వెనెజువెలా భూకంపాలు.. కుమార్తెను కాపాడుతూ ఫుట్‌బాల్ ఆటగాడి భార్య మృతి..
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:23 AM
వెనెజువెలాలో ఈ నెల 24న సంభవించిన రెండు భారీ భూకంపాల్లో ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు హెక్టర్ బెల్లో భార్య ఆండ్రియా మృతిచెందారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేస్తూ బెల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కరాకస్: వెనెజువెలాలో ఈ నెల 24న సంభవించిన రెండు భారీ భూకంపాల్లో ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు హెక్టర్ బెల్లో భార్య ఆండ్రియా మృతిచెందారు. భూప్రకంపనలకు హెక్టర్ బెల్లో నివాసం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో బెల్లో ఇంట్లో ఆయన భార్య ఆండ్రియా, ఏడాది కుమార్తె అలనా ఉన్నారు. కుమార్తెను రక్షించే క్రమంలో బెల్లో భార్య మృతిచెందారు. చిన్నారి ప్రాణాలతో బయటపడగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన సతీమణి మృతిచెందిన విషయాన్ని సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేస్తూ బెల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
బెల్లో భావోద్వేగ పోస్టు..
'ఆండ్రియా.. నువ్వు ఎప్పటికీ మా అభిమాన హీరోవే. నువ్వు ఎంత అద్భుతమైన దానివో, అలనాను ఎంతగా ప్రేమించావో మన పాప గుర్తుంచుకునేలా చూసుకుంటా. నువ్వు అలనాను ఎలా కాపాడావో, నీ ప్రాణాలను ఎలా అర్పించావో, నీ చివరి శ్వాస వరకు ఆమెను ఎలా విడిచిపెట్టకుండా ఉన్నావో చెబుతాను' అని బెల్లో ఆవేదనతో పోస్టు పెట్టారు. మరోవైపు తన కుమార్తెను ఉద్దేశిస్తూ.. 'అలనా.. నువ్వు ధైర్యంగా ఉండాలి. ముక్కలైపోయిన నా హృదయాన్ని నువ్వే ఓదార్చాలి. ఎప్పటిలా నీ నాన్నను బలంగా, నవ్వుతూ చూడలేవు. కానీ నిన్ను నేను నయం చేసి ఈ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన అమ్మాయిగా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేస్తున్నా. ఇప్పుడు నువ్వు, నేను మాత్రమే ఉన్నాము. స్వర్గం నుంచి మీ అమ్మ మనల్ని చూసుకుంటోంది. ఆండ్రియా నాకు బలాన్ని ఇస్తుందని తెలుసు. మీ అమ్మకు నాతో మాట్లాడటానికి ఒక్క నిమిషం సమయం దొరికితే, తాను నిన్ను కాపాడినట్లే నన్నూ కాపాడమని చెబుతుంది' అంటూ భావోద్వేగ పోస్టు పెట్టారు.
కాగా, వెనెజువెలాలో గత బుధవారం సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించాయి. దీంతో దేశ రాజధాని కరాకస్ సహా లా గువేరా, యరాకుయ్, కారబోబో ప్రాంతాల్లో భారీగా భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో 1,430 మంది ప్రాణాలు కోల్పోగా, వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 51 వేల మంది గల్లంతయ్యారు. 300 మందిని అధికారులు సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా పలువురిని కన్నీటిపర్యంతం చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
కరాచీలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి..
మళ్లీ యుద్ధం మొదలవుతోందా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..