బాబోయ్.. మైథోస్ ఏఐ
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:13 AM
బ్యాంకులు, టెక్ కంపెనీలు.. ఇవన్నీ సజావుగా, వేగంగా పనిచేయడానికి అభివృద్ధి చేసుకునే సాఫ్ట్‌వేర్‌లలో రకరకాల బగ్స్ ఉంటాయి! వాటిని ఉపయోగించుకుని హ్యాకర్లు ఆయా సంస్థల సర్వర్లలోకి చొరబడి డేటా చోరీ చేయడం, తమకు అనుకూలంగా.......
సాఫ్ట్వేర్లలో లోపాలు గుర్తించేందుకు ఆంత్రోపిక్ అభివృద్ధి చేసిన ఏఐ మోడల్
హ్యాకర్ల చేతిలో పడితే టెక్ సంస్థలు, బ్యాంకుల సైబర్ భద్రతకు పెను ప్రమాదం
అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. బ్యాంకుల అధిపతులతో నిర్మలాసీతారామన్ భేటీ
క్లాడ్ మైథోస్ ఏఐ.. ప్రపంచంలోని పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలను, బ్యాంకులను, ఇతర టెక్నాలజీ సంస్థలను తీవ్రంగా భయపెడుతున్న సరికొత్త కృత్రిమమేధ మోడల్ ఇది! సైబర్ భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు ఆంత్రోపిక్ సంస్థ రూపొందించిన ఈ ఏఐ మోడల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, టెక్నాలజీ కంపెనీల భద్రతకే పెనుసవాల్‌గా మారింది. ఆంత్రోపిక్ దీన్ని మార్కెట్లోకి విడుదల చేయనప్పటికీ.. కొంతమంది అజ్ఞాతవ్యక్తుల చేతుల్లోకి ఈ మోడల్ వెళ్లినట్టుగా వస్తున్నవార్తలతో మన కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై పలు బ్యాంకుల అధిపతులతో, ఆయా రంగాలకు సంబంధించిన కీలక భాగస్వాములతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి.. అప్రమత్తంగా ఉండాలన్నారు.
(సెంట్రల్ డెస్క్)
బ్యాంకులు, టెక్ కంపెనీలు.. ఇవన్నీ సజావుగా, వేగంగా పనిచేయడానికి అభివృద్ధి చేసుకునే సాఫ్ట్‌వేర్‌లలో రకరకాల బగ్స్ ఉంటాయి! వాటిని ఉపయోగించుకుని హ్యాకర్లు ఆయా సంస్థల సర్వర్లలోకి చొరబడి డేటా చోరీ చేయడం, తమకు అనుకూలంగా ఆ వివరాలను వాడుకోవడం కద్దు. అందుకే పలు కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్లలో లోపాలను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటాయి. ఎథికల్ హ్యాకర్లు తమ సాఫ్ట్వేర్లలో ఉన్న బగ్స్‌ను గుర్తిస్తే వారికి బహుమతులు కూడా ఇస్తుంటాయి. అలా కంపెనీలు తమ సాఫ్ట్వేర్లలో ఉన్న బగ్స్‌ను గుర్తించడం కోసం ఆంత్రోపిక్ సంస్థ ‘మైథోస్’ ఏఐ అనే ఒక కొత్త కృత్రిమ మేధ మోడల్‌ను అభివృద్ధి చేసింది! ప్రపంచంలో ఏ హ్యాకరూ గుర్తించలేనంత వేగంగా సాఫ్ట్‌వేర్ బగ్స్‌ను క్షణాల్లో గుర్తించే సత్తా ఈ మైథోస్ ఏఐకి ఉంది. దీనివల్ల కంపెనీలకు ఎంత ఉపయోగమో కదా.. అని అనిపించొచ్చు.
కానీ.. ఈ ఏఐ మోడల్ వల్ల ప్రపంచానికి ఎంత ప్రమాదమో దీన్ని అభివృద్ధి చేసిన తర్వాతగానీ ఆంత్రోపిక్ సంస్థకు అర్థం కాలేదు. మంచి కోసం తయారుచేసిన ఈ ఏఐ మోడల్.. టెక్నాలజీని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకునే హ్యాకర్ల చేతుల్లో పడితే వచ్చే ప్రమాదాన్ని ఆ సంస్థ గుర్తించింది. అందుకే.. ‘మైథోస్ ఏఐ’ గురించి ఈ నెల (ఏప్రిల్) 7వ తేదీన ప్రపంచానికి వివరాలు వెల్లడించినప్పటికీ, దాన్ని మార్కెట్లోకి విడుదల చేయబోమని ప్రకటించింది. నిజానికి తమ సర్వర్లను హ్యాకర్ల దాడుల బారి నుంచి కాపాడుకోవడానికి బ్యాంకులు, టెక్నాలజీ సంస్థలు అత్యంత పటిష్ఠమైన సైబర్ భద్రత విధానాలను పాటిస్తాయి. కానీ, మైథోస్ ఏఐ గుర్తించే లోపాల వల్ల కలిగే ముప్పు నుంచి రక్షించుకోవడానికి ఆ విధానాలు సరిపోవని, మరింత కఠినమైన ప్రోటోకాల్స్‌ను అనుసరించాల్సిన అవసరం ఉందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అందుకే నిర్మలా సీతారామన్ బ్యాంకర్లతో అత్యవసరంగా భేటీ అయ్యారు. బ్యాంకులు తమ వ్యవస్థలను కాపాడుకోవడానికి అగ్రశ్రేణి సైబర్ భద్రత నిపుణులను తక్షణం నియమించుకోవాలని సూచించారు. ఎక్కడైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టుగా అనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. బ్యాంకులన్నీ కలిసి రియల్ టైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ షేరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
30 ఏళ్ల నాటి లోపాలూ..
మైథోస్ ఏఐ మోడల్.. మనుషులెవరికీ సాధ్యం కాని రీతిలో సాఫ్ట్‌వేర్లలో ఉన్న వేలాది లోపాలను గుర్తించడమే కాదు.. 30 ఏళ్లుగా ప్రపంచమంతా వాడుతున్న పలు ఆపరేటింగ్ సిస్టమ్స్, వెబ్ బ్రౌజర్లలో ఏ హ్యాకర్‌కీ దొరకని లోపాలను (లెగసీ వల్నరబిలిటీస్) సైతం క్షణాల్లో గుర్తిస్తోంది. సాధారణ హ్యాకర్లకు సైతం ఎవరి సిస్టమ్‌లోకైనా చొరబడే వీలు కల్పించే ఈ ఏఐ మోడల్.. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే పెనుప్రమాదమే. అందుకే ఆంత్రోపిక్ సంస్థ ఈ మోడల్‌ను మార్కెట్లో అందరికీ అందుబాటులోకి తేకుండా.. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, గోల్డ్‌మన్ శాక్స్ వంటి ఎంపిక చేసిన 40 కంపెనీలకు మాత్రమే ఇచ్చింది. కానీ.. అనుమతి లేని వ్యక్తుల బృందానికి కూడా ఈ మోడల్ అందినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నట్టు ఆంత్రోపిక్ సంస్థ వెల్లడించింది.