మారిన మనిషి.. మర మనిషి
ABN , Publish Date - Apr 26 , 2026 | 05:21 AM
బీఆర్‌ఎస్ కోసం నా చెమట, రక్తం, సమయం ధారపోసి పనిచేశా. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నం. కానీ, మనం కలలు కన్న తెలంగాణ రాలేదు....
కేసీఆర్ రాజకీయ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నారు
అవినీతి చేసిన పందికొక్కులను పక్కనే పెట్టుకొని.. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
దారుణమైన నిఘా నీడలో తెలంగాణ బతికింది
సామాజిక తెలంగాణ రథచక్రం పూర్తిగా విరిగి ముక్కలైంది
హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చేస్తుంటే.. అయ్యా కేసీఆర్ అని ప్రజలు పిలుస్తున్నా కూడా సార్ బయటకు రాలేదు
ఎక్కడ, ఎవరికి చిన్న కష్టమొచ్చినా ఆ సారు బయటకు రారు.. ఎందుకంటే ఆయన ఆత్మలేని మరబొమ్మ - కవిత
కేసీఆర్ ఇప్పుడు తోడేళ్లు, గుంటనక్కల చేతిలో బందీ
అధికారం వచ్చినప్పుడే అమ్మతనం, మమకారం పోయాయి
ఆనాటి పాలనలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా
కాళేశ్వరంలో అవినీతి అని చెప్పినందుకే నా సస్పెన్షన్
బీఆర్‌ఎస్‌లో ఆత్మ పోయింది.. అందుకే టీఆర్‌ఎస్ పెట్టాను
రాష్ట్రంలో కర్కోటక, నియంత ముఖ్యమంత్రి పాలన
మెడకాయ మీద తలకాయ లేని బీజేపీ బానిస ఎంపీలు
3.5 కోట్ల మందికి అమ్మనవుతా: మునీరాబాద్ సభలో కవిత
పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేనగా’ ప్రకటన
పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో పార్టీ జెండా
కేటీఆర్‌కు పెద్దగా ఏమీ తెలియదని తీసిపారేసిన కవిత
హైదరాబాద్, మేడ్చల్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ‘‘బీఆర్‌ఎస్ కోసం నా చెమట, రక్తం, సమయం ధారపోసి పనిచేశా. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నం. కానీ, మనం కలలు కన్న తెలంగాణ రాలేదు. మన కలలు ఇప్పటికీ నిజం కాలేదు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమ రథం దారి తప్పింది. సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైంది. ఆనాటి కేసీఆర్ వేరు. ఈనాటి కేసీఆర్ వేరు. ఆనాడు చేనేత కార్మికులు చనిపోతే.. బిచ్చమెత్తి సాయం చేసిన వ్యక్తి కేసీఆర్. ఈనాటి కేసీఆర్ మర మనిషి, మారిన మనిషి’’ అంటూ తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మన మనిషి కాదని, గుంట నక్కలు, తోడేళ్ల చేతిలో బందీగా ఉన్నారని, ఆత్మ లేని మరబొమ్మగా మారారని ఆక్షేపించారు.

ఇవి సంతోషంతో చెబుతున్న మాటలు కాదని, దుఖంతో చెబుతున్న మాటలని అన్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో శనివారం ఉదయం పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు. తమ పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)గా ప్రకటించారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. ఈరోజు తన జీవితంలో మరచిపోలేని రోజు అవుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌లో ఆత్మ పోయిందని, అందుకే తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు పెట్టానని చెప్పారు. ‘బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. మంచి సాలు తీయాల్సి ఉండె. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్లలో నీళ్ల కోసం బీఆర్‌ఎస్ లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసింది. కేవలం 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చింది. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల కోసమే లక్షా 21 వేల కోట్లు ఖర్చు చేసింది. కేంద్రంతో గొడవ పెట్టుకోకపోయి ఉంటే పాలమూరు- రంగారెడ్డి పూర్తయ్యేది’’ అని వ్యాఖ్యానించారు.
పిల్లలు తప్పు చేస్తే వదిలేస్తామా!?
ప్రజలకు కష్టం వస్తే కూడా కేసీఆర్ బయటకు రావడం లేదని, ‘అయ్యా కేసీఆర్ రావాలి’ అని పిలిచినా రావట్లేదని కవిత తప్పుబట్టారు. ‘‘వెలుగుమట్లలో, హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చేస్తే వచ్చారా!? ‘అయ్యా కేసీఆర్’ రావాలి అంటే కూడా రాలేదు. నాడు ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేశారు. కానీ, పాలమూరు కోసం ఏమీ చేయలేదు. ఆనాటి కేసీఆర్ అయితే అక్కడే కుర్చీ వేసుకొని దాన్ని పూర్తి చేసేవారు. ఆనాటి కేసీఆర్ వేరు. ఈనాటి కేసీఆర్ వేరు. నాడు చేనేత కార్మికులు చనిపోతే బిక్షమెత్తి సాయం చేశారు. సింగరేణి గనిలో కార్మికుడు చనిపోతే చూసి వచ్చారు. ఇప్పుడు ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ఆ సారు రారు. చేవెళ్ల దగ్గర కష్టమొేస్త వచ్చారా? ఇప్పుడు ఆయన మారిన మనిషి. మర మనిషి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ ప్రేమ ఏమైంది!? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా!?’’ అని నిలదీశారు. ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడే బీఆర్‌ఎస్‌లో అమ్మతనం, మమకారం పోయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కర్కోటక పాలకుడి పాలన నడుస్తోందని, అర్ధరాత్రి ఇళ్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన మన పాత కేసీఆర్ ఎక్కడ ఉన్నాడని నిలదీశారు. తనను ఓడించడం ద్వారా ప్రజలు తప్పు చేశారని కేసీఆర్ అంటున్నారని, మన పిల్లలు తప్పు చేస్తే వదిలేస్తామా!? అని నిలదీశారు. కేసీఆర్ రాజకీయ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. మారిన కేసీఆర్ పంజాబ్,గుజరాత్, బిహార్‌కు పోయారని, రాష్ట్రంలో మొత్తం పీకి కట్టలు కట్టామని నేషనల్ పార్టీ అంటూ వెళ్లారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదని, పట్టించుకుని ఉంటే పాలమూరు రంగారెడ్డి పారకపోయేదా!? అని ప్రశ్నించారు. ఇక, కేటీఆర్‌కు పెద్దగా ఏమీ తెలియదని కవిత తీసిపారేశారు.

రాష్ట్రంలో కర్కోటకుడి పాలన నడుస్తోంది
రేవంత్ రెడ్డి కర్కోటక, నియంత సీఎం అని కవిత మండిపడ్డారు. ‘‘అన్ని అనుమతులూ ఉన్నా వెలుగుమట్లలో ప్రజల ఇళ్లను కూల్చేశారు. ఆ బాధతో ఒక గర్భిణికి అబార్షన్ అయింది. రెండు నెలల చిన్నారిని కాళ్లతో తన్ని చంపితే ఇప్పటికీ కేసు పెట్టలేదు. గురుకులాల్లో విషం పెట్టి విద్యార్థులను చంపుతుంటే ప్రభుత్వం స్పందించటం లేదు. కర్ల రాజేశ్‌ను లాకప్ డెత్ చేస్తే ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. అందుకే రేవంత్‌ను కర్కోటక, నియంత ముఖ్యమంత్రి అంటున్నాను’’ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇప్పుడున్న మూడు పార్టీలూ కుటుంబ పాలన, అవినీతి, బంధుప్రీతితో నిండిపోయాయని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయటం కాంగ్రెస్ అజెండా అయితే పెద్ద సార్ ఫామ్‌హౌస్‌లో ఉండి.. చిన్న సార్‌ను సీఎం చేయాలన్నది బీఆర్‌ఎస్ అజెండా అని ఆరోపించారు. సామాజిక న్యాయాన్ని ఖతం పట్టించటమే బీజేపీ సింగిల్ పాయింట్ అజెండా అని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షం తామేనని, రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తామన్నారు.
బీజేపీ ఎంపీలు బానిసలు
బీజేపీకి తెలంగాణ రావటమే ఇష్టం లేదని, తల్లిని చంపి బిడ్డను తీశారని బీజేపీ పెద్దలు అంటూ ఉంటారని కవిత విరుచుకుపడ్డారు. మెడకాయ మీద తలకాయ లేని ఒక ఎంపీ తెలంగాణ ఏర్పాటును భారత్, పాక్ విభజనతో పోల్చారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అగ్రనాయకత్వం అలా మాట్లాడినా బీజేపీ బానిస ఎంపీలు ఒక్కమాట మాట్లాడరు. సామాజిక న్యాయానికి బద్ధ వ్యతిరేకి బీజేపీ’’ అని విమర్శించారు. మహిళా బిల్లు, బీసీ బిల్లు, కులగణన బిల్లు తొక్కి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం కారణంగా భద్రాచలం వద్ద ఐదు గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉందని, అవి ఏపీకి పోయినా బీజేపీ బానిస ఎంపీలు పెదవులు తెరవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డలైతే.. సిగ్గుంటే రాముని గుడి మునిగిపోకుండా ఐదు గ్రామాలను తెలంగాణకు తీసుకురావాలని బీజేపీ ఎంపీలకు సవాల్ విసిరారు.

ఉద్యమకారులకు జరిగిందే నాకూ జరిగింది
తనను పార్టీ నుంచి బయటకు పంపిస్తే వెంటనే పార్టీ పెట్టలేదని, మారతారేమోనని పది నెలలపాటు ఎదురు చూశానని కవిత చెప్పారు. ఆనాడు ఉద్యమకారులకు జరిగిందే ఇప్పుడు తనకూ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కోసం ఇళ్లు, భూములు అమ్ముకున్న వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మనల్ని లాఠీలతో కొడితే తల్లి కోడిలా కాపాడుకోవాల్సిన కేసీఆర్ ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. అవినీతి చేస్తే కొడుకైనా, కూతురైనా వదలనని కేసీఆర్ గతంలో అన్నారని, కానీ, కాళేశ్వరంలో అవినీతి జరుగుతోందని చెప్పినందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, అవినీతి చేసిన ఆ పంది కొక్కులను పక్కన పెట్టుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ఇప్పుడు ఇల్లు మాత్రమే అలికామని, ముసళ్ల పండగ ముందుందని హెచ్చరించారు. సభకు వెళ్లడానికి ముం దు ఆమె గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఆ పదేళ్లలో ఫోన్ మాట్లాడాలన్నా భయమే
కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నా కలలు కన్న రాష్ట్రం రాలేదని కవిత తప్పుబట్టారు. ఆ పదేళ్లలో ప్రభుత్వం ఎలా పని చేయాలో అలా జరగలేదని చెప్పడానికి బాధగా ఉందన్నారు. ‘‘తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతాయని భావిస్తే రైతులకు బేడీలు వేశారు. ఇసుక దందా మీద ప్రేమతో దళితులపై లాఠీలు విరిగాయి. ఫోన్లు ఎక్కడ వింటారోనని వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా బతకాల్సి వచ్చింది. ఏ ఇద్దరు ఫోన్ మాట్లాడుకోవాలన్నా భయం. దారుణమైన నిఘా నీడలో తెలంగాణ బతికింది. మనం అనుకున్న తెలంగాణ రాలేదు. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా’’ అని కవిత వ్యాఖ్యానించారు. తన తప్పులకు భాగస్వామ్యం ఉందంటూ కేవలం క్షమాపణ చెబితే సరిపోదని, వాటిని దిద్దుకోవటానికి కష్టపడి పనిచేయాలని, అందుకే తెలంగాణ రాష్ట్ర సేనగా వస్తున్నానని చెప్పారు. రాజకీయ పార్టీకి ఆత్మ, అజెండా ఉండాలని, బీఆర్‌ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, అందుకే తమ పార్టీ వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని మూడు కోట్ల మందికి అమ్మలా పరిణతి చెందాలని అనుకుంటున్నానని, అమ్మతనంతో, ఆర్తితో పాలన జరిగినప్పుడే కష్టాలు తీరతాయని భరోసానిచ్చారు. పదేళ్లలో రెండేళ్లకోసారి నామినేటెడ్ పదవులు ఇచ్చినా 30 వేల మంది ఉద్యమకారులకు పదవులు వచ్చేవని అన్నారు.
కవిత పూరించిన పాంచజన్యం
పార్టీ పేరును ప్రకటించిన కవిత.. అదే వేదికపై తెలంగాణ రాష్ట్ర సేన అజెండాను వెల్లడించారు. పాంచజన్యం పేరుతో ఐదు అంశాలపై హామీ ఇచ్చారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న్యాయంపై దృష్టి పెడతామని ప్రకటించారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదివినా.. కేజీ నుంచి పీజీ వరకు ప్రజలపై రూపాయి భారం పడనివ్వబోమని చెప్పారు. ‘‘మా పార్టీ ఎజెండాలో మొదటిది విద్య. ఆరోజు కేసీఆర్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలను మూసేశారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస సదుపాయాలు లేవు. గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో.. బడినీ అంతే పవిత్రంగా చూడాలి. మా ప్రభుత్వం వస్తుంది. ప్రజలందరికీ నేను అమ్మనౌతాను. బిడ్డల జేబులు చూడను. తల్లిగా కడుపు మాత్రమే చూస్తాను’’ అని భరోసా ఇచ్చారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య అయినా.. కార్పొరేట్ వైద్యం చేయించుకున్నా ఉచితంగానే అందిస్తామన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తే తెలంగాణ బిడ్డలే డబ్బులు సంపాదించి ప్రభుత్వానికి ఇస్తారన్నారు. రైతుకు గౌరవం వచ్చేలా కృషి చేయటమే రైతు సంక్షేమమన్నారు. తాము రైతులమని గర్వంగా చెప్పుకునేలా చేస్తామన్నారు. ఉపాధి విషయంలోనూ తమకు స్పష్టమైన విజన్ ఉందన్నారు. యువతకు ఉపాధి అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, మంచి వ్యాపార ఆలోచన ఉంటే రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు ప్రభుత్వమే రుణం అందించి ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో ఒకే నోటిఫికేషన్లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ఉద్యమకారులు తమ యవ్వనాన్ని ఉద్యమంలో కోల్పోయారని, వారి కోసం జూన్ 2, 2014ను కటాఫ్ తేదీగా నిర్ణయిస్తూ లక్ష సూపర్ న్యూమరరీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మైనార్టీలతోపాటు అన్ని వర్గాలకు రాజకీయ అధికారం కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. మహిళ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వటంతోపాటు చిరుద్యోగులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. తెలంగాణ ప్రజలను తాను అమ్మనై కాపాడుకుంటానని, మూడున్నర కోట్ల మంది ప్రజలకు తల్లిలాంటి పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.
