అది త్యాగం కాదు.. ఎంపిక
ABN , Publish Date - Apr 26 , 2026 | 03:43 AM
వెండితెరపై మెరిసే తారగా, కోట్లాదిమంది ఆరాధ్య నటిగా అలియా భట్ అందరికీ తెలుసు. కానీ, ఆ గ్లామర్ వెనుక ఒక పరిణతి చెందిన ఆలోచనాపరురాలు....
వెండితెరపై మెరిసే తారగా, కోట్లాదిమంది ఆరాధ్య నటిగా అలియా భట్ అందరికీ తెలుసు. కానీ, ఆ గ్లామర్ వెనుక ఒక పరిణతి చెందిన ఆలోచనాపరురాలు, తన జీవితాన్ని తనదైన షరతులతో మలచుకుంటున్న ఒక సామాన్య మహిళ ఉంది. 19 ఏళ్ల వయసులో కెరీర్ మొదలుపెట్టి, నేడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన అలియా ప్రయాణంలో ఎన్నో పాఠలు, సవాళ్లు ఉన్నాయి. తన కెరీర్, మాతృత్వం, అంతర్గత ప్రశాంతత గురించి అలియా పంచుకున్న ఆసక్తికర విశేషాలు...
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో 19 ఏళ్ల ప్రాయంలో కెరీర్ మొదలుపెట్టిన అలియా అప్పటికి, ఇప్పటికి తనలో వచ్చిన మార్పును విశ్లేషిస్తూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. ‘‘అప్పుడు నా పుట్టిన రోజును ‘హై వే’ సినిమా సెట్స్‌లో జరుపుకొన్నాను. ఆ వయసులో మనకు పక్కవారి గుర్తింపు చాలా ముఖ్యం అనిపిస్తుంది. ఎదుటివారు మెచ్చుకుంటేనే మనం సక్సెస్ అయినట్టు భావిస్తాం. ప్రతి చిన్న విషయానికి బయటి ప్రపంచం ఇచ్చే సర్టిఫికెట్ కోసం ఆరాటపడతాం. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఏమిటంటే మనకు మనమే ఇచ్చే గుర్తింపు అన్నింటి కంటే ముఖ్యం. బయట వినిపించే విమర్శల హోరును తట్టుకుని నిలబడాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. పదిమందీ ఏమనుకుంటున్నారనే దానికంటే, నా అంతరాత్మ ఏం చెబుతోంది అనేదానికే ఇప్పుడు నా ప్రాధాన్యం’’ అని చెప్పుకొచ్చింది అలియా.
స్ఫూర్తిదాయ బంధాలు
అలియా ఎదుగుదలలో ఆమె చుట్టూ ఉన్న మహిళల పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా తన తల్లి సోనీ రజ్దాన్, సోదరి షహీన్ భట్ ప్రభావం తనపై ఎంతో ఉందని చెబుతుంది అలియా. ‘‘మా అమ్మ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ. మమ్మల్ని పెంచుతూనే ఆమె తనలోని నటిని ఎప్పుడూ బతికించుకున్నారు. థియేటర్, టెలివిజన్ ద్వారా తన అభిరుచిని కొనసాగించారు. ఇక నా సోదరి షాహీన్ తన మానసిక ఆరోగ్య సమస్యల గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడింది. అది నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. నా టీంలో కూడా ఎక్కువగా మహిళలే ఉంటారు. వారి అభిప్రాయాలు, వారి సలహాలు నన్ను ఒక నటిగా, వ్యక్తిగా తీర్చిదిద్దుతున్నాయి’’అంది అలియా.
రాహా అథ్లెటిక్ కావాలి
తన కుమార్తె రాహా గురించి మాట్లాడుతున్నప్పుడు అలియా ముఖంలో ఒక ప్రత్యేకమైన వెలుగు కనిపిస్తుంది. సమాజం తల్లి అనగానే ‘త్యాగం’ అనే పదాన్ని వాడుతుందని, కానీ అది ఒక ‘ఎంపిక’ అవాలని అలియా బలంగా నమ్ముతుంది. ‘‘నేను నా కూతురి కోసం సమయం కేటాయుంచాలనుకోవడం నా ఇష్టం. అది ఎవరి కోసమో చేస్తున్న త్యాగం కాదు. రాహా ఇప్పుడు చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. భవిష్యత్తులో తను ఒక అథ్లెట్ కావాలని నేను కోరుకుంటున్నాను. తనకు పోటీతత్వం ఎక్కువ. పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులను చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. అందుకే నేను పని పట్ల ఎంతో ప్యాషనేట్‌గా ఉన్నానో తను చూడాలని కోరుకుంటాను’’ అని కుమార్తెతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టింది.
వరుస చిత్రాలతో బిజీ బిజీగా
అలియా కెరీర్ ప్రస్తుతం అత్యున్నత దశలో ఉంది. ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ (వైఆర్‌ఎఫ్)లో వస్తున్న మొట్టమొదటి మహిళా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘అల్ఫా’లో అలియా ఒక గూఢచారిగా కనిపించబోతోంది. ‘‘ఇది ఒక పెద్ద రిస్క్. ఎందుకంటే ఇండియాలో ఫిమేల్ యాక్షన్ సినిమాలు గతంలో పెద్దగా ఆడలేదు. కానీ, కథ మీద నమ్మకంతో నేను ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నాను’’ అని అలియా చెప్పుకొచ్చింది. ఇక లెజండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’ సినిమాలో తన భర్త రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌తో కలిసి అలియా నటిస్తోంది. ‘గంగూబాయి కతియావాడి’ తర్వాత భన్సాలీతో ఆమె చేస్తున్న రెండో సినిమా ఇది. అలియా ప్రస్తుతం ‘ది పేరెంట్స్ టావో టే చింగ్’ అనే పుస్తకాన్ని చదవుతోంది. షూటింగ్‌లు, ప్రొడక్షన్ పనులతో ఎంత బిజీగా ఉన్నా, తనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుంటూ అంతర్గత శాంతిని వెతుక్కునే ప్రయాణంలో ఆమె ఎంతో పరిణితి చెందిన వ్యక్తిగా కనిపిస్తోంది. నటిగా, తల్లిగా, నిర్మాతగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది అలియాభట్.
నిర్మాతగా కొత్త అడుగులు
వెండితెరపై నటిగానే కాకుండా నిర్మాతగా కూడా అలియా రాణిస్తోంది. తన సోదరి షాహీన్, బిజినెస్ మేనేజర్ గ్రీష్మతో కలిసి ‘ఎటర్నల్ షన్‌షైన్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించింది. ‘‘హృదయాన్ని తాకే కథలు చెప్పడమే మా లక్ష్యం. సినిమా అయిపోయి ఇంటికి వెళ్లినా ఆ పాత్రలు మనల్ని వెంటాడాలి. మా ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘డోంట్ బీ షై’ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ సినిమా చేశాక నేను ఎంతో సంతృప్తి చెందాను’’ అని తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.