నారు. సమయ పాలన విషయంలో కూడా ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు ఉన్నాయి. తనను కలుసుకోవాలని అనుకుంటున్న వారికి అవకాశం ఇవ్వడం లేదని చెబుతున్నారు. అప్రాధాన్య అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపే ముఖ్యమంత్రి... ప్రధానమైన అంశాలు చర్చించాలనుకున్న వారికి తగిన సమయం ఇవ్వడం లేదని అంటున్నారు. వ్యక్తిగత సమస్యలు, ఇతరత్రా అంశాలపై ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్న వారికి కేసీఆర్ హయాంలో వలె ఇప్పుడు కూడా కలుసుకోవడం గగనం అవుతోందని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. సందర్శకులను, పార్టీ నాయకులను కలుసుకోని కారణంగా గతంలో చంద్రబాబు, కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారు. వారితో పోలిస్తే యువకుడైన రేవంత్‌రెడ్డి చలాకీగా అందరినీ కలుసుకోవచ్చు. ఒక పేరొందిన కార్మిక సంఘం నాయకుడు తన బిడ్డ పెళ్లికి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడానికి ప్రయత్నించి విఫలమయ్యారట! బీఆర్‌ఎస్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా పెళ్లి కార్డు ఇచ్చేందుకు వారం రోజులు ప్రయత్నించి విరమించుకున్నారట! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంత తీరిక లేకుండా ఉన్నారా? అలా ఏమీ ఉండదని చెప్పవచ్చు. ప్లానింగ్ లేకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని చెబుతున్నారు. ముఖ్యమంత్రులు బిజీగానే ఉంటారు. అలాగని కలవాల్సిన వాళ్లను కూడా కలవలేనంత తీరిక లేకుండా ఉండరు కదా! వ్యక్తులకు సంబంధించిన ఇటువంటి ఫిర్యాదులను పక్కన పెడితే, మొత్తంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమస్యల ఊబిలో చిక్కుకుపోతోంది. ఆర్థిక కష్టాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అలవిగాని హామీల అమలుకు ప్రయత్నించి, అది సాధ్యం కాక ప్రభుత్వం చతికిలపడుతోంది. రైతుబంధు వంటి పథకాన్ని కూడా విడతల వారీగా అమలు చేయాల్సిన పరిస్థితి. అప్పులు చేయనిదే పూట గడవని దుస్థితి. అమలులో ఉన్న పథకాలను అరకొరగా అమలు చేస్తే ప్రజల్లో అసంతృప్తి ప్రబలడం సహజం.
ఇప్పుడు జరుగుతున్నది అదే. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకే ఎనిమిది వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బిల్లుల చెల్లింపులో ప్రాధాన్యాలు పాటించకపోవడం, రాజకీయ పలుకుబడిని బట్టి చెల్లింపులు చేయడం వల్ల వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోంది. చిన్నా చితకా కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. సచివాలయంలో ఆర్థికశాఖ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పెట్టాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా అధికారం తమదే అని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడంలో తప్పు లేదు. ఎవరికైనా ఆత్మవిశ్వాసం ఉండాల్సిందే. అయితే ప్రభుత్వ పరంగా అందుకు అనుగుణంగా అడుగులు వేయాలి కదా? ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు. వాటిల్లో కొన్నింటిని మాత్రమే అమలుచేశారు. మిగతా వాటి అమలుకోసం ప్రతిపక్షాలు కోరుతున్నట్టుగా ప్రజలు పట్టుబట్టడం లేదు. అమలులో ఉన్న పథకాలు పకడ్బందీగా అమలైతే చాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? ఏయే పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి? వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలి. ఇప్పటి ఆర్థిక పరిస్థితులలో అందరికీ అన్నీ ఇవ్వడం అసాధ్యం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా సమీక్షించి చేయగలిగినవి ఏవి? చేయలేనివి ఏవి? అనే విషయంలో ప్రభుత్వం ముందుగా స్పష్టత తెచ్చుకోవాలి. పరిస్థితులను ప్రజలకు వివరించి చిత్తశుద్ధితో చేయగలిగినవి చేస్తే ప్రజలు అర్థం చేసుకొని సహకరిస్తారు. అలా కాకుండా వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎన్నికల్లో పరాభవం తప్పదు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలు ఎన్నికల హామీల కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. మంత్రులు, ప్రజా ప్రతినిధుల జీతాల్లో కోత విధించుకోవాలని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించుకుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం అదే బాటలో పయనించాలని అనుకుంటోంది. ఈ జీతాల కోత వల్ల అవసరమైన మొత్తం లభించదు. అయితే, పరిస్థితి తీవ్రతను చాటిచెప్పడానికి ఆ చర్య దోహదపడుతుంది.
కేసీఆర్ అధికారంలోకి వస్తే పేరు మార్చుకుంటానని ప్రకటించిన రేవంత్‌రెడ్డి ముందు ఇప్పుడు రెండు మూడు ప్రధాన కర్తవ్యాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పథకాలను పునఃసమీక్షించుకోవాలి. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా పథకాలు ఉండాలి. అలా కాకుండా ఏ వర్గానికీ సంతృప్తి ఇవ్వని విధంగా పథకాలను అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పలేం. అయితే, పెదవి విరుపు ఇప్పుడే మొదలైనందున అది వ్యతిరేకతగా మారక ముందే విరుగుడు చర్యలకు శ్రీకారం చుట్టాలి. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు అధికార పార్టీలో నెలకొన్న అసంతృప్తిని ముందుగా పారదోలాలి. లేనిపక్షంలో ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా ప్రజలకు చేరవు. ప్రభుత్వానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ఇక రెండేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. ఈ క్రమంలో పకడ్బందీ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డిపైనే ఉంటుంది. లేని పక్షంలో వచ్చే ఎన్నికల తర్వాత ఆయన తన పేరును మార్చుకోవలసి వచ్చినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ ఉండదు.