ఆరోగ్యం.. ఇప్పుడు ‘ట్రాకర్ల’మయం
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:33 AM
డాక్టర్లు, రిపోర్టులు కాదు... చిన్న చిన్న గ్యాడ్జెట్లు దేహదృఢత్వాన్నీ, ఆరోగ్యస్థితినీ అంచనా వేస్తున్నాయి.
డాక్టర్లు, రిపోర్టులు కాదు... చిన్న చిన్న గ్యాడ్జెట్లు దేహదృఢత్వాన్నీ, ఆరోగ్యస్థితినీ అంచనా వేస్తున్నాయి. వాచీలూ, ఉంగరాలూ, ప్యాచ్‌లూ, బడ్స్ రూపంలో ఈ ‘వేరబుల్ స్మార్ట్ ట్రాకర్లు’ (శరీరానికి పెట్టుకునే పరికరాలు) ఒదిగిపోతున్నాయి. రోజువారీ నడిచే అడుగులు, గుండె కొట్టుకునే పద్ధతి, నిద్ర నాణ్యత, రికవరీ స్కోరు లాంటి డేటాను ఇవి రియల్ టైమ్‌లో చూపిస్తున్నాయి. ఉరుకులు పరుగుల ఆధునిక జీవితంలో ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెడుతూ, హెచ్చరికలు చేస్తున్నాయి. ఆబాలగోపాలం స్మార్ట్ ట్రాకర్ల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో వాటిపై ఓ ఫోకస్...
అరవై ఏళ్ల వయసున్న రాజేంద్రకు ఆయన కొడుకు ఒక ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ వాచ్‌ను కానుకగా ఇచ్చాడు. ఒకరోజు రాత్రి రాజేంద్ర నిద్రపోతున్నపుడు ఆయన గుండె వేగం అసాధారణంగా పడిపోయింది. స్మార్ట్ ట్రాకింగ్ ఫీచర్ ఉన్న వాచ్ వెంటనే అలారం మోగించి హెచ్చరించింది. కంగారుపడినప్పటికీ అప్రమత్తమైన కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే లక్షణాలను పరికరం ముందుగానే గుర్తించి హెచ్చరించడంతో పెద్ద ముప్పు తప్పిందని వైద్యులు చెప్పారు.
బరువు తగ్గడం, ఫిట్‌నెస్, మంచి నిద్ర; అధిక రక్తపోటు, మధుమేహం పర్యవేక్షించడం... ఇలా ఏ సమస్యకైనా సరే, వ్యక్తిగత స్థాయిలో సంబంధిత సమాచారాన్ని అందించే వేరబుల్ పరికరాలు మార్కెట్లో అందరికీ అందుబాటులోకి వచ్చాయి.
ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే ఓ ఆధునిక యువకుడి దినచర్య ఎలా ఉంటోందో చూడండి- ‘ఉదయం నిద్ర లేవగానే... ఎన్ని గంటలు నిద్రపోయానో తెలుసుకోవడానికి నా వేరబుల్ ట్రాకర్‌ను చూసుకుంటా. తర్వాత తీసుకునే క్యాలరీల పర్యవేక్షణకు అల్పాహారంగా ఏం తిన్నానో నమోదు చేస్తా. ట్రాకర్ నేను వేసే అడుగులను లెక్కిస్తుంది. ప్రతీరోజూ 10 వేల అడుగులు నడవాలనేది నా లక్ష్యం. సమాచారం అందుబాటులో ఉంది కాబట్టి... వ్యాయామం చేసేటప్పుడూ, విశ్రాంతి సమయంలోనూ నా గుండె కొట్టుకునే వేగాన్ని గమనిస్తా. అప్పుడప్పుడూ రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని చూస్తా. ప్రతీరోజూ ఎంత నీరు తాగుతున్నాను? ఏ సమయంలోనైనా ఒత్తిడి స్థాయి ఎలా ఉంటోంది?...ఇలా అనేక అంశాలను గమనించే వీలు నాకుంది.’
అందరి చూపు... వీటి వైపే...
2026లో గ్లోబల్ వేరబుల్ మార్కెట్ 150 బిలియన్ డాలర్లు దాటిందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది పెద్దలు ఒకటి కన్నా ఎక్కువ స్మార్ట్ ట్రాకర్లను ఉపయోగిస్తున్నారు. మనదేశంలోనూ వీటి వినియోగం ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదికల ప్రకారం- ప్రపంచంలోని అతి పెద్ద స్మార్ట్ వేరబుల్స్ మార్కెట్లలో భారతదేశం ఒకటి. ఏడాదికి దీని మార్కెట్ 20-30 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. గుండె జబ్బులు, మధుమేహులే కాకుండా కార్పొరేట్ సిబ్బందీ, ఆరోగ్యాభిలాషులూ ఈ డివైజ్‌లను విరివిగా వాడుతున్నారు. అవి అందించే డేటా ఆధారంగా అనుదిన వ్యాయామంలో మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత, ఉద్యోగులతో పాటు వయోధికులు సైతం వీటిని అమితంగా ఇష్టపడుతున్నారు. మన తెలుగు రాష్ర్టాల్లో చాలామంది చేతికి కొత్తగా స్మార్ట్ వాచీనో, ఫిట్‌నెస్ బ్యాండో దర్శనమిస్తోంది. ఈ తరహా గ్యాడ్జెట్లు ఇప్పుడు సామాజిక హోదాకు చిహ్నంగానూ మారాయి.
పెరుగుతున్న గిరాకీ
గత కొన్నేళ్లుగా ముఖ్యంగా కొవిడ్ తర్వాత ప్రజల్లో ఆరోగ్యస్పృహ బాగా పెరిగింది. దీంతో రక్త ఆక్సిజన్ (ఎస్‌పీ ఓటూ), హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్లున్న డివైజ్‌లకు విపరీతంగా గిరాకీ పెరిగింది. బడ్జెట్ ఫ్రెండ్లీగా.. రూ. 1500 నుంచి 5వేల రూపాయిల లోపు లభించే అద్భుతమైన ఫీచర్ల వల్ల ఇలాంటివి సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఎక్కువ స్ర్కీన్లతో ఉండే స్మార్ట్ వాచీలకు బదులు నాజూకైన లైట్ వెయిట్ స్మార్ట్ రింగులు కూడా వ్యాప్తిలోకి వస్తున్నాయి. టైటానియం, స్టెయిన్‌లెస్ స్టీల్ డిజైన్లతో రూపొంది అధిక ధరలకు లభ్యమవుతున్నాయి. ఇవి ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్‌ఈఎం), గాఢ నిద్ర, హృదయ స్పందనలు, ఉష్ణోగ్రత స్థితినీ నిరంతరాయంగా ట్రాక్ చేస్తున్నాయి.
అవసరానికి అనుగుణంగా...
హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ కొద్దికాలంగా ఓరా రింగ్‌ను ఉపయోగిస్తున్నాడు. ‘‘నేను రోజూ 8-9 గంటలు స్ర్కీన్ ముందు కూర్చుంటాను. ఓరా ఒక్కోసారి నాకు ‘రెడీనెస్ స్కోరు’ చూపించి, ‘ఈ రోజు హెవీ వర్కవుట్ అవసరం లేద’ని చెపుతుంది. ఆ రోజు లైట్ వాక్ మాత్రమే చేస్తాను’’ అని తన అనుభవం పంచుకున్నాడు.
నిద్ర, రికవరీ ట్రాకింగ్‌లో అత్యుత్తమంగా ఉన్న డివైజ్‌లు వర్కవుట్ ట్రాకింగ్‌లో బలహీనంగా ఉంటున్నాయి. కొన్నింటికి సబ్‌స్ర్కిప్షన్లు తప్పనిసరి. బిగినర్స్‌కు అనుకూలమైనవి కొన్ని, అథ్లెట్లకు అత్యుత్తమైనవి మరికొన్నీ. హై ఇంటెన్సిటీ వర్కవుట్స్‌లో కచ్చితత్వం తక్కువ ఉన్న కొన్ని డివైజ్‌లకైతే అడ్వాన్స్‌డ్ ఫీచర్లకు ప్రీమియం ప్లాన్ తీసుకోవాల్సిందే.
అందుకని ఎవరి అవసరానికి అనుగుణంగా వారు ట్రాకర్లను ఎంచుకోవాలి. ప్రాచుర్యం పొందుతున్నవాటిలో... అల్ర్టా హ్యూమన్ రింగ్ ఎయిర్, వీథింగ్స్ స్కాన్ వాచ్ 2 లాంటి డిస్‌క్రీట్ ట్రాకర్లు ఉన్నాయి. స్ర్కీన్ లేకపోవటం వల్ల చాలామందికి ఇవి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ‘ఐ ఫోన్‌తో సీమ్‌లెస్ కనెక్టివిటీ, యాక్టివిటీ రింగ్స్ ద్వారా గేమిఫికేషన్, హార్ట్ రేట్ మానిటరింగ్ చాలా కచ్చితం. కానీ బ్యాటరీ 18-24 గంటలే వస్తుంది. నిద్ర ట్రాకింగ్ సాధారణం. నోటిఫికేషన్లు ఎక్కువ వస్తాయి’ అంటారు ఓ వినియోగదారుడు. ‘నీ హార్ట్ రేట్ వేరియబిలిటీ తగ్గింది. ఈ రోజు తేలిగ్గా వర్కవుట్ చేయ్’ అంటూ వచ్చే ఏఐ ఆధారిత ఇన్‌సైట్స్.. వేరబుల్ ట్రాకర్లు వినియోగించేవారికి సంతృప్తినీ, ఉత్సాహాన్నీ ఇస్తున్నాయి.
లాభాలేమిటి?
స్మార్ట్ ట్రాకర్స్ మన దైనందిన జీవితాన్ని సులభతరంగా, క్రమశిక్షణతో కూడినదిగా మారుస్తున్నాయి.
ఆరోగ్య పర్యవేక్షణ: గుండె కొట్టుకునే వేగం, నిద్రపోయే సమయం, రక్తంలో ఆక్సిజన్ తీరు, ఒత్తిడి స్థాయిలను నిరంతరం ట్రాక్ చేయవచ్చు.
ఫిట్‌నెస్ ప్రేరణ: రోజుకు ఎన్ని అడుగులు నడిచాం, ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశాం అనేది చూపిస్తూ మనల్ని మరింత నడిచేలా ప్రోత్సహిస్తాయి. పెంచుకున్న, ఖర్చు చేసిన క్యాలరీలను పర్యవేక్షించడం... అధిక బరువు తగ్గడానికి సహాయపడతాయి.
కనెక్టివిటీ: పదేపదే ఫోనును జేబులోంచి తీసే పనిలేకుండా కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్లు చేతిపైనే చూసుకోవచ్చు. కొన్నింటిలో అయితే నేరుగా మాట్లాడే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంటోంది.
రక్షణ- భద్రత: వయోధికులు కిందపడిపోతే వెంటనే గుర్తించే ఫాల్ డిటెక్షన్, ఎస్‌ఓఎస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ లాంటి ఫీచర్లు ప్రాణాలు కాపాడే సంజీవనిలా పనిచేస్తున్నాయి.
నాణేనికి మరోవైపు...
ఐటీ ఉద్యోగిని అయిన రమ్య ఫిట్‌నెస్ ట్రాకర్ కొనుక్కుంది. రోజూ 8 గంటల గాఢ నిద్ర పోవాలని లక్ష్యం పెట్టుకుంది. ఒకరోజు ట్రాకర్‌లో నిద్ర 5 గంటలేనని చూపించింది. దాంతో ‘నిద్ర సరిపోక నా ఆరోగ్యం పాడైపోతుంది’ అనే ఆందోళన ఆమెలో మొదలైంది. ఆ టెన్షన్ వల్ల ఆమెకు నిజంగానే నిద్ర పట్టడం తగ్గిపోయింది. చివరికి కౌన్సెలర్ సలహాతో ఆ డివైజ్ పెట్టుకోవడం ఆపేశాక తిరిగి ఆమె సాధారణ స్థితికి వచ్చింది. చెన్నైలోని యోగా టీచర్ ప్రియది కూడా ఇలాంటి అనుభవమే. ‘నా స్టెప్స్ లక్ష్యం 8 వేలు. ఒక్కోసారి లక్ష్యం చేరకపోతే నాకు ఒత్తిడి వస్తుంది. అందుకే కొన్నిసార్లు ట్రాకర్ ఇచ్చే నంబర్లను విస్మరించి నా శరీరం చెప్పేది వినడం మొదలుపెట్టాను’ అంటారు. స్మార్ట్ ట్రాకర్స్ వల్ల ఇలాంటి ఇబ్బందులు మరికొన్ని ఉన్నాయి.

కచ్చితత్వ లోపం: ఇవేమీ మెడికల్- గ్రేడ్ డివైజెస్ ( వైద్య పరికరాలు) కావు. వీటి రీడింగ్స్ వంద శాతం సరైనవి అని చెప్పలేం. కొన్నిసార్లు ఊరికే చేతులు ఊపినా అడుగులు పడినట్లు చూపిస్తాయి.
హెల్త్ యాంగ్జయిటీ: వీటిని వినియోగించడంలో సమస్య ఏమిటంటే... సున్నితమైన స్వభావం ఉన్నవారి మానసిక ఆరోగ్యంపై ఇవి చూపే ప్రభావం. కొందరు తమ ట్రాకర్ అందించే సమాచారంపైనే దృష్టి కేంద్రీకరించి, దానిపై అతిగా ఆధారపడే ధోరణితో ఉంటున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘నా హార్ట్ రేట్ పెరిగిపోయింది’, ‘ఈరోజు సరిగా నిద్ర పట్టలేదు’ అని వాచ్‌లోని డేటాను చూసి అనవసరంగా కంగారుపడే మానసిక రుగ్మత (సైబర్‌కాండ్రియా)ను పెంచుకుంటున్న తీరు ఇందుకు నిదర్శనం.
తాము చూస్తున్న డేటా ఆశించినతీరులో లేకపోతే కొందరు నిరుత్సాహపడి, తమ ప్రయత్నాలను విరమించుకుంటున్నారు. ఇక పరిపూర్ణతను కోరుకునే (పర్‌ఫెక్షనిస్టులు) వ్యక్తులు తమ ఫిట్‌నెస్, నిద్ర లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే... అది వారిలో ఒత్తిడినీ, వైఫల్య భావననూ కలిగిస్తోంది. నిరంతరం అందే సమాచారం, ఆహారం, క్యాలరీలపై మితిమీరిన దృష్టిపెట్టేలా చేస్తుంది. దీనివల్ల ప్రతికూల ఫలితం ఏమిటంటే... ఆహార సంబంధిత రుగ్మతలు తీవ్రం కావడం.
డేటా గోప్యత: మన వ్యక్తిగత ఆరోగ్య సమాచారం, లొకేషన్ వివరాలు యాప్స్ ద్వారా సర్వర్లలో స్టోర్ అవుతాయి. ఈ డిజిటల్ డేటా లీక్ అయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.
చార్జింగ్ తిప్పలు: రోజువారీ వాచీల్లా వీటికి బ్యాటరీ ఎక్కువకాలం ఉండదు. తరచూ చార్జింగ్ పెట్టాల్సిరావడం ఒక అదనపు భారంగా మారుతుంది.
ట్రాకర్లు వాడుతున్నారా?
మొదటి రెండు వారాలు ట్రాకర్ అందించే డేటాను పట్టించుకోనక్కర్లేదు. వేరబుల్ ట్రాకర్‌కు శరీరం అలవాటు పడటం ముఖ్యం. పిల్లలకు, వయోధికులకు ట్రాకర్ ఇచ్చేటప్పుడు ఓవర్ మానిటరింగ్ అవ్వకుండా చూడాలి.
వైద్యుడిని సంప్రదించండి: డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. స్మార్ట్ వేరబుల్ డివైజ్‌లో రీడింగ్స్ తేడాగా వస్తే భయపడిపోరాదు. డాక్టరు దగ్గరకు వెళ్లి ప్రామాణిక పరికరాలతో పరీక్షించుకోవాలి. కార్డియాలజిస్టుల దగ్గరకు వచ్చేవారిలో 20-30 శాతం మంది కేవలం స్మార్ట్‌వాచ్‌లలో హార్ట్ రేట్ గ్రాఫ్ తేడా వచ్చిందని కంగారుపడుతూ వచ్చేవాళ్లే ఉంటున్నారు.
స్క్రీన్ టైమ్ తగ్గించండి: నోటిఫికేషన్ల కోసం డివైజ్‌ను పదేపదే చూస్తుండటం మంచిది కాదు. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. అనవసరమైన యాప్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయాలి.
రాత్రి వేళల్లో విరామం: రోజంతా వాచ్ పెట్టుకున్నా, రాత్రి పడుకునేటప్పుడో, వారంలో ఒక రోజో చేతికి కాస్త గాలి తగలనివ్వాలి. లేదంటే స్కిన్ అలర్జీలు రావొచ్చు.
బడ్జెట్, అవసరం: ఈ వేరబుల్ ట్రాకర్లు ఆరోగ్య పర్యవేక్షణ కోసమా, స్టైల్ కోసమా అనేది ఎవరికి వారు నిర్ధారణ చేసుకోవాలి. అవసరమేనని భావిస్తే తమ బడ్జెట్‌కు అనుగుణంగా కొనుగోలు చేయడం మేలు. బ్రాండెడ్, నమ్మకమైన కంపెనీల ఉత్పత్తులనే ఎంచుకోవాలి.
డేటా అద్భుతమే కానీ...
ఆందోళన రుగ్మతతో బాధపడుతున్నవారూ, ఆరోగ్యసమస్యల విషయంలో ఆందోళన చెందే స్వభావం ఉన్నవారూ ట్రాకర్లను ఉపయోగించడం వల్ల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది. ఇలాంటివారు థెరపిస్టుల, మానసిక వైద్యుల సలహామేరకు వీటిని వాడటం శ్రేయస్కరం. వేరబుల్ ట్రాకర్లు డేటాను అందిస్తాయి. కానీ ఆ డేటా భావోద్వేగాలనూ, ఆత్మవిశ్వాసాన్నీ నియంత్రించకుండా జాగ్రత్తపడాలి. ట్రాకర్ల వాడకం ఓవైపు గణనీయంగా పెరుగుతుంటే... ఇవి అందర్నీ సంఖ్యల బానిసలుగా మార్చేస్తున్నాయనే విమర్శ కూడా మరోపక్క వినిపిస్తోంది. ఇవి ‘సహాయక పరికరాలు’ మాత్రమే. ‘యజమానులు’ కావని గ్రహించాలి.
సాంకేతికతను జీవన శైలి మెరుగుపరుచుకోవడానికి ఒక టూల్‌లా వాడుకోవాలి తప్ప వాటికి బానిసలు కాకూడదు. స్మార్ట్ ట్రాకర్ల ఫలితాలకు పరిమితులున్నాయి. వ్యాధి నిర్ధారణకూ, వైద్యుల సేవలకూ ఇవి ప్రత్యామ్నాయం ఎంతమాత్రం కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యం తీరుతెన్నుల అవగాహనకు ఇవి తోడ్పడతాయి. అవి చూపించే డేటాతో ముందస్తుగా మేలుకొని, వ్యక్తిగత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అయితే శరీరం ఇచ్చే సహజ సంకేతాలను గమనించడం ఎప్పుడూ మర్చిపోకూడదనేది అందరూ గ్రహించాల్సిన ఆరోగ్యసూత్రం.
1980లలో అథ్లెట్ల కోసం హార్ట్ రేట్ మానిటర్లు వచ్చాయి. 2009 నుంచి ట్రాకర్ల ఉత్పత్తి వాణిజ్యపరంగా విజయం సాధించింది.
కొవిడ్ సమయంలో ఆరోగ్య అవగాహనతో పాటు ట్రాకర్లకు డిమాండ్ భారీగా పెరిగింది.
2034 నాటికి వేరబుల్ ట్రాకర్ల మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా 486 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని అంచనా.
స్క్రెస్-స్లీప్ ట్రాకర్లు... హృదయ స్పందన రేటు, చర్మ ఉష్ణోగ్రత, రక్తంలోని ఆక్సిజన్ ఆధారంగా ఒత్తిడి స్థాయినీ, నిద్ర దశలనూ విశ్లేషిస్తాయి.
ఏఐ ఇంటిగ్రేషన్‌తో ఎనర్జీ స్కోరు, ప్రిడిక్టివ్ హెల్త్ ఇన్‌సైట్స్ వస్తున్నాయి. స్మార్ట్ రింగ్స్, ఇతర శరీరావయవాలపై వేరబుల్స్ కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి.
- సండే డెస్క్
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఇవే..
బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా?
Read Latest AP News And Telangana News And International News And Telugu News